‘పగ్లైట్’‌ అంటే పిచ్చితనం..ఆమె ఆంతర్యం ఏంటంటే!

Pagglait Official Trailer Sanya Malhotra, Sayani Gupta & Ashutosh Rana - Sakshi

‘మన మనసులో మాట బయటపెట్టకపోతే మన తరపున వాళ్లే నిర్ణయాలు తీసుకుంటారు. నేను నోరు మెదపకపోవడం వల్లే ఇప్పటిదాకా నా జీవితాన్ని ఇతరులే శాసిస్తూ వచ్చారు. ఇంక ఇప్పుడు కూడా కాకపోతే ఇంకెప్పుడూ కాదు’ అంటుంది సంధ్య తన భర్త నానమ్మతో. ఆ కుటుంబంలోని మిగిలిన వాళ్లకు కనిపించినట్టుగా సంధ్య ఆ పెద్దావిడకు పిచ్చిదానిలా అనిపించదు. మరో జన్మ ఎత్తిన వివేకిలా కనిపిస్తుంది. కళ్లతో ఆశీర్వదిస్తుంది ఆ పెద్దావిడ. ఆత్మవిశ్వాసం తోడుగా అత్తింటి నుంచి బయటకు వెళ్లి కొత్త ప్రయాణం మొదలుపెడుతుంది సంధ్య. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ‘పగ్లైట్‌’ అనే సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ అది. పగ్లైట్‌ అంటే పిచ్చితనం.. అని అర్థం. ఆ ఆంతర్యం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే!

పెళ్లయిన అయిదు నెలలకే భర్తను కోల్పోతుంది సంధ్య (సానియా మల్హోత్రా). సినిమా అక్కడి నుంచే మొదలవుతుంది. ఆమె భర్త ఆస్తిక్‌ పేరు వినిపిస్తుంది తప్ప ఆ పాత్ర కనిపించదు. కాని వ్యక్తిత్వం తెలుస్తూంటుంది సినిమాలోని మిగిలిన పాత్రల ద్వారా. ముఖ్యంగా అతని ఫ్రెండ్‌ ఆకాంక్ష (సయానీ గుప్త) ద్వారా. సంధ్య అత్తిల్లు ఉమ్మడి కుటుంబం. ఆమె అత్తగారి అత్తగారు, పెద్ద మామ, మామగారు, మరిది మొదలైన సభ్యులతో. ఆస్తిక్‌ హఠాన్మరణంతో అతని తల్లిదండ్రులు ఉషా (షీబా చద్దా), శివేంద్ర గిరి షుతోష్‌ రాణా).. ఇద్దరూ కుప్పకూలిపోతారు.

ఆస్తిక్‌ తమ్ముడు అలోక్‌ (చేతన్‌ శర్మ) అన్నకు అంతిమ సంస్కారం నిర్వహిస్తాడు పెద్దనాన్న (రఘువీర్‌ యాదవ్‌). ఆస్తిక్‌ మరణ వార్త విన్న వెంటనే చుట్టాలు రావడం మొదలవుతుంది. ఆస్తిక్‌ వాళ్లమ్మ తరపు బంధువు, మేనత్త, బాబాయ్‌ వాళ్ల కుటుంబం అందరూ వచ్చేస్తారు. సంధ్య వాళ్ల అమ్మానాన్నా వస్తారు. సంధ్య మాత్రం ఏ దిగులూ లేకుండా తన గదిలో వాట్సప్‌తో కాలక్షేపం చేస్తూంటుంది. భర్తపోయిన పోస్ట్‌కు ఎన్ని రిప్‌లు, ఎన్ని కామెంట్లు వచ్చాయో చూసుకుంటూ.


తనను తాను తెలుసుకుంటున్న సంధ్య 
ఏ మాత్రం దిగుల్లేకుండా ఉన్న కూతురిని చూసి ఖంగు తింటారు ఆమె తల్లిదండ్రులు. ఈ లోపే ఆమె స్నేహితురాలు నజియా (శ్రుతి శర్మ) వస్తుంది. తమ కోడలి ముస్లిం ఫ్రెండ్‌ను చూసి మొహం చిట్లిస్తాడు పెద్దమామ. ఆ అమ్మాయి టీ తాగే కప్పు వేరేగా పెడ్తారు. భోజనమూ బయటే ఏర్పాటు చేస్తారు. భర్తపోయిన వాళ్లు పదమూడు రోజులు చప్పిడి కూడే తినాలనే నియమంతో సంధ్యకు ఆ భోజనమే ఏర్పాటు చేస్తారు. అది ఏమాత్రం నచ్చని సంధ్య తన మరిది స్నేహితుడి ద్వారా చిప్స్‌ పాకెట్స్, కూల్‌ డ్రింక్స్‌ తెప్పించుకుంటూ ఉంటుంది.

