The Little Theatre: వందలాది పిల్లల అమ్మ

The Little Theatre: ICH, Egmore provides creative therapy for child patients - Sakshi

‘ఆరంభ శూరత్వం’ చాలామందిలో కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన అయేషా మేడమ్‌లో అది మచ్చుకైనా కనిపించదు. మూడు దశాబ్దాల క్రితం నాటకరంగంలోకి అడుగు పెట్టిన అయేషా పిల్లల్లో సృజనాత్మక కళల వికాసానికి ‘ది లిటిల్‌ థియేటర్‌’ ప్రారంభించింది. కాలంతో పాటు నడుస్తూ కొత్త ఆలోచనలు జత చేస్తూ థియేటర్‌ను ఎప్పటికప్పుడు క్రియాశీలంగా,
నిత్యనూతనంగా నిర్వహిస్తోంది.

మూడు దశాబ్దాల క్రితం ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాలని ఉంది’ అని తన మనసులో మాటను తండ్రి దగ్గర బయట పెట్టింది అయేషా. ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అలా తండ్రి–కూతురు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ది లిటిల్‌ థియేటర్‌ ట్రస్ట్‌. ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత చాలామందిలో కరుగుతూ పోతుంది. కాని మూడు దశాబ్దాలు దాటినా ‘ది లిటిల్‌ థియేటర్‌’ ఉత్సాహం. సృజన శక్తి రవ్వంత కూడా తగ్గలేదు.

‘ఇంకా కొత్తగా ఏం చేయవచ్చు’ అని ఆలోచిస్తూ వెళుతోంది ది లిటిల్‌ థియేటర్‌. కళలు, ఆరోగ్యాన్ని మేళవించి 2015లో చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో ‘హాస్పిటల్‌ క్లౌన్స్‌’ను పరిచయం చేసింది లిటిల్‌ థియేటర్‌. కీమో థెరపీ చేయించుకునే పిల్లలకు ‘క్రియేటివ్‌ థెరపీ’ అందిస్తోంది.

‘లిటిల్‌ థియేటర్‌’ ద్వారా ఏడాది పొడవునా సృజనాత్మక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. క్యాంప్‌ ఫైర్‌ కథల కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కోవిడ్‌ కల్లోల సమయంలో ‘లిటిల్‌ థియేటర్‌’ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. మల్టీ–కెమెరా సెటప్‌తో షోలను ఎడిట్‌ చేసి అప్‌లోడ్‌ చేసేవారు. యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ఎంతోమందికి చేరువ అయింది.

వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ‘పిల్లలకు క్లాసు, హోంవర్క్‌ తప్ప మరో వ్యాపకం లేకుండా ఉంది’ అని నిట్టూర్చింది అయేషా. విదేశాల్లో ఉన్నత చదువు చదివిన అయేషా అక్కడ  పిల్లల సృజనాత్మక వికాసానికి ఎన్నో వేదికలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ వాటి కొరత ఉంది అని గ్రహించి ‘ది లిటిల్‌ థియేటర్‌’కు శ్రీకారం చుట్టింది.

తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో ‘నాకు వందలాది పిల్లలు పుడతారు’ అని  చెప్పింది చిన్నారి అయేషా. కూతురు మాట విని తల్లి పెద్దగా నవ్వింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా మాట నిజమైంది. ఇప్పుడు నాకు వందలాది పిల్లలు. ది లిటిల్‌ థియేటర్‌కు దగ్గరైన వాళ్లందరూ నా పిల్లలే’ అంటుంది అయేష.

స్కూల్‌ ముగిసిన తరువాత పిల్లల కోసం నాటకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పరిచయం చేసే కార్యక్రమాల నుంచి కుండల తయారీ వర్క్‌షాప్‌ల వరకు ఎన్నో నిర్వహించింది ది లిటిల్‌ థియేటర్‌. ‘ది లిటిల్‌ థియేటర్‌’ ట్రస్టు ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద పిల్లలకు సహాయపడుతుంది.

ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న అయేషా థియేటర్‌కు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలను మాత్రం యువతరానికే అప్పగించింది. ‘ప్రతిభావంతులైన యువతరానికి సృజనాత్మక బాధ్యతలు అప్పగిస్తే కంటెంట్‌లో కొత్తదనం కనిపిస్తుంది. సంస్థ మరింత ముందు వెళుతుంది’ అంటుంది అయేషా.

‘నాటకరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా,  నేర్చుకున్నది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు ఆమె మాటల్లోనే...
‘నాటకరంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. నాటకరంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ కోర్సులలో చేరుతుంటాను. నేను నేర్చుకున్నదాన్ని లిటిల్‌ థియేటర్‌కు తీసుకువస్తుంటాను’ అంటోంది అయేషా.
 

క్రియేటివ్‌ థెరపీ
హాస్పిటల్‌ వాతావరణంలో గాంభీర్యం, విషాదం, నిర్వేదం మిళితమై కనిపిస్తుంటాయి. ఈ వాతావరణాన్ని మార్చడానికి ఆస్పత్రిలో చేరిన పిల్లల్లో హుషారు తెప్పించడానికి, వారి పెదవులపై నవ్వులు మెరిపించడానికి చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో  ది లిటిల్‌ థియేటర్‌ ‘క్రియేటివ్‌ థెరపీ’ నిర్వహిస్తోంది. కథల కార్యక్రమం నుంచి తోలుబొమ్మలాట వరకు రకరకాల సృజనాత్మక కళలలో పేషెంట్లుగా ఉన్న పిల్లలను కలుపుకుంటూ వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. ‘క్రియేటివ్‌ థెరపీ’ కోసం హాస్పిటల్‌లో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు.

ఈ ఏసీ స్టూడియోలో పెర్‌ఫార్మెన్స్‌ లైట్లు, సౌండ్‌ సిస్టమ్స్, డిజిటల్‌ టీవీ స్క్రీన్, వర్క్‌షాప్‌కు సంబంధించి రకరకాల వస్తువులు ఉంటాయి. హాస్పిటల్‌లోని పిల్లల దిగులును దూరం చేయడంలో క్రియేటివ్‌ థెరపీ సత్ఫలితాలు ఇచ్చింది. హాస్పిటల్‌లోని పిల్లల కోసం షెల్ఫ్‌ల నిండా బట్టలు, బొమ్మలు, కలరింగ్‌ బుక్స్‌... మొదలైనవి ఏర్పాటు చేశారు. ఇతర హాస్పిటల్స్‌ కూడా పిల్లల కోసం ‘ఆర్ట్‌ థెరపీ’ని మొదలుపెట్టాయి. అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ రకరకాల పూల మొక్కలు, ప్లే పార్క్, పిట్టగూళ్లతో పేషెంట్ల కోసం ‘హ్యాపీ ప్లేస్‌’ను ప్రారంభించింది.

మా అదృష్టం
‘చదువే కాదు మా పిల్లలకు కళలు కూడా కావాలి’ అంటున్న తల్లిదండ్రుల పరిచయం నిజంగా మా అదృష్టం. ‘చదువు తప్ప మా పిల్లలకు ఏమీ అవసరం లేదు’ అని వారు అనుకొని ఉంటే ది లిటిల్‌ థియేటర్‌ ఇంత దూరం వచ్చేది కాదు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. డబ్బున్న కుటుంబం, డబ్బు లేని కుటుంబం అని తేడా లేకుండా పిల్లలందరూ కళలతో మమేకం కావాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా మారడానికి కళలు ఉపయోగపడతాయి.
– అయేషా, ఫౌండర్, ది లిటిల్‌  థియేటర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top