కెడిసేథి; ఒక తరం సైద్ధాంతిక స్వరం

Mallepally Laxmaiah Guest Column On Krishan Dev Sethi - Sakshi

కొత్త కోణం

‘‘భారతదేశంలో ఐక్యమయ్యే ప్రక్రియను ఏ శక్తులూ అడ్డుకోలేవు. కానీ ఈ ఐక్యత, విలీనం ప్రభు త్వంతో మాత్రం కాదు. భారత దేశంలోని అశేష ప్రజానీకం, కార్మి కులు, కర్షకులతో మనం కలిసి పనిచేయబోతున్నాం. భూ సంస్కర ణలను అడ్డుకుంటున్న రాచరిక పాలనను మనం అనుసరించ కూడదు. ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు. దేశ రైతాంగంతో పాటు, తెలంగాణ రైతులు కూడా మన వెనుక ఉంటారు. ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులు, వ్యక్తులు పార్ల మెంటులోనూ, బయటా మనకు మద్దతిస్తారని నేను విశ్వ సిస్తున్నాను.’’

కశ్మీర్‌ విప్లవోద్యమ నాయకుడు, నక్సలైట్‌ ఉద్యమనేత కె.డి.సేథి తన 26వ ఏట జమ్మూ–కశ్మీర్‌ రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగ వాక్యాలివి. కె.డి.సేథిగా అందరికీ పరిచ యమున్న క్రిషన్‌ దేశ్‌ సేథి జనవరి 28న, తన 93వ ఏట తుదిశ్వాస విడిచారు. ఆయన కశ్మీర్‌ రాజ్యాంగ సభ సభ్యులలో చివరివాడు. కశ్మీర్‌ను ఒకవైపు భారతదేశంలో విలీనం చేస్తూనే, తనకంటూ ఒక రాజ్యాంగాన్ని జమ్మూ కశ్మీర్‌ నిర్మించుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిన ఆ రాజ్యాంగ సభలో సేథి అందరికన్నా వయస్సులో చిన్నవారు. అయినప్పటికీ జూన్‌ 11, 1952న ఆయన చేసిన ప్రసంగం ఎంతో సైద్ధాంతిక చైతన్యాన్ని ప్రదర్శించింది. ‘‘అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాలు ప్రజా స్వామ్య ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్నాయి. కానీ పెట్టుబడి దారులకే ప్రజాస్వామ్య కేంద్రాలు. ప్రజలకు ఓటింగ్‌ హక్కు ఇవ్వడం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. మనం ఆశిస్తున్నది, విశ్వసిస్తున్నది సామాజిక ప్రజాస్వామ్యం’’ అంటూ ఆయన నిజమైన ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేశారు. 

కె.డి. సేథి జమ్మూ ప్రాంతంలోని మీర్‌పూర్‌లో జనవరి 1న 1928లో జన్మించారు. 15 ఏళ్ళ వయస్సులోనే ప్రజా ఉద్యమంలో అడుగుపెట్టారు. తెలుగు ప్రజల ఉద్యమాలు, ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటమంటే ఎనలేని ప్రేమ. 1975లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలోని సీపీఐ (ఎంఎల్‌) పార్టీలో చేరారు. సత్యనారాయణ సింగ్‌ నాయ కత్వంలో ఉన్న సేథి అంతిమంగా చండ్ర పుల్లారెడ్డితోనే కొనసాగారు. అప్పటి కేంద్ర కమిటీ నాయకులు పైలా వాసుదేవరావుతో పాటు నక్సలైట్‌ ఉద్యమ నాయకులతో ఎంతో సన్నిహిత సంబంధాలుండేవి. ఐఎఫ్‌టియూ వ్యవ స్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. అనేక సార్లు తెలుగు రాష్ట్రా నికి వచ్చారు. విప్లవోద్యమంతో సంబంధాలున్న 1977 నాటి కార్యకర్తల్లో ఆయన పేరు తెలియని వారుండరు. చండ్ర పుల్లారెడ్డి మరణానంతరం జరిగిన బహిరంగ సభకు హాజరై హృదయపూర్వక నివాళులు అర్పించారు. సీపీఐ ఎంఎల్‌ పార్టీలో వచ్చిన చీలికల అనంతరం కూడా విప్లవోద్యమం లోనే కొనసాగారు. 

