కథాకళి: అమ్మ భయపడ్డ మనిషి | Kathakali Funday Story | Sakshi
Sakshi News home page

కథాకళి: అమ్మ భయపడ్డ మనిషి

Mar 22 2026 12:47 AM | Updated on Mar 22 2026 12:48 AM

Kathakali Funday Story

రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. సమయం తెల్లవారుజాము. ఆ దేశాల సరిహద్దులోని అతి ముఖ్యమైన పోస్ట్‌ దగ్గర ఇద్దరు సెంట్రీ డ్యూటీలో ఉన్నారు. ట్రెంచ్‌లో ముప్ఫై రెండేళ్ళ వయసుగల సెంట్రీకి కొన్ని గజాల దూరంలో నలభై మూడేళ్ళ మరో సెంట్రీ కూడా డ్యూటీలో ఉన్నాడు. ఇద్దరి రైఫిల్స్‌లో చెరో ఆరు గుళ్ళు ఉన్నాయి. వారిద్దరూ మేలుకుని బైనాక్యులర్స్‌లోంచి ఎదురుగా ఉన్న చెట్లవైపు చూస్తున్నారు. ఆ చెట్ల వెనక శత్రుసైన్యం ఉందన్న సమాచారం వారికి అందింది. ఒకరి తర్వాత మరొకరు బైనాక్యులర్స్‌లో ఆ చెట్లవంక వంతులు ప్రకారం చూస్తున్నారు.

 శత్రుసైనికుల కదలికలని ఎంత త్వరగా గుర్తిస్తే అంత భద్రత కాబట్టి, వారు అప్రమత్తంగా ఉన్నారు.‘‘రేపు మధ్యాహ్నం మా ఆవిడతో మాట్లాడబోతున్నాను.’’ నలభై మూడేళ్ళ సైనికుడు ఉత్సాహంగా చెప్పాడు.‘‘ఫ్రంట్‌లో ఉన్నావు కదా. నీ గొంతు వింటే వాళ్ళకి ఎంతో తృప్తి.’’బైనాక్యులర్స్‌లోంచి చూసే మొదటి సైనికుడికి కొద్దిసేపటికి ఎదురుగా చెట్లు వెనక నుంచి ఎవరో రావడం కనపడింది.‘‘చూడు.’’ అతను రెండో సైనికుడ్ని అప్రమత్తం చేశాడు.‘‘అవును.’’ రెండో సైనికుడు కూడా బైనాక్యులర్స్‌లోంచి వెంటనే చూసి చెప్పాడు.నలుగురు శత్రుసైనికులని చూశాక ఇద్దరూ బైనాక్యులర్స్‌ పక్కనపెట్టి, రైఫిల్స్‌ అందుకుని దాని నైట్‌ విజన్‌ టెలిస్కోప్‌లోంచి చూడసాగారు.

‘‘వంద మీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్ళు రేంజ్‌ లోకి రావాలి.’’ మొదటి సైనికుడు లెన్స్‌   అడ్జస్ట్‌ చేసి చూసి చెప్పాడు.నక్కి వస్తున్న ఆ నలుగురు శత్రుసైనికుల చేతుల్లోని రైఫిల్స్‌ పేలడానికి సిద్ధంగా ఉన్నాయి.‘‘కుడివైపు ఇద్దరు నా టార్గెట్స్‌. ఎడమవైపు ఇద్దరు నీ టార్గెట్స్‌.’’ మొదటి సైనికుడు చెప్పాడు.శత సైనికులు రేంజ్‌లోకి వచ్చాక, మొదటి సైనికుడు గుసగుసగా చెప్పాడు.‘‘ఇప్పుడు.’’ఇద్దరూ రైఫిల్స్‌ని ఏకకాలంలో కాల్చారు. రెండో సైనికుడి గురి తప్పలేదు. ఎడమవైపున్న మొదటివాడు నేలకూలాడు. కుడివైపు చివరివాడు అదే సమయంలో రెండు అడుగులు పక్కకి వేయటంతో, మొదటి సైనికుడి గురి తప్పింది. అతను తక్షణం మళ్ళీ కాల్చాడు. ఈసారి అతను నేలకూలాడు.

