నీళ్లు తాగాలంటే భయం

Mother of Kerala is female labour unions - Sakshi

షాపింగ్‌ మాల్స్‌ రంగురంగుల లైట్ల వెలుగు లో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆ మాల్స్‌లో ఉద్యోగం చేసే సేల్స్‌గాళ్స్‌  ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగకూడదు. ఇది ఆ ఉద్యోగ నియమం. దేహం ఎంత బాధిస్తున్నా సరే, నవ్వు మాయం కాకూడదు. కూర్చోవడానికి కుర్చీలు ఉండవు. కొనుగోలుదారుల సేవ కోసం ఎప్పుడూ చురుగ్గా ఉండాలంటే కూర్చోకూడదు... ఇది ఎక్కడా రాయరు, కానీ ఇది కూడా ఒక నియమం. ఇంకా ఘోరం ఏమిటంటే... బాత్‌రూమ్‌కి ఎన్నిసార్లు వెళ్తున్నారనేది కూడా లెక్కలోకి వస్తుంటుంది. ఉదయం ఏడు గంటలకు ఇల్లు వదిలిన వాళ్లు రాత్రి ఎనిమిది వరకు షాపులోనే ఉండాలి. తిరిగి ఇల్లు చేరేటప్పటికి తొమ్మిదవుతుంది. దాదాపుగా సేల్స్‌గాళ్స్‌గా పని చేసే యువతులందరూ నీళ్లు తాగడం తగ్గిచేశారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండి తరచూ వెళ్లాల్సి ఉన్న ఓ మహిళ ఉద్యోగం పోతుందనే భయంతో ట్యూబ్‌ అమర్చుకుని ఉద్యోగం చేసింది. ఇది కేరళ రాష్ట్రం, కోళికోద్‌ జిల్లాలో చోటుచేసుకున్న దయనీయ స్థితి. ఈ దుస్థితికి మంగళం పాడిందో మహిళ. పేరు విజి పెన్‌కూట్టు.

చైతన్యవంతమైన కేరళ రాష్ట్రంలో కూడా ఉద్యమిస్తే తప్ప శ్రామిక చట్టాలు అమలు కాలేదంటే ఆశ్చర్యమే. అయినా ఇది నిజం. యాభై రెండేళ్ల సామాజిక కార్యకర్త విజి పెన్‌కూట్టు మహిళల కోసం పోరాడింది. న్యాయం కోసం గళం విప్పింది. బాధిత మహిళలతోపాటు సానుభూతిపరులైన మహిళలు కూడా ఆమెతో కలిసి నడిచారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఎనిమిదేళ్ల పోరాటం. ఎట్టకేలకు ప్రభుత్వం కళ్లు తెరిచింది. షాప్స్‌ అండ్‌ కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (అమెండ్‌మెంట్‌) యాక్ట్, 2018 చట్టాన్ని అమలులోకి తెచ్చింది. విజి పోరాటంతో అక్కడి ఉద్యోగినులకు సౌకర్యవంతమైన పనిగంటలు, పని ప్రదేశంలో కనీస సౌకర్యాల ఏర్పాటు సాధ్యమైంది. మన సమాజం ఆధునిక సమాజంగా మారింది. కానీ మెరుగైన సమాజంగా మారలేదింకా. అందుకే చట్టం కోసం కొన్ని పోరాటాలు, వాటి అమలు కోసం మరికొన్ని పోరాటాలు... తప్పడం లేదు. విజి పెన్‌కూట్టు వంటి సామాజిక కార్యకర్తలు తమ గళాలను వినిపించకా తప్పడం లేదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top