ఆయన మొట్టమొదట నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులైన సర్దార్‌ బుద్‌సింగ్, రాజ్‌ మహమ్మద్‌ అక్బర్‌ ఖాన్, మౌలానా అబ్దుల్లా లాంటి సీని యర్‌ నాయకులతో  పనిచేసిన అనుభవం సేథి సొంతం. 1946లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన క్విట్‌ కశ్మీర్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అందుకుగానూ రెండేళ్ళ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కశ్మీర్‌ మహారాజు రాచరిక పాలనలో సాగిన అకృత్యాలకు, దోపిడీకి వ్యతి రేకంగా సాగిన ఉద్యమంలో కూడా ఆయన పాత్ర మరువ లేనిది. డోగ్రా ప్రాంతంలో భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు చేసిన దాడులను ప్రతిఘటించడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. రైతులను, కూలీలను ఈ ప్రతిఘటనలో సమీకరించడంలో సఫలీకృతులయ్యారు.

1953లో షేక్‌ అబ్దుల్లాతో వచ్చిన విభేదాల వల్ల నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి బయటకు వచ్చి, డెమొక్రటిక్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్థాపించారు. లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. ప్రారంభం లోనే ఆ పార్టీకి 19 మంది శాసనసభ్యులుండేవారు. అయితే ఆ తర్వాత డెమొక్రటిక్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తగినంత ప్రతి ఘటనను ప్రదర్శించలేకపోవడం వల్ల సీపీఐలో, ఆ తర్వాత సీపీఎంలో, దాని నుంచి సీపీఐ(ఎంఎల్‌)లో చేరారు. 

జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటికీ బలమైన ఉద్యోగ సంఘానికి ఆయన నాయకత్వం వహించారు. అదే సమయంలో రాజ కీయపరమైన సిద్ధాంతాలను పత్రికల ద్వారా ప్రజలకు తెలి యజేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కశ్మీర్‌ విషయంలో ఆయన అభిప్రాయాలు విలువైనవి. ఇటీవల భారతీయ జనతా పార్టీ జమ్మూ–కశ్మీర్‌ను మూడు భాగాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో 1999లో రాసిన ఒక వ్యాసంలో తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇది అమెరికా సామ్రాజ్య వాదుల కుట్రగా ఆయన అభివర్ణించారు. 1950లో ఐక్య రాజ్యసమితి నియమించిన డిక్షన్‌ కమిటీ కశ్మీర్‌ను విభజిం చాలని సూచించింది. ఇది కశ్మీర్‌ ప్రజల మనోభావాలకు విరుద్ధమైనదని ఆయన విమర్శించారు. జమ్మూ–కశ్మీర్‌లోని జమ్మూ, లద్దాఖ్, కశ్మీర్‌ ప్రాంతాలు సాంస్కృతికంగా, ఆర్థి కంగా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయనీ, ఈ విభజన కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం కాదనీ అన్నారు. ఈ రోజు కూడా ఈ విభజన సత్ఫలితాలను ఇస్తుందనే విశ్వాసం ఎవరికీ లేదు.

అందుకుగానూ ఆయన పరిష్కార మార్గాలు కూడా విడమర్చి చెప్పారు. మొదటిది, పాకిస్తాన్‌–భారత్‌ రెండు దేశాలు చిత్తశుద్ధితో చర్చలు జరిపి, కశ్మీర్‌ విషయంలో ఒక అంగీకారానికి రావాలి. ఇందులో అమెరికాలాంటి సామ్రాజ్యవాద దేశాల ప్రమేయం ససేమిరా ఉండకూడదని హెచ్చరించారు. రెండో విధానం, కశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల, వర్గాల, మతాల ప్రజలతో విస్తృతంగా చర్చించి, కొన్ని పరిష్కారాలను నిర్ధారించాలి. గత ప్రభుత్వాలు గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ అటువంటి ప్రయత్నం చేయలేదు. చేస్తారనే నమ్మకం కూడా లేదు. కె.డి. సేథీకి భారత ప్రజాస్వామిక, విప్లవోద్యమంలో ఉన్నతమైన స్థానం ఉంది. ఆయన సాగించిన ఉద్యమాలు, చేసిన ఆలోచనలు భవిష్యత్‌ ప్రజాస్వామిక ఉద్యమాలకు, విప్లవ పోరాటాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. 20వ శతాబ్దం విప్లవ యోధులలో చివరి హీరోగా, ఎన్నో జ్ఞాప కాలను, అనుభవాలను భారతదేశ పీడిత ప్రజలకు ఆయన అందించారు. ఆ అనుభవాలే వర్తమాన రాజకీయ పరిస్థితు లను ఎదుర్కోవడానికి స్ఫూర్తిగా నిలుస్తాయి.


మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top