ఆ అమ్మను ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా! | Sakshi
Sakshi News home page

ఆ అమ్మను ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా!

Published Sun, Oct 22 2023 10:31 AM

Sharan Navrathri 2023: Different Avatars Of Maa Durga Are Worshipped - Sakshi

ఆశ్వీయుజమాసం శరదృతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి తొమ్మిదిరాత్రులు జరుపుకొనే దేవీనవరాత్రులు అనేక రుగ్మతలను నివారించడంతోపాటు తలపెట్టిన పనులలో విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయకారిణి అమ్మే! త్రిమూర్తులకు, దశావతారాలకు అన్నింటికీ మూలం అమ్మే! ఆ పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలనీ, దేవీ శరన్నవరాత్రోత్సవాలనీ ప్రసిద్ధి చెందాయి.   

శరన్నవరాత్రుల విశేషాలు
హస్తా నక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ దశమికి ‘దశహరా’ అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా ఉంది. రాత్రి అంటే తిథి అనే అర్థం కూడా. దీనిప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈవేళ పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 

దుర్గాష్టమి
దుర్గాదేవి ‘లోహుడు’ అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలను పూజించే ఆనవాయితీ వచ్చిందని చెబుతారు. ఇక దుర్గ అంటే దుర్గమమైనది, దుర్గతులను తొలగించేది అని అర్థం. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. ‘దుర్గలోని ‘దుర్‌’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్య్రం మొదలైనవి. ‘గ’ అంటే నశింపచేసేది‘, అని దైవజ్ఞులు వివరిస్తారు. ఈమె ఆరాధన వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలపై అదుపును, తదుపరి మూడురోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆ క్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణం,‘దుం’ అనే బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. 

మహర్నవమి
మానవ కోటిని పునీతులను చేయడం కోసం భగీరథుడు ఎంతో తపస్సు చేసి మరెన్నో ప్రయాసలకోర్చి గంగను దివి నుంచి భువికి తెచ్చినది ఈరోజే! ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిథిని గూర్చి చెప్పడంలోని ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్రసిద్ధి కలుగుతుంది. కాబట్టి ‘సిద్ధిదా’ అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు చేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుందని ప్రతీతి. సామూహిక లలితా సహస్ర నామార్చనలు, కుంకుమ పూజలు ఈ పండుగ ఆచారాలలో ఇంకొన్ని.

దసరా పండుగకు ఒకరోజు ముందు ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆచారాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఈ పర్వదినాన రైతులు కొడవలి, నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు, కుట్టుపని వారు తమ కుట్టు యంత్రాలకు, చేనేత కార్మికులు తమ మగ్గాలకు, కర్మాగారాలలో పని చేసే కార్మికులు తమ యంత్ర పరికరాలకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమతో పూజలు చేస్తారు. వాటిని అమ్మవారి ప్రతిరూపాలుగా ఆరాధిస్తారు. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...

పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అందువల్ల ఆయుధాలు తుప్పు పట్టకుండా చెడకుండా సురక్షితంగా ఉన్నాయి. యుద్ధానికి వెళ్లడానికి ముందు అర్జునుడు తన గాండీవానికి, భీమసేనుడు తన గదాయుధానికి ప్రత్యేకంగా పూజలు జరిపించారని ప్రతీతి.

శక్తి స్వరూపిణిని..
అలా పాండవులు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని, యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు. ఆయుధ పూజ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే లలితా అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి.

బొమ్మల కొలువు..
ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను నిర్వహిస్తుంటారు. తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీ పూజను చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఇదే పూజను ‘గోలు’ అంటారు. ఈరోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా బొమ్మల కొలువును నిర్వహించడం పరిపాటి. 

విజయదశమి
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని పురాణాలు చెబుతున్నాయి.‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయదశమి’ అను పేరు వచ్చింది. ఏ పనైనా తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం లాంటివి చూడకుండా విజయదశమి నాడు చేపడితే ఆ కార్యంలో విజయం తథ్యం అని పెద్దలు చెబుతారు.

‘శమీపూజ’ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే ’జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారివారి ఆయుధాలను, వస్త్రాలను శమీవృక్షంపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆ వృక్ష రూపాన్ని పూజించి ప్రార్థించి, తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొంది, శమీవృక్ష రూపాన ఉన్న‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితాదేవి’ని పూజించి, రావణుని సంహరించడం ద్వారా యుద్ధంలో విజయం సాధించాడు. 

తెలంగాణ ప్రాంతంలో శమీపూజ తర్వాత శుభానికి సూచిక అయిన‘పాలపిట్ట’ను చూసే ఆచారం ఉంది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ దిగువ ఇచ్చిన శ్లోకాన్ని పఠిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేస్తారు.
‘శమీ శమయతే పాపం శమీశత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ! అనే శ్లోకం రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! 
అమ్మవారి అలంకారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. శ్రీశైల భ్రమరాంబికకు ఒకవిధంగా అలంకారం చేస్తే, విజయవాడ కనకదుర్గమ్మకు మరోవిధంగా అలంకారాలు చేస్తారు. అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! అందరికీ అమ్మ కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఈ విజయ దశమి అందరికీ సకల శుభాలూ, తలపెట్టిన కార్యక్రమాలన్నింటిలోనూ జయాలను చేకూర్చాలని ఆకాంక్షిద్దాం. 
కనక దుర్గాదేవి (పాడ్యమి) 
శ్రీ బాలాత్రిపురసుందరి ( విదియ )
శ్రీ అన్నపూర్ణాదేవి (తదియ )
శ్రీ గాయత్రీదేవి ( చవితి ) 
శ్రీ లలితాత్రిపుర సుందరి ( పంచమి ) 
శ్రీ మహాలక్ష్మీదేవి ( షష్ఠి)
శ్రీ సరస్వతీదేవి (సప్తమి ) 
శ్రీ దుర్గాదేవి (అష్టమి) 
శ్రీ మహిషాసురమర్దిని దేవి (నవమి ) 
శ్రీ రాజరాజేశ్వరీ దేవి (దశమి)

దేవీ అలంకారాలు
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది. భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని.

శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంలో అగుపించే అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు, సంతాన సౌభాగ్యాలు, సుఖశాంతులు చేకూరుతాయని, శత్రుజయం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం. 

చల్లని చూపు
ఆ అమ్మ కంటిలో నవరసాలను శంకరాచార్యులు వర్ణిస్తారు. చేప స్తన్యం ఇచ్చి తన పిల్లలను పోషించదు. చేప తన పిల్లను పోషించినప్పుడు కేవలం అలా కన్నులతో తల్లిచేప చూసేసరికి పిల్ల చేపకు ఆకలి తీరిపోతుంది. మీన నేత్రాలతో ఉంటుందని అమ్మవారికి మీనాక్షి అనిపేరు. అమ్మ కళ్ళ వైభవాన్ని అనుభవించి, అమ్మకంటి వంక ఒకసారి చూసినట్లయితే మనలో ఇప్పటివరకు ఉన్న ఆందోళనలు ఉపశమించి శాంతి, సంతోషం కలుగుతాయి.  
∙డి.వి.ఆర్‌. భాస్కర్‌
 

(చదవండి: అమ్మ‌వారి నామాలే ఆ మహా నగరాలు! వాటి ప్రాశస్యం ఏంటంటే..)

Advertisement
Advertisement