భారత ఏకీకరణకు అంబేడ్కర్‌ పునాది

Indian Constitution Day: Raja Sekhar Vundru Special Story - Sakshi

విశ్లేషణ: నేడు రాజ్యాంగ దినోత్సవం

స్వతంత్ర భారత ఏకీకరణ కర్తగా చరిత్రకెక్కిన సర్దార్‌ పటేల్‌ కంటే చాలా కాలం క్రితమే అంటే 1931లోనే అంబేడ్కర్‌.. దేశమంతటా విస్తరించి ఉన్న సంస్థానాలు విలీనం కావడం ద్వారా భారత ఏకీకరణ అనివార్యమని చెప్పి ఉన్నారు. భారత్‌ను వదిలి వెళుతున్నందున దేశంపై తన సార్వభౌమాధికారం ఇక చెల్లదని, తమ తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో సంస్థానాలు చేరవచ్చు లేక స్వతంత్రంగా ఉండవచ్చు అంటూ 1946వో బ్రిటిష్‌ కేబినెట్‌ మిషన్‌ చేసిన ప్రకటన డొల్లతనాన్ని న్యాయకోవిదుడిగా అంబేడ్కర్‌ విప్పి చెప్పారు. కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వానికి అంతకు ముందటి ప్రభుత్వం చలాయించిన కొన్ని హక్కులు వారసత్వంగా సంక్రమిస్తాయంటూ వారసత్వానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టం చెబుతోందని అంబేడ్కర్‌ పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విదేశీ ప్రభుత్వాలుగా సంస్థానాల ఉనికిని భారత్‌ గుర్తించదని అంబేడ్కర్‌ తేల్చిచెప్పారు. సంపూర్ణ ఏకీకరణ పూర్తి చేసుకున్న స్థిరమైన జాతిగా భారత్‌ను ముందుకు నడిపించారు.

వైవిధ్యపూరితమైన భారతదేశం కోసం హక్కుల ప్రాతిపదికన రాజ్యాంగ రూపకర్తగా సుపరిచితులైన బీఆర్‌ అంబేడ్కర్‌ భారత ఏకీకరణలో కూడా అద్వితీయ పాత్ర నిర్వహిం చారు. భారత్‌ తొలి హోంమంత్రిగా, స్వతంత్ర భారత్‌ని ఏకీకరణ చేసిన వాడిగా కీర్తిపొందిన సర్దార్‌ పటేల్‌ కంటే చాలా కాలం క్రితమే అంటే 1931లోనే అంబేడ్కర్‌.. చెల్లాచెదురుగా విస్తరించి ఉన్న సంస్థానాలు భారత్‌లో విలీనమైపోవడం ద్వారా భారత్‌ ఏకీకరణ అనివార్యమని చెప్పి ఉన్నారు. భారత యూనియన్‌లో చేరబోమని, కొత్తగా ఏర్పడిన ఐక్యరాజ్య సమితికి అప్పీల్‌ చేస్తామన్న హైదరాబాద్‌ నిజాం, ట్రావెన్‌కోర్‌ సంస్థానాల తలంపును 1947 జూన్‌లో న్యాయపరంగానే చెల్లకుండా చేసిన ఘనత కూడా అంబేడ్కర్‌దే.

భారత ప్రభుత్వం 1935 చట్టం నిర్దేశకత్వంలో నిర్వహించిన మూడు రౌండ్‌ టేబుల్‌ సదస్సులకూ హాజరైన అతికొద్దిమంది వ్యక్తుల్లో అంబేడ్కర్‌ ఒకరు. గాంధీ రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు హాజరయ్యారు. 1930లలో లండన్‌లో జరిగిన ఈ సదస్సులలో దురదృష్టవశాత్తూ సర్దార్‌ పటేల్, జవహర్‌లాల్‌ నెహ్రూలకు ప్రతినిధులుగా పాత్ర లేకపోయింది. వారు హాజరై ఉంటే లండన్‌ సదస్సుల్లో అంబేడ్కర్‌ న్యాయ సూక్ష్మత, పటిమను వారు ప్రత్యక్షం
గా చూడగలిగేవారు. 

సంస్థానాల ఉనికిని తోసిపుచ్చిన అంబేడ్కర్‌
ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో భాగంగానే ఫెడరల్‌/స్ట్రక్చర్‌ కమిటీలో చాంబర్‌ ఆప్‌ ప్రిన్సెస్‌కు ప్రాతినిధ్యం వహించిన బికనీర్‌ మహారాజుతో 1931 సెప్టెంబర్‌ 16న అంబేడ్కర్‌ ఘర్షించారు. 1935 తర్వాత బ్రిటిష్‌ ఇండియా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోసం సంస్థానాధిపతులు చేసిన ప్రయత్నాన్ని అంబేడ్కర్‌ ఈ సమావేశంలోనే తోసిపుచ్చారు. బ్రిటిష్‌ ఇండియాలో ఒక జిల్లా సగటున నాలుగు వేల చదరపు మైళ్ల విస్తీర్ణం, 8 లక్షల జనాభాతో కూడి ఉండగా, దేశంలోని 562 సంస్థానాల్లో 454 సంస్థానాలు వెయ్యికంటే తక్కువ చదరపు మైళ్ల విస్తీర్ణం, లక్షకంటే తక్కువ జనాభాను మాత్రమే కలిగి ఉన్నాయని, వీటిలో 374 సంస్థానాలు లక్షరూపాయలకంటే తక్కువ వార్షికాదాయాన్ని కలిగి ఉన్నాయని అంబేడ్కర్‌ పేర్కొన్నారు. 