ఆమె ఈ తీరుకు ఆశ్చర్యపోయిన నజియాతో ‘ఏంటో నాకేమాత్రం బాధ అనిపించడంలేదు. నీకో విషయం తెలుసా.. నా చిన్నప్పుడు మా ఇంట్లో పిల్లి కారు కింద నలిగి చచ్చిపోతే మూడు రోజులు ఏడ్చాను తిండీతిప్పల్లేకుండా. కాని ఇప్పుడు ఏడుపే రావట్లేదు. పైగా విపరీతంగా ఆకలేస్తోంది. రుచికరమైన భోజనం తినాలనిపిస్తోంది’ అని చెప్తుంది సంధ్య. ఇంకోవైపు ఆమె అత్త, మామల మనాది మరింతగా పెరిగిపోతుంటుంది.  ఆ ఇంటికి ఏకైక ఆర్థిక వనరుగా ఉన్న కొడుకు పోవడంతో ఆ ఇంటిని ఎలా నడపాలనే చింత, ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆ ఇల్లు కాక తమ కుటుంబం కోసమే కొడుకు కొన్న కొత్త ఫ్లాట్‌ ఈఎమ్‌ఐ ఎలా కట్టాలనే బెంగతో సతమతమవుతూంటారు.

ఆ ఫొటోతో.. 
ఆస్తిక్‌ ఆఫీస్‌కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల కోసం ఏవో కాగితాలు అవసరమై సంధ్యను అడుగుతారు. అలమారాలోంచి ఆ కాగితాలు తీస్తుంటే ఒక అమ్మాయి ఫోటో కనిపిస్తుంది సంధ్యకు. దానివెనకాల ‘ప్రియమైన నీకు’ అని రాసున్న మాటతో. అప్పటినుంచి సంధ్య తీరు మారిపోతుంది. ఆ అమ్మాయి ఎవరు? తన భర్త వార్డ్‌రోబ్‌లో ఫోటోగా ఎందుకు భద్రమైంది? అన్న ప్రశ్నలు తొలిచేస్తుంటాయి ఆమెను. ఆ అమ్మాయి ఫోటో తీసుకెళ్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆస్తిక్‌ వాళ్ల నానమ్మకు చూపించి ‘ఈమె ఎవరు?’ అని అడుగుతుంది. ‘ఉషా’ అంటుంది ఆ పెద్దావిడ. ఆ పేరు తప్ప ఆమె ఏదీ మాట్లాడదు.

ఏది అడిగినా ఆ పేరొక్కటే ఆమె సమాధానం. ఊసురోమంటుంది సంధ్య. ఉండబట్టలేక ఆ విషయం తన ఫ్రెండ్‌ నజియాకూ చెప్తుంది. ఈలోపే ఆస్తిక్‌ ఆఫీస్‌ వాళ్లొస్తారు ఇంటికి. సంధ్యను పరిచయం చేస్తారు ఇంటివాళ్లు. ఆఫీస్‌ వాళ్లలో ఒక అమ్మాయిని చూసి స్తబ్ధురాలవుతుంది సంధ్య. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయే ఆమె. పేరు ఆకాంక్ష. తన గదిలోకి తీసుకెళ్లి ఆకాంక్షను అడుగుతుంది తన భర్తతో ఆమెకున్న స్నేహం గురించి. ఒకప్పుడు తన భర్త, ఆకాంక్ష ప్రేమికులని, పెద్దవాళ్లకు ఇష్టం లేకపోవడంతో పెళ్లి చేసుకోలేదని తెలుస్తుంది.

