World Earth Day 2022: వరల్డ్‌ ఎర్త్‌ డే.. పక్షులకు సేనాపతి

National Geographic in India to launch One for Change campaign on Earth Day - Sakshi

పక్షుల కోసం ఒక సైన్యం ఉంటుందా? అదీ మహిళా సైన్యం. ఉంటుంది. అస్సాంలో ఉంది. అక్కడి అరుదైన కొంగలు అంతరించిపోతున్నాయని గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది వైల్డ్‌ లైఫ్‌ బయాలజిస్ట్‌ పూర్ణిమ బర్మన్‌. ఈ సైన్యం కొంగలను రక్షిస్తుంది. ఈ నేల, ఆకాశం, జీవజాలం ఎంత విలువైనవో చైతన్యపరుస్తుంది. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌ ఎర్త్‌ డే సందర్భంగా ‘వన్‌ ఫర్‌ చేంజ్‌’ పేరుతో మన దేశంలో పర్యావరణ మార్పుకోసం విశేషంగా కృషి చేసిన పది మందిపై షార్ట్‌ ఫిల్మ్స్‌ ప్రసారం చేయనుంది. వారిలో ఒకరు పూర్ణిమ బర్మన్‌. ఆమె పరిచయం.

ఈ భూమిని అందరూ ఉపయోగించుకుంటారు. కొందరే భూమి కోసం తిరిగి పని చేస్తారు. మనల్ని కాపాడే భూమిని కాపాడటానికి జీవితాన్ని అంకితం చేసే వాళ్ల వల్లే మనం ఈ మాత్రం గాలిని పీల్చి, ఈ మాత్రం రుతువులను అనుభవిస్తున్నాం. అడవులని చూస్తున్నాం. కలుషితం కాని నదుల ప్రవాహంలో పాదాలు ముంచగలుగుతున్నాం. పిట్టలు, పొదలు మనవే అనుకుంటున్నాం. వీటి కాపలాకు ఉన్నది ఎవరు? పూర్ణిమ బర్మన్‌ ఒకరు.

స్టూడెంట్‌ నుంచి యాక్టివిస్టుగా
పూర్ణిమ దేవి బర్మన్‌ది గౌహటి. వైల్డ్‌లైఫ్‌ బయాలజీని ముఖ్యాంశంగా తీసుకుని పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసింది. 2007లో గ్రేటర్‌ అడ్జటంట్‌ స్టార్క్స్‌(పారిశుద్ధ్య కొంగలు) మీద పిహెచ్‌డి చేయడానికి కామరూప జిల్లాలోని దాదర గ్రామానికి వెళ్లింది. ఒకప్పుడు ఆగ్నేయాసియా లో ఉండే ఆ కొంగలు అంతరించిపోయే స్థితికి వచ్చి కేవలం అస్సాం, బిహార్‌లలో కనిపిస్తున్నాయి. ఇవి పారిశుద్ధ్య కొంగలు. అంటే మృతకళేబరాలను తిని శుభ్రం చేస్తాయి.

పర్యావరణ వృత్తంలో వీటి పాత్ర కీలకం. ఐదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. చూడ్డానికి అందంగా ఉండవు. చెట్ల పైన గూళ్లు పెడతాయి. తేమ అడవులు వీటికి ఇష్టమైనా ఆ అడవుల స్థానంలో ఊళ్లు వెలుస్తూ రావడం వల్ల ఇవి గ్రామాల్లోనే చెట్ల మీద గూళ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. అయితే పూర్ణిమ వచ్చేంత వరకూ పరిస్థితి వేరుగా ఉండేది. వీటిని గ్రామస్తులు బతకనిచ్చేవారు కాదు. ఇవి గూళ్లు పెట్టిన చెట్లను నరికేసేవారు. దాంతో అవి దిక్కులేనివి అయ్యేవి. అప్పుడే పూర్ణిమ ఆ గ్రామానికి వెళ్లింది.

పీహెచ్‌డి ఏం చేసుకోవాలి?
పూర్ణిమ వెళ్లేసరికి ఒక గ్రామంలో ఈ పారిశుద్ధ్య కొంగల గూళ్లు ఉన్న చెట్లను కూల్చేస్తున్నారు. అక్కడ ఆ కొంగలను ‘హార్గిల్లా’ అంటారు. ‘ఎందుకు కూలగొడుతున్నారు?’ అని పూర్ణిమ పోట్లాటకు వెళ్లింది. అప్పుడు వాళ్లు చెప్పిన జవాబు ఏమిటంటే– పెంట దిబ్బల మీద మృతకళేబరాలను తాను తిని పిల్లల కోసం కొంత ముక్కున పట్టి తెస్తుంది తల్లి. అలా తెచ్చేప్పుడు ఇళ్ల ముంగిళ్లలో డాబాల మీద కొంత జారి పడుతుంటుంది. అది నీçచుకంపు. పైగా దీని ఆకారం బాగుండదు కనుక దుశ్శకునంగా భావించేవారు. అందుకని వాటిని రాళ్లతో కొట్టి తరిమేస్తారు. ‘అదంతా విన్న తర్వాత జనాన్ని ముందు మార్చాలి... అదే అసలైన పిహెచ్‌డి అనుకున్నాను’ అంటుంది పూర్ణిమ. ఇక పిహెచ్‌డిని పక్కన పెట్టి హార్గిల్లాల సంరక్షణకు సంకల్పించుకుంది.

విప్పారిన రెక్కలు
2007లో మొత్తం వెతగ్గా 27 హాగ్రిల్లా గూళ్లు కనిపించాయి పూర్ణిమకు. ఇవాళ 200 గూళ్లుగా అవి కళకళలాడుతున్నాయి. ఒక పక్షిజాతికి ఆ విధంగా పూర్ణిమ జీవం పోసింది. అందుకే ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. చైతన్యం కలిగించి సరిగ్గా పని చేయాలేగాని ఈ భూమిని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకొస్తారని ఈ ఉదంతం చెబుతోంది. పక్షులు వాలే చెట్టు ఉంటే భూమి బతికి ఉన్నట్టు అర్థం. భూమిని బతికించుదాం.

హార్గిల్లా ఆర్మీ
ఊళ్లలో మగవారు పనికిపోతారు. ఇళ్లలో ఉండేది... చెట్ల ౖపైన ఉండే కొంగలను కనిపెట్టుకోవాల్సింది స్త్రీలే అని గ్రహించింది పూర్ణిమ. హార్గిల్లాలు దుశ్శకునం కాదని– బా» ర్‌ చక్రవర్తి ఆ కొంగలు సంచరించే చోట నాగమణి దొరుకుతుందని నమ్మేవాడని చెప్పింది. ఊరు శుభ్రంగా ఉండాలంటే రోగాలు రాకుండా ఈ కొంగలే చేయగలవని చైతన్యం తెచ్చింది. ‘అరణ్యక్‌’ పేరుతో గౌహతిలో ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ కింద దాదర, పచర్సా గ్రామాల్లోని 400 మంది స్త్రీలతో హార్గిల్లా ఆర్మీని తయారు చేసింది. తను ఆ ఆర్మీకి సేనానిగా మారింది. వీరి పని ఈ కొంగలను సంరక్షించడమే. అయితే వీరు బతికేది ఎలా? అందుకని మగ్గం పనిలో ఉపాధి కల్పించింది. ఆ మగ్గం వస్త్రాల మీద కూడా హాగ్రిల్లా కొంగల బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఆ చీరలు బాగా అమ్ముడుపోతున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top