ప్రతి రోజూ ‘పండు’గే.. ఏడాది పొడవునా మామిడి

Mango production round the year, Kota farmer develops a new variety - Sakshi

సదా బహార్‌ రకం అభివృద్ధి చేసిన రాజస్థాన్‌ రైతు

సాక్షి, రాజస్థాన్‌: పండ్ల రారాజు మామిడి పండును ఆస్వాదించాలంటే వేసవికాలం కోసం ఎదురుచూడాల్సిన పనిలేదంటున్నారు రాజస్థాన్‌కు చెందిన శ్రీకిషన్‌ సుమన్‌. ఏడాది పొడవునా మామిడి పండు అందు బాటులో ఉంటుందని చెబుతున్నారు ఈ రైతు. రాజస్థాన్‌లోని కోటకు చెందిన శ్రీకిషన్‌ వినూత్న రకం మామిడిని అభివృద్ధి చేశారు. దీనికి సాధారణ మామిడిలో ఉన్న రోగ నిరోధక సామర్థ్యంతోపాటు ప్రధానమైన వ్యాధులను నిరోధించే శక్తి ఉందంటున్నారు. తియ్యటి ఈ మామిడిని అధిక సాంద్రత ఉన్న తోటల పెంపకంతో పాటు ఇంట్లో కుండల్లో సాగు చేయొచ్చని చెబుతున్నారు. మామిడి గుజ్జులో తక్కువ పీచుపదార్థం ఉంటుందని పోషకాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. రెండో తరగతి తర్వాత పాఠశాలకు స్వస్తి చెప్పిన సుమన్‌ కుటుంబ వృత్తి అయిన తోటపనిలో నిమగ్నమయ్యారు. 

కుటుంబ సభ్యులు గోధుమలు, వరి పండించడంపై ఆసక్తి చూపుతుంటే సుమన్‌ పూల పెంపకంపై దృష్టిపెట్టారు. గోధుమలు, వరిపై వర్షాలు, జంతువుల దాడి ప్రభావం ఉంటుందని, లాభాలు తక్కువగా ఉంటాయని సుమన్‌ గ్రహించారు. భిన్న రకాల రోజా పూల పెంపకంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత మామిడిపైనా ఆయన దృష్టి మళ్లింది. 2000 ఏడాదిలో పండ్ల తోటలో ముదురు ఆకుపచ్చ రంగు ఆకులున్న ఓ మామిడి ఏడాదంతా పూతరావడం గుర్తించారు. దీంతో ఆ చెట్టు నుంచి ఐదు అంటు మొక్కలు వేసి సంరక్షణ ప్రారంభించారు. ‘సదా బహార్‌’ అని పిలిచే ఈ రకాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సుమన్‌కు ఏకంగా 15 సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలో అంటు మొక్కలు రెండేళ్లలో దిగుబడి ఇచ్చాయి. 

కొత్త రకాలను గుర్తించే నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఐఎఫ్‌) సదాబహార్‌ను పరిశీలించి ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ప్లాంట్‌ వెరైటీ, ఫార్మర్స్‌ రైట్‌ యాక్ట్, ఐకార్‌-నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ప్లాంట్‌ జెనటిక్‌ రీసోర్స్‌(ఎన్‌బీపీజీఆర్‌)లో రిజిస్టర్‌కు అనుమతించింది. రాష్ట్రపతి భవనంలోని మొఘల్‌ గార్డెన్‌లో ఈ మొక్కను నాటేలా చర్యలు తీసుకుంది. ‘ఎవర్‌ గ్రీన్‌’రకాన్ని అభివృద్ధి చేసిన శ్రీకిషన్‌ను ఎన్‌ఐఎఫ్‌.. తొమ్మిదో నేషనల్‌ గ్రాస్‌రూట్స్‌ ఇన్నోవేషన్, ట్రెడిషినల్‌ నాలెడ్జ్‌ అవార్డుతో సత్కరించింది.

దేశ విదేశాల నుంచి 2017-20 మధ్య ఏకంగా 8,000 ఆర్డర్లు వచ్చాయని సుమన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, గోవా, బిహార్, చత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఛండీగఢ్‌ రాష్ట్రాల రైతులకు 2018-20 మధ్య సుమారు 6వేల మొక్కలు సరఫరా చేశానన్నారు. క్రిషి విజ్ఞాన్‌ కేంద్రాల్లో 500 మొక్కలుపైగా నాటామని, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లోని పరిశోధన సంస్థలకు అందజేశానని సుమన్‌ తెలిపారు.

చదవండి: కోళ్ల పెంపకంతో వేల ఆదాయం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top