పాటల విత్తనాలను చల్లిపోయాడు

Vanga pandu Prasad Rao Tribute Special Story In Sakshi Literature

నివాళి 

వంగపండు గురించి రాయడం అంటే నా బాల్యాన్ని నేను తడుముకోవడమే. నా జ్ఞాపకాలు గూడు కట్టుకునే ప్రాయానికి ఊర్లోకి పరిగెత్తుకొచ్చిన పాట వంగపండు. అది మా బాల్యంతో ఆడుకుంది. మమ్మల్ని ‘జీపీ వత్తింది రండిరా’ అంటూ మట్టిబాట మీద దుమ్ము రేపుకుంటూ వచ్చి మా పిల్లలందరినీ ఆ పాటలజీపు ఎక్కించి, ఊరేగించాడు వంగపండు. తదనంతరం తన పాటలతో దుమ్మురేపాడు.
వంగపండు చాలా పేదరికంలో పుట్టి పేదరికంలోనే పోయాడు. మధ్యలో పాటతోనే బతికాడు.

పేదరికాన్ని వండుకుతినే దుర్భర దారిద్య్రంలో పిసరంత ప్రేమను తాపే తల్లి కడతేరిపోవడం దురదృష్టం. తల్లి ఒడి నుంచి దాటకముందే తల్లి దాటి వెళ్లిపోవడం ఏ బిడ్డకైనా నరకమే. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. సవతి తల్లి రావడంతో ఆయన పడ్డవన్నీ సినిమా కష్టాలే. పిల్లల్ని ఆడించడం, ఇంటి చాకిరీ, పశువుల కాపుకి పోవడం. ఈ పనుల వల్ల ఆయన చదువు సాగలేదు. అసలు సిసలైన చదువు పశువుల కాపరులతోనూ, షిప్‌యార్డు కార్మికులతోనూ సాగిందని చెబుతుండేవాడు.

వంగపండుకు పాట పితృదత్తంగా వచ్చింది. తండ్రి జానపద కళాకారుడు. చాలా పేరు పొందిన చుక్క దాలినాయుడు బుర్రకథ బృందంలో ఆయన ఒక సభ్యుడు. వారికి వంగపండు బుర్రకథలు రాసిచ్చేవాడు. అక్కడినుంచి ఆయనలో కళాకారుడు ఎదగడం ప్రారంభించాడు. ఒక కవి స్థానం, స్థల కాలాలు నిర్ణయిస్తాయి అంటారు కదా. షిప్‌యార్డ్‌ కార్మికుడిగా చేరిన తర్వాతే ఆయన పాటకి ఒక పరమార్థం చేకూరింది. అవి విరసం ఆవిర్భవించిన రోజులు. శ్రీశ్రీ, రావిశాస్త్రి, కారా, చలసాని మొదలైన రచయితల సహచర్యం ఆయనకు వెన్నుదన్ను అయ్యింది. విరసం ఆయనకు ఒక శాస్త్రీయ దృక్పథాన్ని ఇచ్చింది. జననాట్య మండలి ఆయనకు ఒక సాంస్కృతిక వేదిక అయింది. ఎండు పుల్లలు తొందరగా మండినట్టే, ఎండిపోయిన జనం అగ్గిలాంటి ఆయన పాటకు తొందరగానే అంటుకుపోయారు. కారణం ఆయన తీసుకున్న బాణీలు వారి బతుకు లోనివే కాబట్టి. శ్రీకాకుళ ఉద్యమానికి వంగపండు పాట ఊపిరి అయింది. ఉప్పెనలా ఎగిసిపడింది. సునామీలా ప్రపంచాన్ని చుట్టేసింది. అది ఒక చరిత్ర. ఆ వసంత మేఘ గర్జనలో ఆయన పాటల ఉరుముంది, మెరుపుంది.

