జగ్జీవన్‌రామ్‌.. నవభారత క్రాంతదర్శి

Jagjivan Ram Jayanthi Guest Column By Dokka Manikya Varaprasad - Sakshi

సందర్భం

జగ్జీవన్‌రామ్‌ దేశ ప్రజానీకానికి ‘బాబూజీ’గా సుపరిచితుడు. బాల్యం, విద్యాభ్యాసం బిహార్‌లోని ‘అర్రా’లో కొనసాగాయి. ఇక్కడే ఆయనకు మదన్‌ మోహన్‌ మాలవీయ వంటి ఉద్దండు లతో పరిచయం ఏర్పడింది. ఉన్నత విద్యాభ్యాసానికి బెనారస్‌ హిందూ విశ్వ విద్యాలయానికి ఆహ్వానించాడు మాల వీయ. కలకత్తాలో చదువుకునే రోజుల్లో కార్మిక సభకు నాయకత్వం వహించి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వంటి పెద్దల దృష్టిని ఆకర్షించాడు. 1934లో బిహార్‌లో సంభ వించిన తీవ్ర భూకంప అనంతర కార్యక్రమాల వల్ల మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. 

రైతుల హక్కులకు మద్దతుగా ఆనాడే కేతిహార్‌ మజ్దూర్‌ సభను స్థాపించాడు. ‘ఆలిండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌’ ద్వారా దళిత బహుజనుల హక్కుల కోసం ఉద్యమించాడు. 1935లో హమాండ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ‘డీలిమిటేషన్‌’ కమిటీ ముందు హాజరై దళితులకు ఓటు హక్కు కావాలని నినదించాడు. రాజ్యాంగ రచనా సంఘ సభ్యునిగా బిహార్‌ నుండి ఎంపిక య్యాడు. రాజ్యంగసభ మైనార్టీ హక్కుల సబ్‌ కమీటికి ఎంపికై సభలో వారి హక్కుల రక్షణకై మట్లాడాడు. అంటరానితనం నిర్మూలనకు, వెనుకబడిన వర్గాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వే షన్లు పొందేందుకు ఎస్సీ, ఎస్టీలకు చట్ట సభల్లో సీట్లు రిజర్వు కావడానికి విజయవంతమైన పాత్ర పోషించాడు. 

భారత పార్లమెంటుకు దాదాపు నాలుగు దశాబ్దాలు పార్లమెంటేరియన్‌గా కొనసాగాడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా కనీస వేతన చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ (సవరణ) చట్టం, బోనస్‌ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేశాడు. ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్‌ ఫండ్‌ వంటి చట్టాల ద్వారా ‘సామాజిక భద్రత’ అంశానికి పునాది వేశాడు. ఫ్యాక్టరీస్‌ చట్టం ద్వారా మహిళలు, బాలలు ప్రమాదకర పరిశ్రమల్లో, వృత్తుల్లో పని చేయడాన్ని నిషేధించాడు. కార్మికుల పనిగంటలు నిర్ధారించాడు. అదనపు పనికిగాను అదనపు చెల్లింపులకు శ్రీకారం చుట్టాడు. కాంట్రాక్ట్‌ లేబర్‌ సంక్షేమ విధానాన్ని ప్రవేశపెట్టాడు. కార్మికుల కోసం ఒక జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేసి జస్టిస్‌ గజేంద్ర గట్కర్‌ను అధ్యక్షుడిగా నియమించాడు. 

రైల్వేశాఖా మంత్రిగా రైల్వేలను ఆధునీకరించి చార్జీల భారం పేద ప్రజానీకంపై పడకుండా సంస్కరణలు చేపట్టాడు. ఇక దేశ రక్షణ మంత్రిగా ఆయన చూపిన దీక్షా దక్షతలు నేటికీ ఆదర్శ నీయమే. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు సియాచిన్‌ పర్వత శ్రేణులలో సైనికులతో కలసి తిరిగాడు. ‘యుద్ధం పాకి స్తాన్‌ భూభాగంలో మాత్రమే జరగాలి’, భారత్‌ భూభాగంలో కాదని భారత సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. భారత సైన్యం విజయం సాధించిన మొదటి యుద్ధానికి జగ్జీవన్‌ నాయకుడిగా ఉండటం ఒక చారిత్రక విషయం.
వ్యవసాయశాఖా మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికాడు.

ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి నిరు పేదల ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టాడు. స్వామినాథన్‌ వంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ‘జగ్జీవన్‌రామ్‌ గొప్ప దార్శనికుడు. ఆహార సమస్యను తీర్చేందుకు ఆయన చూపిన చొరవ, అనుసరించిన శాస్త్రీయ పద్ధతులు’ తనకు గొప్ప స్ఫూర్తి నిచ్చాయని పేర్కొ నడం బాబుజీ దార్శనికతకు నిదర్శనం. ఈ దేశ ప్రజల చేత ‘బాబూజీ’ అని పిలిపించుకున్న గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు జగ్జీ వన్‌రామ్‌. గొప్ప దేశభక్తుడు, జాతీయ నాయకుడు, మానవీయ మూర్తి, భారతమాత ముద్దుబిడ్డ అయిన బాబూ జగ్జీవన్‌రావ్‌ును ‘భారతరత్న’గా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.

- డొక్కా మాణిక్య వరప్రసాద్‌
వ్యాసకర్త ఎమ్మెల్సీ, మాజీమంత్రి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top