పద్మశ్రీ పంకజాక్షి మనుమరాలు

Moozhikkal Pankajakshi performing Nokkuvidya Pavakkali Puppetry - Sakshi

తోలుబొమ్మలాట కళాకారిణి మూళిక్కల్‌ పంకజాక్షికి గత ఏడాది పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎనభై నాలుగేళ్ల వయసులో ఈ పురస్కారం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ‘తోల్‌ పావకూథు, నూల్‌ పావకూథు’ శైలి తోలుబొమ్మలాటల ప్రదర్శనలు ఎక్కువగా ఉండేవి. తోలుబొమ్మలాటలో అత్యంత క్లిష్టమైన నొక్కు విద్య పావకళి సాధన చేసే కళాకారులు తక్కువే, ప్రదర్శనలు కూడా అరుదు. కేరళలోని ఓ కుగ్రామం మునిపల్లెలోని పంకజాక్షి నొక్కు విద్య పావకళిని సాధన చేసింది.

పన్నెండేళ్ల వయసు నుంచి తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టింది. 2008లో పారిస్‌లో కూడా ప్రదర్శన ఇచ్చింది. అప్పటికే ఆమెకు ఇది అరుదైన కళ మాత్రమే కాదు, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నదనే అవగాహన కూడా వచ్చేసింది. విదేశీ వేదిక మీద ప్రదర్శన ఇచ్చిన సంతోషం కంటే తాను మరణించేలోపు ఈ కళను ఎవరికైనా నేర్పించి చనిపోవాలనే చిన్న ఆశ ఆమెలో కలిగింది. కళ్లు మసకబారడం మొదలైంది. ప్రదర్శనలో తొట్రుపాటు వస్తోంది. క్రమంగా తనది చిన్న ఆశ కాదు, చాలా పెద్ద ఆశ అని, బహుశా తీరని కోరికగా మిగిలిపోతుందేమోననే ఆవేదన కూడా మొదలైంది.

ఒక్క మనుమరాలు
ఇది పన్నెండేళ్ల కిందటి మాట. పారిస్‌ ప్రదర్శన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం. నొక్కు విద్య పావకళి అంతరించి పోకూడదనే కృతనిశ్చయంతో పంకజాక్షి తన ముగ్గురు మనవరాళ్లను కూర్చోబెట్టి నొక్కువిద్యకు అవసరమైన మహాభారత, రామాయణ కథలను చెప్పసాగింది. క్రమంగా వారిలో ఆసక్తి రేకెత్తించాలనేది ఆమె ప్రయత్నం. ఆ ముగ్గురిలో అమ్మమ్మ తాపత్రయాన్ని గమనించింది ఒక్క రంజని మాత్రమే. నొక్కు విద్య కథలను నోట్స్‌ రాసుకుంది. పంకజాక్షి భర్త బొమ్మల తయారీలో నిపుణుడు. తాత దగ్గర బొమ్మల డిస్క్రిప్షన్‌ కూడా సిద్ధం చేసుకుంది రంజని. ఆ తర్వాత బొమ్మలతో ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది.

కర్రను పై పెదవి మీద ఉంచి బాలెన్స్‌ చేస్తూ తాడుతో బొమ్మ వెనుక కట్టిన దారాలను కథనానికి అనుగుణం గా కదిలించాలి. ఇది మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. సంవత్సరాల సాధన తర్వాత రంజని నైపుణ్యం సాధించింది. ఇప్పుడు రంజనికి ఇరవై ఏళ్లు. కళను సాధన చేస్తూనే బీకామ్‌ డిగ్రీ చేసింది. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయనుంది. ‘‘తరతరాలుగా మా  కుటుంబం ఈ కళతోనే గుర్తింపు పొందింది. కళను ప్రదర్శించిన తర్వాత ప్రేక్షకులు ఇచ్చిన కానుకలతోనే బతుకు సాగేది. క్రమంగా ప్రేక్షకాదరణ తగ్గిపోవడం తో ప్రదర్శనలూ తగ్గిపోయాయి. మా తల్లిదండ్రుల తరంలో ఇతర వృత్తుల్లో ఉపాధిని వెతుక్కోవడం మొదలైంది. అమ్మమ్మ బాధ పడడం చూసినప్పటి నుంచి ఈ కళను బతికించాలనే కోరిక కలిగింది. అందుకే నేర్చుకున్నాను. ఆ తరంలో వాళ్లకు ప్రదర్శించడం తప్ప ప్రాచుర్యం కల్పించడం తెలియదు. నేను దీనిని ప్రాచుర్యంలోకి తీసుకువస్తాను’’ అంటోంది రంజని.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top