ఆ క్రమంలో ఆయన ఎన్నో రచనలు చేశాడు. కథలు రాశాడు. టీవీ వచ్చాక, జానపద కళల నిరాదరణకు సంబంధించి దొమ్మరి సాని అనే నవల రాశాడు. శ్రీకాకుళ పోరాటానికి సంబంధించి సిక్కోలు యుద్ధం అనే కంజిర కథను రాసి ప్రదర్శించాడు. విశాఖ సత్యానంద్‌ దర్శకత్వంలో ఆయన రాసిన నాటకం అడవి దివిటీలు ఎంత ప్రజాదరణ పొందిందో వేరేగా చెప్పక్కరలేదు. ఇక భూమి బాగోతం నృత్య రూపకం సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ప్రతి పల్లెలో పెద్దవాళ్ళది, చిన్నవాళ్ళది రెండు బృందాలు ఉండేవి. పల్లెల్లో ఏ వేడుక జరిగినా ఈ ప్రదర్శన ఉండి తీరాల్సిందే. మొదట్లో గ్రామ పెద్దలు దీన్ని నిషేధించిన సందర్భాలు ఉన్నాయి. పెద మేరంగి రౌతు వాసు మాస్టారి దర్శకత్వంలో వందలాది ప్రదర్శనలు జరిగాయి. చాలామంది పిల్లల నోట్లో ఈ పాటలే నిత్యం వినబడుతుండేవి. ఏరువాక, పొలికేక, జజ్జనకరి జనారే, ఆయన పాటల సంకలనాలు.
ఆరు మాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. కానీ ఐదు దశాబ్దాల నగరవాసం ఆయనకు ఏమాత్రం నాగరికతను అంటించలేకపోయింది.

ఏమాత్రం నాగరికత అంటినా ఆయనలో ఉన్న జానపదుడు మాయమైపోయే వాడేమో! ఆ పాటల్లో పల్లె పరిమళం ఆవిరై పోయేదేమో! పట్నంలో తప్పిపోయిన పల్లెటూరి పిల్లవాడిలా చివరంటా అదే అమాయకత్వం, అదే బెరుకు. ఇన్నేళ్లలో ఆయన యాస, భాషలు మారలేదు. డాంబికాలు, భేషజాలు, పోజులు తమ ప్రదర్శనకి వంగపండు పనికిరాడు అని వాటికి తెలుసు. అందుకే దరి చేరలేదు. పత్రిక ఆఫీసుకు వెళ్లి ‘సభలకు వెళ్ళడానికి పైసలు లేవు, అక్రెడిటేషన్‌ పాస్‌ ఏమైనా ఇస్తారా’ అని, డీపీఆర్‌ఓ దగ్గరికి వెళ్ళి ‘అమ్మా! నాకు పింఛన్‌ ఇవ్వడానికి వయసు సరిపోయినట్లు లేదు. కొంచెం చూడమ్మా’ అని అభ్యర్థించడం వంగపండుకే చెల్లింది. అతడు హనుమంతుడి లాంటివాడు. అతని గురించి అతనికి తెలియదు. కానీ అవతల వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు కాదనలేరు. వంగపండు ప్రజల సమస్యలకు సంబంధించిన ప్రతి సందర్భంలోనూ  ప్రతిస్పందించి, పాటై ప్రతిధ్వనించాడు. నిన్న మొన్నటి కరోనా పాట వరకు నిత్యం పాటల ఊటగా స్రవిస్తూనే ఉన్నాడు.

సాదాసీదాగానే బతికాడు. ఉద్యమంలో ఉన్నప్పుడు జీవిత పర్యంతం అసిధారావ్రతం ఎవరికైనా అసాధ్యం. కుటుంబం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఇరుగు పొరుగులతో తైపారు వేసుకుంటూ మా సంగతేమిటనే ప్రశ్నను కొడవలిలా ఎత్తుతుంది. సమాధాన పరచడం, సంతృప్తి పరచడం అంత సామాన్యమేమీ కాదు. ఆ ఆటుపోట్లు తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. దీనికి వంగపండూ అతీతుడు కాదు. అలాంటి ఇబ్బందులు పడ్డాడు. కానీ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. సజీవ కవిగా సంచరిస్తూ బైరాగి లాగా బతికాడు. ఏమైనా ఆయన సృష్టించిన సాహిత్యం సామాన్యమైనది కాదు. మన ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామమంతా అందులో ఉంది. పక్వానికి వచ్చిన తర్వాత పండు రాలి పోవలసిందే. అయితే వంగపండు చాలా పాటల విత్తనాలు చల్లి పోయాడు. వాటిని అంకురింపజేసి పాదుకొల్పడమే  మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.
- జి.ఎస్‌.చలం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top