వీటిలో కొన్ని సంస్థానాలు ఎంత చిన్నవంటే వాటికి దక్కిన గౌరవం పట్ల ఎవరూ కనీస సానుభూతి కూడా చూపేవారు కాదు. 15 సంస్థానాలయితే ఒక చదరపు మైలు కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండేవి. 27 సంస్థానాలు సరిగ్గా చదరపు మైలు విస్తీర్ణంలో ఉండేవి. 14 సంస్థానాలు ఒక్క సూరత్‌ జిల్లాలోనే ఉండేవి. వీటి వార్షికాదాయం సంవత్సరానికి 3 వేల రూపాయలకు పైబడి ఉండేది. వీటిలో మూడు రాష్ట్రాల్లో ఒక్కో దాని జనాభా నూరుకంటే తక్కువే. అయిదు సంస్థానాలకైతే వార్షికాదాయం వంద రూపాయలలోపే ఉండేదని అంబేడ్కర్‌ వివరించారు. సంస్థానాన్ని ప్రత్యేకంగా, స్వతంత్రంగా ఉంచడం ద్వారా ఆ సంస్థానాధిపతిని రాజాధిరాజుగా సంబోధిస్తూ నిత్యం సంతోషపెట్టడానికి ప్రయత్నించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగమూ లేదని అంబేడ్కర్‌ ఆ సమావేశంలో తేల్చి చెప్పారు. 

సంస్థానాల పరిస్థితి ఇలా ఉండగా, స్వావలంబన లేకుండా, కుహనా దర్పంతో, గర్వంతో జీవిస్తున్న ఇలాంటి సంస్థానాధిపతులకు భారత యూనియన్‌లో చేరడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కానీ రెండే రెండు సంస్థానాలు మాత్రం 1947 ఆగస్టు 17న స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. తాను భారత్‌ను వదిలి వెళుతున్నందున సార్వభౌమాధికారం అనేది ఇక చెల్లదని, తమ తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో సంస్థానాలు చేరవచ్చు లేక స్వతంత్రంగా ఉండవచ్చు అంటూ 1946లో బ్రిటిష్‌ కేబినెట్‌ మిషన్‌ చేసిన ప్రకటనతో ఈ గందరగోళం ఏర్పడింది. ఇదే విషయాన్ని 1947 జూన్‌ 3న మౌంట్‌బాటన్‌ మళ్లీ చెప్పారు. 

సార్వభౌమాధికారంపై న్యాయపరమైన స్పష్టత
బ్రిటిష్‌ ప్రభుత్వ వైఖరిని అంబేడ్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. 1947 జూన్‌ 17న ఒక ప్రకటన చేస్తూ సంస్థానాలకు స్వాతంత్య్రాన్ని అనుమతించిన బ్రిటిష్‌ పాలకులపై అంబేడ్కర్‌ విరుచుకుపడ్డారు. అంబేడ్కర్‌ ప్రకటన నాటి పత్రికల్లో విస్తృతంగా ప్రచురితమైంది. సార్వభౌమాధికార సిద్ధాంతం ద్వారానే బ్రిటిష్‌ పాలకులు స్థానిక రాజ్యాలను నియంత్రించేవారు. సంస్థానాలపై సార్వభౌమాధికారం చలామణి అవుతూ వచ్చేది. అంబేడ్కర్‌ దీనిపైనే వాదిస్తూ, 1947 జూన్‌ 17 నాటికి భారత ప్రభుత్వం బ్రిటిష్‌ అధినివేశ ప్రతిపత్తికిందే ఉంటూ వస్తోందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, ఐర్లండ్‌ దేశాల్లాగే 1950 జనవరి 26 వరకు భారతదేశం బ్రిటిష్‌ వారి అధినివేశ ప్రతిపత్తి కిందే ఉండేది.

