Swapna Sundari: నాట్యభూషణం

Swapna sundari is an Indian dancer, an exponent of Kuchipudi, Bharata Natyam and choreographer - Sakshi

‘వాగ్గేయకార’ గుర్తింపు పొందిన ఏకైక మహిళ. పద్మభూషణ్‌ అందుకున్న నాట్యవిలాసిని. ఆమ్రపాలి రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వ పురస్కారగ్రహీత. ఇంటర్నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకారిణి. యంగ్‌ కల్చరల్‌ అంబాసిడర్‌గా భారత ప్రతినిధి. మూడు నాట్యరీతుల సాధన కర్త...   నాట్యానికి స్వీయ గాత్ర సహకార ప్రత్యేకత. ఇన్నిటి సమ్మేళనం వక్కలంక స్వప్న సుందరి.

‘‘నా కళాప్రస్థానం గురించి చెప్పే ముందు మా అమ్మ గురించి చెప్పాలి. అమ్మమ్మ తరం వరకు మా గాత్రప్రతిభ ఇంటికే పరిమితం. అమ్మ వక్కలంక సరళ నేపథ్య గాయని. తెర ముందుకు రావడం మాత్రం నాతోనే మొదలు. అమ్మకు యామినీ కృష్ణమూర్తి నాట్యం ఇష్టం. నేను కడుపులో ఉండగానే అమ్మాయి పుడితే కళాకారిణిని చేయాలనుకుంది. తన మిత్రురాలైన బెంగాలీ గాయని గీతాదత్‌తో ‘బెంగాలీలో మంచి పేరు సూచించ’మని కూడా కోరిందట.

గీతాదత్‌ సూచించిన పేర్లలో మా అమ్మమ్మ సుందరమ్మ పేరు అమరేటట్లున్న పేరు స్వప్న. అలా స్వప్నసుందరినయ్యాను. మా నాన్న ఆర్మీలో డాక్టర్‌. ఆ బదిలీల ప్రభావం నా మీద ఎలా పడిందంటే... మేము వెళ్లినచోట భరతనాట్యం గురువు ఉంటే భరతనాట్యం, కూచిపూడి గురువు ఉంటే కూచిపూడి... అలా సాగింది నాట్యసాధన. పదమూడేళ్లకు చెన్నైలో తొలి భరతనాట్య ప్రదర్శన, పద్నాలుగేళ్లకు ఢిల్లీలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను.

మూడవది నేను ఇష్టంగా సాధన చేసిన విలాసిని నాట్యం. రాజమండ్రి సమీపంలోని కోరుకొండ నరసింహస్వామి ఆలయంలో మా గురువు మద్దుల లక్ష్మీనారాయణమ్మ స్వయంగా తన గజ్జెలను నాకు కట్టి ఆరంగేట్రం చేయించారు. నేను మా సొంత ప్రదేశం కోనసీమను చూసింది కూడా అప్పుడే. మా ఇంటిపేరు, ఊరిపేరు ఒకటే. గోదావరి లంకల్లోని వక్కలంక. విలాసిని నాట్య తొలి ప్రదర్శన తర్వాత అనేక ప్రయోగాలు చేశాను. అంతరించి పోతున్న నాట్యరీతిని తర్వాతి తరాలకు అందుబాటులోకి తీసుకురావడానికి, ఆ నాట్యరీతి ప్రాచుర్యానికి నేను చేసిన ప్రయత్నాలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.
 
బీఏ ఆగిపోయింది!
నేను స్కూల్‌ ఫైనల్‌లో ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు నన్ను యామినీ కృష్ణమూర్తిగారి ప్రదర్శనకు తీసుకెళ్లారు. ఆమెను చూసిన తర్వాత నాట్యమే జీవితం అని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మాత్రం ఎంతటి కళాకారిణివి అయినా చదువులేకపోతే ఎలాగ అన్నారు. రోజూ కాలేజ్‌కెళ్లాలంటే డాన్సు అవకాశాలు ఒకదాని మీద మరొకటి వస్తున్నాయి. టీనేజ్‌లోనే లండన్‌లోని క్వీన్‌ ఎలిజిబెత్‌ హాల్‌లో ప్రదర్శన ఇచ్చాను.

ప్రైవేట్‌గా బీఏలో చేరాను, కానీ సెకండియర్‌లో  మూడు నెలల యూరప్‌ టూర్‌తో నా బీఏ ఆగిపోయింది. నాట్యం నేర్చుకున్నాను, నాట్యమే చదువుకున్నాను. నాట్యంలో పీహెచ్‌డీ స్కాలర్స్‌కి ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా వెళ్తుంటాను. చిన్న వయసులో నాట్యంలో స్థిరపడితే ప్రొఫెషన్‌లో కనీసం 30 ఏళ్లయినా రాణించవచ్చని ఇంట్లో వాదించాను. నేను అనుకున్నట్లే నలభై ఐదేళ్లుగా నాట్యంలో రాణిస్తున్నాను. పాటల విషయానికి వస్తే... నాట్యంలో నేపథ్యంగా వినిపించే ట్రాక్‌ నేనే పాడుతాను. బాలమురళి అంకుల్‌తో ఆల్బమ్‌ చేశాను, తమిళ్‌ గజల్స్‌ పాడాను. అమ్మతో కలిసి పాడడం, అమ్మ పాడిన పాటలను ఆమెకు నివాళిగా పాడడం గొప్ప అనుభూతి.

