ఆది దేవత... లజ్జాగౌరి

Adi Devatha Lajja Gauri: Jogulamba Gadwal district - Sakshi

హిందువులు ‘లజ్జాగౌరి’ని ఆదిదేవతగా పూజిస్తారు. క్రీస్తుకు పూర్వం నుంచే ఈమెను కొలుస్తున్నట్టు చరిత్ర చెపుతోంది. హరప్పా, మొహంజొ దారో నాగరికతల్లోనూ లభ్యమయిన ఆధారాల బట్టి అప్పటికే లజ్జాగౌరి ఆరాధన ఉన్నట్లు చెప్పవచ్చు. సంతాన దేవతగా ఈమెను ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆరాధిస్తూనే ఉన్నారు. తెలంగాణలో జోగు లాంబ గద్వాల్‌ జిల్లా, అలంపూర్‌లో ఈ అమ్మవారు దర్శనమిస్తోంది. శక్తి పీఠంగా అలంపూర్‌ గురించి తెలిసిన వాళ్లు, అక్కడే ఉన్న లజ్జాగౌరీదేవి గురించి మాత్రం తెలియదే అని తెల్ల మొహం వేస్తుంటారు. సంతానం కోసమే కాక తమను బాధిస్తున్న వివిధ గుప్త వ్యాధుల నుండి బయట పడేయమనీ స్త్రీలు లజ్జాగౌరిని పూజిస్తారని అంటారు.

నిజానికి ప్రస్తుతం భారతదేశంలో పూజించే గ్రామ దేవతలు అందరూ లజ్జా గౌరి ప్రతిరూపాలే అనాలి. చాలా చోట్ల చర్మవ్యాధులు, ఇతర గుప్తరోగాలు ఉన్న మహిళలు గ్రామదేవతల జాతర్ల సందర్భంలో వివస్త్రలై లేదా వేప మండలతో శరీరాన్ని కప్పుకుని పూజించడం ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతోంది. 

రేణుక ఎల్లమ్మ వంటి గ్రామదేవతను లజ్జా గౌరిగా పేర్కొనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ కథ ప్రకారం... నిమ్న కులానికి చెందిన రేణుక తలను అగ్రకులస్థుడొకడు నరికివేశాడు. అయితే రేణుక చనిపోలేదు. తల స్థానంలో కమలాన్ని మొలిపించుకొని జీవించింది. పద్మం, యోని అనేవి సంతానానికి సంకేతాలు.

ఈ దేవత విగ్రహాలను గమనించినప్పుడు... పద్మ ముఖం, గుడ్రంగా కుండ మాదిరిగా ఉన్న ఉదరం, చెవులకు అందమైన కమ్మలు, మెడలో హారాలు కనిపిస్తాయి. ఆలంపూర్‌లోనే కాక చేర్యాల, హుజురాబాద్, కొలనుపాక, కోహెడ, బెజ్జంకి, తంగళ్లపల్లి వంటి చోట్ల లజ్జాగౌరి విగ్రహాలు ఉన్నాయి. హన్మకొండలోని రాజరాజ నరేంద్ర భాషా నిలయం మలుపులో కూడా ఒక లజ్జాగౌరి విగ్రహం 2010 వరకూ ఉండేది. 

– కన్నెకంటి వెంకట రమణ
జాయింట్‌ డైరెక్టర్, సమాచార శాఖ, హైదరాబాద్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top