ఇకపై నిర్ణయించేది మేమే!

journalist turned entrepreneur is building a social media platform exclusively for women - Sakshi

మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఈ ఆధునిక యుగంలో కూడా ఈ స్థాయిలో ఉందా? అపర్ణ ఏర్పాటు చేసిన రెస్పాన్సిబుల్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ గురించి తెలిసినప్పుడు ఎదురయ్యే సహజమైన సందేహం ఇది. అయితే మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఆధునిక యుగంలోనే ఎక్కువగా ఉందంటోంది అపర్ణా అచరేకర్‌. ఇరవై ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఆమెకు నేర్పిన వాస్తవం ఇది. మహిళ పట్ల అణచివేత భౌతికంగా తగ్గినట్లు అనిపిస్తుందేమో కానీ మానసికంగా ఎక్కువైందంటోందామె. తమకంటూ ఒక గుర్తింపు, స్వాతంత్య్రం, తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోగలిగిన సమాజం కోసం ఆమె సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అనే కొత్త పాత్రలోకి ఒదిగిపోయారు. ‘ఈవ్‌ వరల్డ్‌’ అనే సోషల్‌ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ అచరేకర్‌.

ముంబయికి చెందిన అపర్ణా అచరేకర్‌ మహిళల కోసం పని చేయాలనే సంకల్పం కలిగిన వెంటనే గత ఏడాది అక్టోబర్‌ నెలలో ఆచరణలోకి దిగింది. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగిన వేదిక అది. ఒకరు మరొకరిని ప్రభావితం చేసుకోగలిగిన అవకాశం ఈ వేదిక ద్వారా లభిస్తోంది. ‘‘ఐడెంటిటీ, ఇండిపెండెన్స్, ఇన్‌క్లూజన్‌’ అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన ఈ వేదిక ద్వారా మహిళలు తాము కోరుకుంటున్న గుర్తింపుతో పరిచయమవుతారు, ఆ స్థానంలో నిలబడడం కోసం పరస్పర సహకరించుకుంటారు, తమ జీవితాలకు అవసరమైన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటారు. అలాగే మగవాళ్లు నిర్దేశించిన నియమావళిని రూపుమాపడానికి కృషి చేస్తారు. కొత్త నియమావళిని మహిళలే నిర్ణయిస్తారు. మొత్తానికి మహిళలు తమకంటూ ఒక స్పేస్‌ని ఈ వేదిక ద్వారా క్రియేట్‌ చేసుకోగలుగుతారు’’ అని చెప్తోంది అపర్ణ.

అందం కొలతల్లో ఉండదు!
‘‘మన భారతీయ సమాజం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మహిళ విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంది. ‘ఆడవాళ్లు ఎలా ఉండాలి...’ అనే నియమాలను మగవాళ్లే రూపొందిస్తుంటారు. ఆడవాళ్లు ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర.

అలాగే మెంటల్‌ హెల్త్‌ నుంచి మెన్‌స్ట్రువల్‌ టాబూ వరకు మహిళల స్వేచ్ఛను నిరోధించే శక్తిగా ఉంటోంది మగవాళ్ల భావజాలం. వీటికి భిన్నంగా మహిళలు వ్యవహరిస్తే సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడడానికి ఏ మాత్రం సందేహించరు. ‘ఆడవాళ్ల విషయంలో తీర్పులివ్వడానికి మనం ఎవరు?’ అనే ప్రశ్న తమను తాము వేసుకునే మగవాళ్లు ఎందరు? వీటన్నింటికీ చరమగీతం పాడుతూ మహిళలు కొత్త నియమావళిని రూపొందిస్తారు’’ అని ఆశాభావం వ్యక్తం చేసింది అపర్ణ. సోషల్‌ మీడియా వేదికగా రకరకాల వేధింపులు, సైబర్‌ బుల్లీయింగ్‌కు గురవుతున్న మహిళలకు తమ భావవ్యక్తీకరణకు ఇది ఒక సురక్షితమైన వేదిక అవుతుంది.
 
ఆడవాళ్లు ఎలా ఉండాలి...
ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top