పిల్ల‌ల‌కు స్నాక్స్‌.. ‘సింపుల్‌ వీక్లీ ప్లాన్‌’ ఇదే | NIN director Bharati Kulkarni exclusive interview on kids diet | Sakshi
Sakshi News home page

పిల్ల‌ల‌ స్నాక్స్‌ బాక్సు.. ‘సింపుల్‌ వీక్లీ ప్లాన్‌’ ఇదే

Jul 1 2025 8:05 PM | Updated on Jul 1 2025 8:57 PM

NIN director Bharati Kulkarni exclusive interview on kids diet

‘సాక్షి’తో ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డా. భారతీ కులకర్ణి

స్కూళ్ల సీజన్‌ ప్రారంభమైపోయింది. తల్లిదండ్రులందరికీ.. తమ పిల్లలను చక్కగా తయారుచేయడం ఒక యజ్ఞమైతే.. వారికి బాక్సుల్లో చిరుతిళ్లు, మధ్యాహ్నం భోజనానికి ఏమేం పెట్టాలో నిర్ణయించి, తయారుచేయడం లేదా కొనిపెట్టడం మరో యజ్ఞం. పిల్లలకు మంచి పోషకాహారం పెట్టాలని చాలామందికి ఉంటుంది గానీ తెలియక కొందరు, సమయం లేక మరి కొందరు పెట్టలేరు. అలాంటి వాళ్లందరి కోసం.. ‘అసలు రోజువారీ భోజనంలో అన్ని పోషకాలూ అందాలంటే ఏయే పదార్థాలు పెట్టాలి.. మాంసకృత్తులు ఎంత ఇస్తే మంచిది.. చిరు ధాన్యాలను పిల్లలకు పెట్టవచ్చా..’ ఇలాంటి ఎన్నో విలువైన విషయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) డైరెక్టర్‌ డా. భారతి కులకర్ణి.

ప్ర: స్కూళ్ల సీజన్‌ మళ్లీ ప్రారంభమైంది. ఫాస్ట్‌ ఫుడ్స్, జంక్‌ ఫుడ్స్‌ పిల్లల, ముఖ్యంగా బడుల్లో చదువుకుంటున్న పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సమస్యపై ఎన్‌ఐఎన్‌ ఇటీవల చేసిన అధ్యయనాలేమైనా ఉన్నాయా?
జ: ఉన్నాయి. అధికంగా కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఇలాంటి ఆహార పదార్థాల వల్ల మన పిల్లల ఆరోగ్యానికి జరుగుతున్న నష్టం గురించి భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌)కి అనుబంధంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) అనేక అధ్యయనాలు నిర్వహించింది. వీటి ఫలితాలను ఫాట్‌ స్టడీ రిపోర్ట్స్, ఎఫ్‌.ఓ.పి.ఎన్‌.ఎల్‌. స్టడీ 2023, డైటరీ గైడ్‌లైన్స్‌ 2024 వంటి అనేక నివేదికల్లో పొందుపరచి జాతీయ విధాన చర్చల కోసం అందించింది.

ప్ర: ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే స్కూలు పిల్లలకు ఉదయపు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్‌), మధ్యాహ్న భోజనం, రాత్రి ఆహారంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులను ఎంతెంత పాళ్లలో అందించాలి?
జ: పిల్లలు ప్రతి రోజూ నీరసం లేకుండా శక్తిమంతంగా గడపడానికి, ఆరోగ్యంగా ఎదగడానికి పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులతో కూడిన సమతులాహారం అందించాలి. ఈ కింద పేర్కొన్న విధంగా పెడితే బాగుంటుంది:

ప్ర: ప్రతి కిలోగ్రామ్‌ శరీర బరువుకు 1 గ్రాము మాంసకృత్తులు తినాలని చెబుతూ ఉంటారు కదా! ఊబకాయం ఉన్నా, లేకున్నా స్కూలు పిల్లలకు, పెద్దలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? 
జ: అవును. ఈ సూత్రం స్కూలుకెళ్లే పిల్లలతో పాటు జనాభాలో చాలామందికి వర్తిస్తుంది. వారు మామూలుగా ఉన్నా, ఊబకాయంతో ఉన్నా సరే.. ఇందులో మార్పేమీ లేదు. అయితే, ఊబకాయంతో ఉన్న పిల్లలు ఎంత మాంసకృత్తులు తినాలనేది లెక్క వేసేటప్పుడు ఇప్పుడు వారున్న బరువును లెక్కలోకి తీసుకోకూడదు. వారి వయసు/ఎత్తును బట్టి వారు ఎంత బరువుంటే బాగుంటుందో దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. మాంసకృత్తులు శరీరం, మెదడు ఎదుగుదలకు ఉపకరిస్తాయి. ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, పప్పులు, చేపల నుంచి లభించే నాణ్యమైన మాంసకృత్తులు ఇవ్వటం ముఖ్యం.