భారత ప్రభుత్వం (నెహ్రూ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం) స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నందున దానికి స్థిరమైన విశేష అధికారంతో చక్రవర్తికి సూచించగల ప్రత్యేక హక్కు ఉందని, ఆ సూచనను బ్రిటిష్‌ చక్రవర్తి తిరస్కరించలేరని అంబేడ్కర్‌ రాజ్యాంగ చట్టాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సార్వభౌమాధికారాన్ని వదులుకుంటూ బ్రిటిష్‌ ప్రభుత్వం సంస్థానాలకు స్వాతంత్య్రాన్ని మంజూరు చేయడం పట్ల అంబేడ్కర్‌ తప్పు పట్టారు. చక్రవర్తి తన ప్రత్యేకాధికార హక్కులను వదులుకోవడం లేక మరొకరికి అప్పగించడం చేయలేరని, చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని మరొకరికి (భారత ప్రభుత్వానికి) అప్పగించలేనట్లయితే, దాన్ని చక్రవర్తి వదులుకోలేరని కూడా అంబేడ్కర్‌ వాదించారు. ఈ ప్రాతిపదికన కేబినెట్‌ మిషన్, మౌంట్‌ బాటన్‌ ప్రకటనలు రద్దు చేయదగినవని అంబేడ్కర్‌ అభిప్రాయపడ్డారు.

కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వానికి అంతకు ముందటి ప్రభుత్వం చలాయించిన కొన్ని హక్కులు వారసత్వంగా సంక్రమిస్తాయని వారసత్వానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టం చెబుతోందని అంబేడ్కర్‌ పేర్కొన్నారు. సార్వభౌమాధికారం నుంచి భారతీయ సంస్థానాలు తమను తాము విముక్తి చెందించుకోగల ఏకైక మార్గం ఏదంటే, సౌర్వభౌమాధికారాన్ని, రాజ్యాధికారాన్ని విలీనం చేయడమేనని అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. స్వతంత్ర భారతదేశం సంస్థానాల స్వతంత్రతను గుర్తించదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విదేశీ ప్రభుత్వాలుగా వాటి ఉనికిని భారత్‌ గుర్తించదని అంబేడ్కర్‌ హెచ్చరించారు.

సంస్థానాల వక్రమార్గంపై అంబేడ్కర్‌ తీవ్ర హెచ్చరిక
ఐక్యరాజ్యసమితి గుర్తింపును, రక్షణను పొందుతామని సంస్థానాలు ఆశించడం అంటే పిచ్చివాళ్ల స్వర్గంలో నివసించినట్లే కాగలదని అంబేడ్కర్‌ హెచ్చరించారు. సంస్థానాలపై తన అధికారాన్ని భారత్‌ చాటుకోవడాన్ని పక్కనపెట్టి ఐక్యరాజ్యసమితి సంస్థానాలను గుర్తిస్తుందా అని అంబేడ్కర్‌ సందేహం వ్యక్తపరిచారు. తమ పరిధిలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పర్చకుంటే విదేశీ దాడి నుంచి లేక అంతర్గత తిరుగుబాటు నుంచి భారతీయ సంస్థాన ప్రభుత్వాలకు ఐక్యరాజ్యసమితి ఎన్నటికీ సహకారం అందించదని, కాబట్టి వక్రమార్గం పడుతున్న భారతీయ సంస్థానాలు.. ఐక్యరాజ్యసమతి జోక్యం చేసుకుంటుదని ఆశలు పెట్టుకోలేవని అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. 

సంస్థానాలకు మినహాయింపునిస్తూ 1946లో కేబినెట్‌ మిషన్‌ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ మౌనం పాటించిన సమయంలో అంబేడ్కర్‌ అందించిన న్యాయపరమైన స్పష్టత సంస్థానాలకు తలుపులు మూసివేసి భారత సంపూర్ణ ఏకీకరణకు దారి కల్పించింది. ఈ క్రమంలోనే ఊగిసలాటకు గురవుతూ వచ్చిన ట్రావెన్‌కోర్, జోధ్‌పూర్, బికనీర్, జైసల్మీర్, రాంపూర్, భోపాల్‌ సంస్థానాలు భారత్‌లో విలీనం కాగా, జునాగఢ్‌ సంస్థానం మాత్రం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లింది.  1947 జూన్‌ 17న తాను ప్రకటన చేసిన కొన్ని వారాల తర్వాత అంబేడ్కర్‌ భారత న్యాయశాఖ మంత్రిగా నెహ్రూ ప్రభుత్వంలో చేరడమే కాకుండా సంపూర్ణ ఏకీకరణ పూర్తి చేసుకున్న స్థిరమైన జాతిగా భారత్‌ను ముందుకు నడిపించారు. హైదరాబాద్‌ ఏకీకరణ ఆపరేషన్‌ని పోలీస్‌ యాక్షన్‌ అని పిలవాలని, దాన్ని భారత సైనిక చర్యగా పిలవవద్దని నెహ్రూకు సలహా ఇచ్చిన ఘనత కూడా అంబేడ్కర్‌కే దక్కుతుంది. తన రాజ్యాంగ పదవి ఆధారంగా, హైదరాబాద్‌ని భారత్‌లో విలీనం చేయడం ప్రభుత్వాధికారానికి సంబంధించిన అంతర్గత వ్యవహారమని గుర్తించబట్టే అంబేడ్కర్‌ హైదరాబాద్‌ విలీన చర్యను పోలీస్‌ యాక్షన్‌గానే పేర్కొన్నారు.
వ్యాసకర్త: రాజశేఖర్‌ ఉండ్రు ,సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, రచయిత

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top