పెళ్లయ్యాకా ఆస్తిక్‌కు ఆకాంక్షతో స్నేహం ఉందనీ గ్రహిస్తుంది. ఆకాంక్ష ద్వారానే‡భర్త ఇష్టాయిష్టాలు అర్థమవుతాయి. తనకు, ఆస్తిక్‌కు మధ్య పెళ్లి బంధం, దాని తాలూకు బాధ్యత తప్ప ప్రేమ లేదని అవగతమవుతుంది. ఆ అయిదు నెలలలూ తామిద్దరు అపరిచితులుగానే ఉన్నామని స్పష్టమవుతుంది. తొలిసారి ఆకాంక్ష ఫోటో చూసినప్పుడు భర్త తనను మోసం చేశాడని, జీవితంలో అతణ్ణి క్షమించొద్దని అనుకున్న సంధ్య.. ఆకాంక్ష ద్వార భర్తను.. అతని మరణం ద్వారా తనను తాను తెలుసుకుంటుంది. 

ఆర్థిక బంధాలే..
సంధ్య నామినీగా ఆస్తిక్‌ 50లక్షల పాలసీ చేశాడని తెలిసిన క్షణం నుంచి ఆ కుంటుంబంలోని అందరి ప్రవర్తనా మారిపోతుంది. అప్పటిదాకా సం«ధ్యను పుట్టింటికి పంపేయాలనుకున్న అత్తామామా, అప్పటికే ఇంకా ఇద్దరు ఆడపిల్లల బాధ్యత తమ మీదుండడంతో సంధ్యను ఎలాగైనా ఆ ఇంట్లోనే ఉంచేయాలనుకున్న సంధ్య వాళ్ల అమ్మా, తమ కొడుకు బిజినెస్‌ మొదలుపెట్టుకోవడానికి లోన్‌ దొరక్క ఇబ్బంది పడ్తున్న సంధ్య చిన్నత్త, చిన్న మామగారు, ఎమ్మే ఇంగ్లిష్‌ చదివిన తన వదిన దగ్గర ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పించుకుంటున్న మరిది అలోక్‌.. వీళ్లందరి ఆలోచనలూ మారిపోతాయి.

పుట్టింటికి తీసుకెళ్లిపోదామని అమ్మ, బీమా ఏజెంట్‌కు డబ్బిచ్చి ఆ డబ్బును తామే తీసుకోవాలని మామగారు, కొడుకును సంధ్యకిచ్చి పెళ్లి చేసి ఆ డబ్బుతో బిజినెస్‌ పెట్టించాలని చిన్నత్త, చిన్నమామగారు, వదినను పెళ్లి చేసుకొని ఆ డబ్బుకు అధికారి కావాలని అలోక్‌ ప్లాన్‌ వేస్తారు. తాను చేస్తుంది తప్పని ఒక్క మామగారే అదీ సంధ్య ప్రవర్తనతో గ్రహించి తన ఆలోచనను విరమించుకుంటాడు.

డబ్బు కోసం నాటకం ఆడుతున్న మిగిలిన వాళ్లందరికీ పాఠం నేర్పి.. తనూ పాఠం నేర్చుకుంటుంది. ప్రేమ లేని పెళ్లి.. గమ్యంలేని జీవన ప్రయాణంలో తానేం కోల్పోయానో తెలుసుకుంటుంది. తన జీవితం పట్ల తనకుండాల్సిన పట్టింపును గ్రహిస్తుంది. ఉద్యోగంతో ఆర్థిక స్వావలంబన సాధించాలని నిర్ణయించుకుంటుంది. ఆస్తిక్‌ నామినీగా వచ్చిన డబ్బును అత్తింటికే ఇచ్చేసి.. మామగారికి, తన తల్లికి ఉత్తరాలు రాసి.. ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.. కొత్త సంధ్యగా బతకడానికి. 

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మాటకు ప్రతి కుటుంబం సాక్షే. మనిషి పోయిన దుఃఖం కంటే ఆ మనిషితో ముడిపడి ఉన్న ఆర్థికలావాదేవీలే ఎక్కువ బాధిస్తాయి. ఆచార సంప్రదాయాల్లో ఉన్న డొల్లతనం, అమ్మాయిలకుండాల్సిన ఆత్మవిశ్వాస ఆభరణం, కావాల్సిన నిర్ణయాధికారం.. వంటివన్నిటినీ చర్చించాడు దర్శకుడు ఉమేశ్‌ బిస్త్‌. నటీనటుల గురించయితే చెప్పక్కర్లేదు. వాళ్లను కాక వాళ్ల భూమికలను చూపించారు.  
– సర 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top