నూట పాతికేళ్ళ యువకుడు

Anwar Article On 125th Birth Anniversary Of Damerla Rama Rao - Sakshi

ఈ సంవత్సరం దామెర్ల రామారావు గారి 125వ జయంతి. ఆయన 28 సంవత్సరాల వయసులో అకాల మరణం చెందారు. బ్రతుకు గైర్హాజరులో ఈ నూటా పాతికకు ముందు, ఏభయ్, డెబ్భై అయిదు, నూరు సంవత్సరాల జయంతులు కూడా పూర్తి అయిపోయాయి. ఆయన తాలూకు నూటాపాతిక సంవత్సరాల వయసులో మూడింట దాదాపు ఒక వంతు వయసు అటుగా  నాదిప్పుడు. నా చిన్నతనంలో మా తండ్రిగారో, చిన్నాయనలో నాతో ‘‘బాబూ, నీకు బొమ్మలంటే ఇష్టం కదా! ఇదిగో, ఈయన దామెర్ల రామారావు గారని చాలా గొప్ప చిత్రకారులు. నీలా బొమ్మలేసే వాళ్ళు రోజూ ఈయన పటం ముందు నిలబడి దండం పెట్టుకుంటే ఆయన ఆశీస్సులు అంది నీవు కాస్త మంచి ఆర్టిస్టువు అవుతావు’’ అని ఎవరూ చెప్పలేదు. కాస్త పెద్దయ్యి, హైస్కూల్‌లో చేరాకా మా డ్రాయింగు సారు కూడా దామెర్ల రామారావు పేరు పలికి ఆయనకు దండం పెట్టించడం అటుంచి, అసలు డ్రాయింగే మాకు నేర్పలేదు. ఒక మనిషి జీవితంలో దాదాపు పాతిక సంవత్సరాల వరకు చదువులో గడుస్తుందంటే– దామెర్ల రామారావు గురించి నేను పుట్టి పెరిగిన ఇల్లు గానీ, చదువులు నేర్పిన బడులు గానీ, కలిసి నడిచిన స్నేహాలు గానీ పరిచయం చేయలేదు. బ్రతుకుతెరువు రీత్యా ఒక చిత్రకారుణ్ణి అయిన తరువాత బొమ్మలు వేసే సర్కిల్‌ ఒకటి పరిచయం అవుతుంది కదా, అక్కడా అదే వరస! ‘నా జీతం ఇంత, నీ జీతమెంతా? నా బొమ్మకు ఇంత పుచ్చుకుంటా, నీ బొమ్మకు ఎంత అడుక్కుంటావ్‌?’ అనే గుమస్తా లెక్కల చిట్టా తప్పా దామెర్ల రామారావు, వరదా వెంకటరత్నం, వి. ఆర్‌. చిత్ర వంటి పేర్లు వినపడ్డవి కావు! వారి గొప్ప అందిందీ కాదు! 

అటు సాధారణ సంసార జనానికీ అందక, ఇటు బొమ్మల బ్రతుకులో తలమునకలైన వారికీ తెలీక ‘‘ఈ మహానుభావుడు, గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు ఇరవై ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే కాలం చెందారు గానీ, ఆయన కనక పూర్ణాయుష్కులు అయి ఉంటే’’ అని ఊపిరి పొడుగ్గా వదులుతాం. పూర్ణాయుష్కులు అయి ఉంటే మాత్రం ఏమవుతుంది? ఆయన చిత్రించిన వందల సంఖ్యల బొమ్మల చెంత పక్కన మరిన్ని సున్నాలు చేరి ఉండేవి. తన చిత్రకళా ప్రపంచంలో ఆయన మరింత కృషి కొనసాగించి ఉండేవారు. అయితే మాత్రం? కళా ప్రపంచంలోని వారు ఎంత కృషి చేసినా ఆ బొమ్మల భాషని చూపడానికి  మన పిల్లల చేతుల పట్టుకుని ఆర్ట్‌ గ్యాలరీల వైపు అడుగులు వేసే సంస్కారం మన కుటుంబాలది  కాదు. విద్యార్థుల బుర్రల్లో ఆ కళాకారుల గురించీ, వారి  కళాసృష్టి గురించీ జ్ఞానబీజాలు నాటే సంస్కృతి మన బడులది కాదు. 

