ఆహారభద్రతే... ఆకలిచావులకు మందు!

Nedunuri Kankaiah Sandharbham Food Security Starvation Deaths - Sakshi

సందర్భం

కరోనా, అంతర్గత అస్థిర రాజకీయ పరిస్థితులు, కరువు కాటకాలు వంటి వాటివల్ల ప్రపంచంలో చాలా దేశాలలో ఆకలి చావులు అధికంగా ఉన్నాయనీ, కరోనా వైరస్‌ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారాయనీ పేద రిక నిర్మూలన కోసం కృషి చేసే ‘ఆక్స్‌ ఫామ్‌’ సంస్థ వెల్లడించింది. ఆకలి కార ణంగా ప్రపంచంలో ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువగా వుంది అని అంచనా వేసింది. ఆ సంస్థ ‘ది హంగర్‌ ముల్టిప్లయిస్‌’ అనే పేరుతో నివేదికను విడుదల చేసింది.

2021 ఏడాది నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు. అదనంగా 11 కోట్ల మంది ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థ వైఫల్యం, లోపభూయిష్ఠమైన ఆహారభద్రత విధానం, నిరుద్యోగం, ఆహార కొరతల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య అధికమవ్వడం వంటి విషయాలు ఈ నివేదిక వెల్లడించింది..

మన దేశంలో 2021–22లో 315 మిలియన్‌ టన్నుల రికార్డ్‌ స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ స్వయం సమృద్ధి దశకు చేరినా పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా 2018లో 13.8 శాతం ఉండగా...  2020 నాటికి 15.3 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఆశించిన మేరకు పెరగలేదు. కొనుగోలు సామర్థ్యం కొరవడింది. పోషకాహారం లోపం వల్ల ఆకలి చావులు పెరుగుతున్నాయి.
భారత్‌లో దాదాపు 14 శాతం ప్రజలు పోషకా హార లోపంతో, ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు 20 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 52 శాతం రక్తహీనతతో సతమతమౌతు న్నారని అంచనాలు తెలుపుతున్నాయి.

2021 ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో 116 దేశా లను చేర్చారు. ఇందులో భారతదేశం అట్టడుగున 101వ స్థానంలో ఉండటం విచారకరం. 2020లో భారతదేశం స్థానం 94 కాగా, 2021 నాటికి 101 స్థాయికి దిగజారింది. శ్రీలంక 65, బంగ్లాదేశ్‌ 76, పాకిస్తాన్‌ 92 స్థానాల్లో ఉండటం ఈ సందర్భంగా గమ నించాలి. ఆకలితో అల్లాడుతున్న ప్రజలు నివసించే ప్రాంతాలు గుర్తించి వారికి సకాలంలో ఆహార ధాన్యాలు అందించాలనీ, ఆకలితో ఎవ్వరూ చని పోకూడదనీ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ చేసిన వ్యాఖ్యలైనా ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొలుపు తాయేమో చూడాలి. 

ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చెయ్యాలి. ఆహార భద్రత అంటే బియ్యం, గోదుమలు ఇవ్వడం కాదు. దారిద్య్రరేఖకు కింద వున్నవారికి పౌష్టికాహారం అందించడం. అప్పుడే పేద వర్గాలలో ఆహార భద్రత కలుగుతుంది. ఆహార వ్యవసాయ సంస్థ ప్రకారం ప్రజలు ఆరోగ్య దాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సుర క్షిత పౌష్టికాహారం ప్రజలందరికీ అందించాలి. ప్రభుత్వ పంపిణీ విధానం ద్వారా పేదలకు ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకు సరఫరా చేయాలి. అంగన్‌వాడీ పిల్లలకు పోషకాహారం సరఫరా చేయాలి. అణగారిన వర్గాలకు, గిరిజనులకు, మురికి వాడల్లో నివసించే వారికి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందజేయాలి. అప్పుడే ప్రజలందరికీ ఆహార భద్రత చేకూరుతుంది.


నేదునూరి కనకయ్య 
వ్యాసకర్త తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షులు
మొబైల్‌: 94402 45771

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top