నాట్యజ్ఞానకేంద్రం
దిల్లీలో స్థాపించిన డాన్స్‌ సెంటర్‌ ద్వారా నాట్యానికి సంబంధించిన జ్ఞానాన్ని పంచడంతోపాటు ప్రచారంలోకి తెస్తున్నాను. నాట్యం, సంగీతం, ఆధ్యాత్మికం ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి. అన్నీ కలిపితేనే సంస్కృతి. అలా నేను సాంస్కృతిక వేత్తగా ఆవిష్కారమయ్యాను. నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘నైమిశం’ జిడ్డు కృష్ణమూర్తి ‘సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రీసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌’ కోసం సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన ప్రారంభించాను.

కళాసాధనకు, కళాసేవకు... శిఖరాన్ని చేరడం, ప్రయాణం పూర్తవడం అనేది ఉండదు. పరిపూర్ణతను, కొత్త రూపునూ సంతరించుకుంటూ... కళాకారులకు, కళాభిమానులకు సాంత్వననిస్తూ కొత్త పుంతలు తొక్కుతూ సాగుతూనే ఉంటుంది’’ అన్నారు స్వప్నసుందరి. ప్రభుత్వం ఆమె నాట్యప్రతిభను పద్మభూషణ్‌తో గౌరవించింది. నిజానికి ఆమె నాట్యానికే భూషణం.

కళల కలయిక ‘కూచిపూడి’
భాగవతం, యక్షగానం, నాటకం, పగటివేషం వంటి ప్రాచీన కళారూపాల నుంచి ఒక్కో ప్రత్యేకతను మమేకం చేస్తూ రూపొందిన నాట్యప్రక్రియనే మనం కూచిపూడి అని పిలుస్తున్నాం. నిజానికి కూచిపూడి అనే పేరు రావడానికి కారకులు గోల్కొండ పాలకుడు తానీషా. ఆ నాట్యకళాకారుల స్థిరనివాసం కోసం కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చారాయన. కూచిపూడి గ్రామంలోని నాట్యకారుల నాట్యరీతి కూడా ఆ ఊరిపేరుతోనే వ్యవహారంలోకి వచ్చింది. సిద్ధేంద్రయోగికంటే ముందు రెండు వందల సంవత్సరాల నుంచి వచ్చిన పరిణామక్రమాన్ని నేను నా తొలి రచన ‘ద వరల్డ్‌ ఆఫ్‌ కూచిపూడి డాన్స్‌’లో రాశాను.

తెలుగు విలాసిని... విలాసిని నాట్యం మన తెలుగు వారి భారతం. భారతం అంటే మహాభారతం కాదు. భారతం– భాగవతం అని మన ప్రాచీన కళారూపాలు ఈ రెండూ. భారతం శాస్త్రీయంగా ఉంటే భాగవతం సామాన్యులకు అర్థమయ్యేటట్లు సరళంగా ఉండేది. భారతం సోలో డాన్స్, భాగవతం బృంద ప్రదర్శన. లాలిత్యం, సొగసుతో కూడిన ఈ తెలుగు నాట్యరీతిని రాజాస్థానాల్లో రాజదాసీలు, ఆలయాల్లో దేవదాసీలు ప్రదర్శించేవారు.

రాజాస్థానాలు పోవడం, కొన్ని సామాజిక దురన్యాయాలను అడ్డుకునే క్రమంలో ఆలయాల్లో నాట్యాలను నిషేధిస్తూ చట్టం వచ్చిన తర్వాత ఆ నాట్యసాధన దాదాపుగా అంతరించి పోయే దశకు చేరుకుంది. ఆ సమయంలో నేను ఈ నాట్యం నేర్చుకుని, అందులో ప్రయోగాలు, విస్తరణ కోసం పని చేస్తున్నాను. నేను విలాసిని మీద పుస్తకం రాసే నాటికి ఆ నాట్యరీతికి తెలుగుభారతం అనే ప్రాచీన నామమే ఉంది. నిష్ణాతులైన కవులు, కళాకారులు, చరిత్రకారులు సంయుక్తంగా చర్చించిన తర్వాత ‘విలాసిని’ అనే పేరు ఖరారు చేశాం.
– వక్కలంక స్వప్న సుందరి, సాంస్కృతికవేత్త

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు : నోముల రాజేశ్‌ రెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top