దామెర్ల జనన, మరణాల వికీపీడియా లెక్కలు కాదు కదా మనకిప్పుడు కావలసినది! ఎవరు చూస్తున్నారని, చూడబోతున్నారని గానీ, ఏ కీర్తి కిరీటపు బరువు నీడలో కాలాన్ని వెళ్ళబుచ్చుదామని వంటి ఆలోచనలు లేని ఒకలాంటి మానవులు ఉంటారు. ఉత్తమ జాతి మానవులు. ఉత్తమోత్తమమైనది వారి సృజన. సర్వవిద్యలకూ రెండు దశ లుంటాయి. ఒకటి రసాత్మకమైనది. రెండవది వినోదమైనది. సినిమాల పేరిట, షోల పేరిట టీవీల నిండా, మొబైల్‌ ఫోన్ల నిండా దొరుకుతున్నది రెండవదే. మనిషిలో  కామ క్రోధ లోభ మోహాలనీ బలవంతాన మరీ బయటకు తీసి ఊ అంటావా ఊఊ అంటావా అని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నవవే. ఈ శబ్దాలతో  ఊపిరందక ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ మనిషి  మనసుకు కావలసినదల్లా కాసింత సాంత్వన. గొప్ప సంగీతం వినడం, గొప్ప బొమ్మ  చూడ్డం, గొప్ప రచన చదవడం వల్ల ఆ సాంత్వన కలుగుతుంది. 

చిత్రించిన ప్రతీది గొప్ప బొమ్మా కాదు, చిత్రించే ప్రతీవాడూ గొప్ప చిత్రకారుడు కాలేడు. కేవలం దామెర్ల రామారావు వంటి కొందరు చేసిన పని ఉంటుంది. అది కాలానికి కట్టుబడనిది, మనిషి మనసుకు శాంతినివ్వడానికి ఇవ్వబడినది. మనిషి ఎల్లకాలం ఉండడు.  గొప్ప కళ ఎప్పటికీ ఉంటుంది. ఆ కళ తనున్నంత కాలం తన సరసన ఆ మనిషి పేరును నిలిపి పెడుతుంది. చలం గారి ‘యోగ్యతా పత్రం’లో ‘ఏమిటి వంతెన మీద నుంచుని చూస్తున్నావు?’ అని ప్రశ్న ఉంటుంది. ‘సంధ్య కేసి’ అంటారు ఆయన.  అడగవలసిన ప్రశ్న  కాదది. అట్లా చూసేవాడిని చూడనివ్వాలి. మనమందరమూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒకవేపు అలా చూస్తూ నిలబడ్డవాళ్ళమే! ఆ సమయాన సంధ్యలోనో, అరుణోదయంలోనో, పారుతున్న ఏరు గలగలలో, మనం ఏం చూశామో, ఏం పొందామో, దానిని ప్రతిసారీ ఇవ్వగలిగినది మాత్రమే గొప్ప కళ. అది దామెర్ల వారి బొమ్మలో ఉన్నది, ఓస్వాల్డో  గుయాసమీన్‌ బొమ్మలో ఉన్నది, బిస్మిల్లా ఖాన్‌ షెహనాయిలో, భూపేన్‌ హజారికా గొంతులో ఉన్నది. మనవంటి వారి మనసుల్లో శాంతి నింపడం కోసమే అవి ఉన్నవి. నూటా పాతిక కాదు, ఎన్ని వందల పాతిక జయంతులయినా జరుపుకొంటూ రామారావు గారూ, ఆయన బొమ్మలూ ఉంటాయి. ఆ వేపుకు కాస్త అడుగు వేసి చూడండి. అది మాత్రం మీ కోసం మీరు చేసుకోగలిగినది!

– అన్వర్‌
(మార్చి 8న దామెర్ల రామారావు 125వ జయంతి) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top