‘‘టు డౌన్‌.’’ రెండో సైనికుడు ఉత్సాహంగా చెప్పాడు.వెంటనే మిగిలిన ఇద్దరు శత్రు సైనికులు నేలమీద బోర్లా పడుకున్నారు. అవతలి నుంచి కూడా రైఫిల్స్‌ పేలసాగాయి. రెండో సైనికుడు చూడటానికి ట్రెంచ్‌లోంచి కొద్దిగా పైకి లేవగానే, శత్రుసైనికుడు కాల్చిన గుండు నుదుటిలోంచి లోపలకి వెళ్ళడంతో వెనక ట్రెంచ్‌ గోడకి గుద్దుకున్నాడు. మొదటి సైనికుడు అతని దగ్గరకి పాక్కుంటూ వెళ్ళి చూసి, అతను మరణించాడని గుర్తించాడు. అతను కోపంగా కాల్చిన నాలుగు గుళ్ళల్లో ఒకటి తాకి మరో శత్రుసైనికుడు నేలకూలాడు. ముగ్గురు మరణించాక మిగిలిన ఒక్క శత్రుసైనికుడు రైఫిల్‌ని పేలుస్తూ ముందుకి పాకసాగాడు.

ట్రెంచ్‌లోంచి కొద్దిగా పైకి లేచిన మొదటి సైనికుడికి, దాని ముందు పాకుతూ వచ్చే శత్రుసైనికుడు మూడు అడుగుల దూరంలో కనిపించాడు. అతని రైఫిల్‌ తనకి గురిపెట్టి ఉంది. అదే సమయంలో మొదటి సైనికుడి రైఫిల్‌ కూడా శత్రుసైనికుడి మొహానికి గురిపెట్టి ఉంది. ఒకరికి మరొకరు గురిపెట్టిన రైఫిల్స్‌తో చలనరహితంగా, నిశ్శబ్దంగా ఉండిపోయారు. అలా కొద్ది క్షణాలు గడిచాయి. ఎవరు పేల్చినా రెండోవారు కూడా పేలుస్తారనే భయంతో వాళ్ళ చూపుడువేలు ట్రిగర్‌ని నొక్కలేదు. పది క్షణాల తర్వాత శత్రు సైనికుడు సందేహించలేదు. తను కాల్చిన మరుక్షణం తనని శత్రువు కాలుస్తాడని తెలిసీ ట్రిగర్‌ నొక్కాడు. దురదృష్టం. అది క్లిక్‌మంది తప్ప పేలలేదు. 

అందులోని గుళ్ళు అయిపోయాయి. అతనికి బెల్ట్‌లోంచి గుండుని తీసి మళ్ళీ లోడ్‌ చేసే వ్యవధి లేదు. అతను భయంగా ట్రెంచ్‌లోని సైనికుడి వంక చూశాడు. తర్వాత నెమ్మదిగా తన రైఫిల్‌ని కిందపడేసి, మోకాళ్ళ మీద కూర్చుని, రెండు చేతులనీ తల వెనక ఆనించి లొంగిపోయి భయంగా చూడసాగాడు. లొంగిపోయినవాడిని, నిరాయుధుడిని చంపకూడదు అన్నది అంతర్జాతీయ యుద్ధ నియమం. అయినా, అతను దాన్ని అతిక్రమించినా, అది ప్రపంచానికి తెలీదని శత్రుసైనికుడికి తెలుసు. అతిక్రమించి తనని కాల్చి చంపుతాడా? మొదటి సైనికుడు ట్రైంచ్‌లోంచి పైకి వచ్చి, అతని వెనక్కి వెళ్ళి రైఫిల్‌ గొట్టాన్ని అతని వీపుకి ఆనించి నెమ్మదిగా చెప్పాడు.

‘‘నడు.’’‘‘మా అమ్మ భయపడ్డ మనిషివి– నా ప్రాణాలు తీసే శత్రువువి నువ్వే.’’ శత్రు సైనికుడు నెమ్మదిగా చెప్పాడు. ఇద్దరూ కొద్ది నిమిషాల దూరంలోని గుడారాల దగ్గరికి చేరుకున్నారు. మొదటి సైనికుడు తను తెచ్చిన శత్రుసైనికుడి ఎదురుగా నిలబడి, రైఫిల్‌ బేరల్‌ని అతనికి ఛాతీకి నొక్కిపెట్టాడు. అతను కాల్చబోతున్నాడని గ్రహించిన శత్రుసైనికుడు భయంతో కళ్ళు మూసుకుని చావుకోసం ఎదురు చూశాడు. మొదటి సైనికుడు ట్రిగర్‌ని నొక్కాడు.అది క్లిక్‌మంది తప్ప, దాంట్లోంచి గుండు బయటికి రాలేదు.‘‘నేను నా రైఫిల్‌లోని గుళ్ళని లెక్కపెట్టుకుంటూ పేల్చాను. నీలా నాకూ రీలోడ్‌ చేసే సమయం లేకపోయింది. నువ్వు ఇప్పుడు యుద్ధ ఖైదీవి.’’ మొదటి సైనికుడు నవ్వుతూ చెప్పాడు. మిగిలిన సైనికులు పగలబడి నవ్వసాగారు.

∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  


 

Advertisement
 
Advertisement
Advertisement