ప్ర: కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు వంటి మిల్లెట్లతో వండిన వంటకాలను రోజువారీ ప్రధానాహారంగా తీసుకుంటే పిల్లలకైనా, పెద్దలకైనా పోషకాల లభ్యత సమస్య వచ్చే అవకాశం ఉంటుందా?
జ: స్మాల్‌ మిల్లెట్లలో పీచు, ఇనుము, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిలోని ఫైటేట్స్‌ అనే యాంటీ–న్యూట్రియంట్స్‌ కారణంగా వాటిలోని పోషకాలను పూర్తి గా వంట పట్టించుకోవటం సాధ్యపడదు. వీటిని సరైన పద్ధతిలో.. అంటే.. నానబెట్టి, పులియబెట్టి, మొలకలు వచ్చేలా చేసి తింటే వాటిలోని పోషకాలను వంట పట్టించుకోవచ్చు. వరి అన్నానికి బదులుగా చిరుధాన్యాల అన్నాన్ని ఒకేసారి 100% తినటం కాకుండా.. కొంత శాతంతో ప్రారంభించటం మంచిది. చిరుధాన్యాలు పిల్లలకైనా పెద్దలకైనా ఉపయోగకరమైనవే. ఇవి జీర్ణశక్తిని పెంపొందించడానికి, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి, ఊబకాయాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి.

ప్ర: ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకునే పిల్లలు వారం రోజుల్లో తినదగిన ఆరోగ్యదాయకమైన చిరుతిండ్లను సూచించగలరా?
జ: స్కూల్‌ టిఫిన్‌/స్నాక్స్‌ బాక్సుల్లో పెట్టడానికి ‘సింపుల్‌ వీక్లీ ప్లాన్‌’ ఈ కింది విధంగా ఉంటే బాగుంటుంది.  

చిన్నపిల్లల వైద్యురాలు.. శాస్త్రవేత్త
డాక్టర్‌ భారతి కులకర్ణి ఎంబీబీఎస్‌ చదివి.. శాస్త్రవేత్తగా మారారు. పుణే యూనివర్సిటీలో చిన్నపిల్లల వైద్యశాస్త్రంలో పీజీ చేశారు. అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో మాస్టర్స్‌ చదివారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి డాక్టోరల్‌ డిగ్రీ పొందారు.చిన్న పిల్లల ఆహారానికి సంబంధించిన జాతీయ ప్రమాణాల రూపకల్పనపై ప్రత్యేక కృషి చేశారు.

ఏ రోజైనా సరే.. నీరు, పండ్లు, పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలనే పిల్లలకు పెట్టాలి. నూనెలో వేపిన వంటకాలు రోజూ పెట్టొద్దు. ప్యాకెట్లలో దొరికే స్నాక్స్, చిప్స్, చాక్లెట్లు, తీపి పానీయాలు ఇవ్వొద్దు.

1. ఉదయపు అల్పాహారం: 
50% పిండి పదార్థాలు – శక్తి కోసం 
ఉదా: ఇడ్లీ, పోహా, చపాతి, హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌ వంటివి
25% ప్రొటీన్‌ – శరీరం ఎదుగుదల కోసం 
ఉదా: పాలు, గుడ్లు, మొలకలు, పప్పు వగైరా
25% ఆరోగ్యకరమైన కొవ్వులు–మెదడు పెరుగుదల కోసం 
ఉదా: వేరుశనగలు, బాదం పప్పులు వంటి నట్స్, కొద్ది పరిమాణంలో నెయ్యి

2. మధ్యాహ్న భోజనం: 
వరి అన్నం లేదా రొట్టెతో పాటు పప్పు లేదా పెరుగు, ఆ సీజన్‌లో పండే కనీసం ఒక రకం
కూరగాయ, ఒక పండు.

చ‌ద‌వండి: అమ్మత‌నం ఇచ్చిన 'బ్ర‌హ్మా'నందం

3. రాత్రి భోజనం: 
మధ్యాహ్న భోజనం మాదిరిగానే ఉండొచ్చు. కాకపోతే కాస్త లైట్‌గా ఉంటే మంచింది. అంటే, తక్కువ నూనె, ఎక్కువ కూరగాయలు పెట్టాలి. మరీ రాత్రి ఆలస్యంగా కాకుండా, ముందే భోజనం చేసేయాలి. ఇలా ఆహారం తీసుకునే పిల్లలు స్కూల్లో పాఠాలపై దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. చురుగ్గా ఉంటారు. ఆరోగ్యంగా తగినంత బరువుతో ఎదుగుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement