వివక్ష కాదు వైద్యం కావాలి

World Tuberculosis Day: Needs healing not discrimination - Sakshi

మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం

భారతదేశంలో ప్రతి పదిమంది స్త్రీలలో ఒకరు క్షయ వ్యాధి బారిన పడుతున్నారని అంచనా. పురుషుడికి ఆ వ్యాధి వస్తే వైద్యం దొరుకుతుంది. కాని స్త్రీకి వస్తే దానిని గుర్తించడంలో ఆలస్యం.
వైద్యంలో నిర్లక్ష్యం. వ్యాధి వచ్చిందని తెలిస్తే వివక్ష. దానిని సాకుగా తీసుకుని వదిలిపెట్టే భర్తలు, గదిలో పెట్టే కుటుంబాలు ఉన్నాయి. స్త్రీ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం. ఆమె దగ్గుతూ వుంటే అది పోపు వల్ల వచ్చిన దగ్గు అనుకోకండి. వెంటనే వైద్యం చేయించండి.

ఇది జరిగింది.
పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. మరో పదిరోజుల్లో పెళ్లి అనగా ఆ అమ్మాయికి టీబీ బయటపడింది. డాక్టర్లు వెంటనే వైద్యం మొదలెట్టాలని, ఆరునెలలు తప్పనిసరిగా నాగా పడకుండా మందులు వాడాలని చెప్పారు. దాంతో ఆ అమ్మాయికి, ఆమె కుటుంబానికి గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే ఆమెకు టి.బి. అని తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్లయినా ఆ మందులు అందరి ముందు వాడితే జబ్బు సంగతి బయటపడుతుంది. పెళ్లి ఆగడానికి లేదు.

అలాగని ముందుకు వెళ్లడానికీ లేదు. డాక్టర్లు చెప్పింది ఏమిటంటే– మందులు సక్రమంగా వాడితే హాయిగా మునుపటి జీవితం గడపవచ్చు అని. అమ్మాయి ధైర్యం చేసింది. పెళ్లి చేసుకుంది. కాని ఆరు నెలల పాటు ఏదో వ్రతం చేసినట్టుగా ఎంతో జాగ్రత్తగా అత్తమామల దృష్టి భర్త దృష్టి పడకుండా మందులు వాడింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యవంతురాలైంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఇదే పని అత్తమామల ఆదరంతో కూడా చేయవచ్చు. అలాంటి ఆదరం మగవాడికి దొరికినట్టుగా స్త్రీకి దొరకదు. అదే ఈ జబ్బులో ఉన్న అనాది వివక్ష.

 2020లో మన దేశంలో పదిహేను లక్షల మంది టీబీతో మరణించారు. వీరిలో 5 శాతం మంది స్త్రీలు. వీరంతా 30 నుంచి 69 మధ్య వయసు ఉన్నవారు. అంతే దాదాపుగా గృహిణులు, తల్లులు, అమ్మమ్మలు, అవ్వలు. వీరు ఈ మరణాలకు ఎలా చేరుకుని ఉంటారు. తెలియనితనం వల్ల, కుటుంబ నిర్లక్ష్యం వల్ల, ఒకవేళ జబ్బు సంగతి తెలిస్తే సక్రమంగా మందులు తెచ్చివ్వకపోవడం వల్ల, కసురుకుంటూ చిన్నబుచ్చుతూ వారిని మానసికంగా కుంగదీయడం వల్ల, అందరికీ దూరం చేయడం వల్ల... ఇలా అన్నీ ముప్పిరిగొని  ప్రాణాలు పోయే స్థితికి వచ్చి ఉంటారు.

టీబీ పై స్త్రీ విజయం సాధించాలంటే
2021 డిసెంబర్‌లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ‘విమెన్‌ విన్నింగ్‌ ఎగనెస్ట్‌ టీబీ’ అనే పేరుతో ఒక పార్లమెంటరీ సమావేశం నిర్వహించింది. స్త్రీలు టీబీపై విజయం సాధించడానికి కలుగుతున్న ఆటంకాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో స్త్రీ స్థానం ఆమెకు తన జబ్బు మీద పోరాడటానికి తగినంత శక్తి, సమయం ఇవ్వడం లేదన్న అభిప్రాయం వెల్లడైంది. స్త్రీలు టిబిపై విజయం సాధించాలంటే ముందు ప్రజా ప్రతినిధులు, పాలనా వ్యవస్థ ఎడతెగని ప్రచార, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఒకసారి టీబీ బయటపడ్డాక అలాంటి మహిళా పేషెంట్‌లు ఉన్న ఇళ్లను గుర్తించి వారికి వైద్య సహాయం మాత్రమే కాదు మానసిక నిబ్బరం కలిగించే కౌన్సిలింగ్‌ వ్యవస్థ బలపడాలి.

ఈ వ్యవస్థ ఆ మహిళలకే కాదు కుటుంబానికి కూడా కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. మరొకటి– పౌష్టికాహారం. రెగ్యులర్‌గా మందులు వాడుతూ, విశ్రాంతి తీసుకుంటూ, తగిన పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే టీబీ సులభంగా నయం అయిపోతుంది. కాని భారతీయ కుటుంబాలలో ఇంటి చాకిరీ అంతా స్త్రీలే చేయాలి. విశ్రాంతి అనేది దొరకదు. ఇక అందరూ తిన్నాక ఆమె తినాలి. మరీ విషాదం ఏమిటంటే స్త్రీకి ప్రత్యేకంగా పౌష్టికాహారం ఇవ్వడం ఆమెను గొప్ప చేయడంగా కూడా భావిస్తారు. కాని ఇవన్నీ తప్పు. ఇలాంటి అవివేక ఆలోచనల వల్లే స్త్రీలు టీబీ కోరల నుంచి సులభంగా బయటకు రాలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘నిక్షయ్‌ పోషణ్‌ యోజన’ కింద టీబీ సోకిన పేషెంట్స్‌కు పౌష్టికాహారం కోసం నెలకు 500 ఇస్తుందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు.

సమాజం బాధ్యత
కొన్ని కుటుంబాలు కలిసి ఒక సమాజాన్ని ఏర్పరుస్తాయి. టీబీని సాకుగా చేసుకుని స్త్రీలను ఇబ్బంది పెట్టడాన్ని సమాజం అంగీకరించరాదు. కుటుంబంకాని, సమాజం కాని వెలి, వివక్షను పాటించక టీబీ ఉన్న స్త్రీల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇది సులభంగా తగ్గిపోయే జబ్బు అన్న అవగాహన కలిగించి పేషెంట్స్‌కు ధైర్యం చెప్పాలి. వారు మందులు తీసుకునేలా చూడాలి. అలాంటి స్త్రీలను ఇదే సాకుగా వదిలించుకోవాలని చూసే మగాళ్లకు బుద్ధి చెప్పాలి. దగ్గు మొదలైనా డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లని, చూపించుకోవడానికి డబ్బులివ్వని మగవారిని మందలించాలి. ఆర్థికంగా ఆధారపడే స్త్రీకి తండ్రి, భర్త, కుమారుడి నుంచి సరైన వైద్యం ఇప్పించడానికి ఇరుగు పొరుగు చొరవ చూపాలి.  
 స్త్రీల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సందర్భంగా ప్రతి కుటుంబం అక్కర చూపుతుందని ఆశిద్దాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top