హృదయమనే పలక మీద దేవుడుంటే..? | John Wesley Devotional Article On Jesus Christ | Sakshi
Sakshi News home page

హృదయమనే పలక మీద దేవుడుంటే..?

Sep 5 2021 6:58 AM | Updated on Sep 5 2021 6:58 AM

John Wesley Devotional Article On Jesus Christ - Sakshi

ప్రతి మనిషికి హృదయం ఉంది. అయితే ఆ హృదయాన్ని ఎలా నిర్వచించగలము? దానిని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం ఎలా? పరిశుద్ధ గ్రంథంలో మానవ హృదయాన్ని గురించి అనేక వచనాలు ఉన్నాయి.

నీ హృదయమను పలకమీద వాటిని రాసికొనుము. సామెతలు 7:3. ఈ సువిశాల ప్రపంచంలో మానవుడు దేవుని రూపంలో, పోలికలో సృషించబడ్డాడు. ప్రతి మనిషికి హృదయం ఉంది. అయితే ఆ హృదయాన్ని ఎలా నిర్వచించగలము? దానిని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం ఎలా? పరిశుద్ధ గ్రంథంలో మానవ హృదయాన్ని గురించి అనేక వచనాలు ఉన్నాయి. సామెతల గ్రంథకర్త సొలొమోను మనిషి హృదయాన్ని పలకతో పోల్చి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను వివరించాడు. పలక తెలియనివారెవ్వరు? పూర్వదినాల్లో ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ కాలం భద్రపరచాలనుకున్నప్పుడు వాటిని రాతి పలకల మీద రాసేవారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాలలో చాలా రాతి పలకలు బయటపడుతున్నాయి. వాటిమీద రాసిన విషయాలను బట్టి ఆయా కాలాల చరిత్రను, ఆ కాలంలో జరిగిన సంగతులను అర్థం చేసుకొంటున్నారు. బైబిల్‌ రాతలను, చరిత్రను సమర్థించే చాలా పలకలు నేటికీ ఉన్నాయి.

విన్న విషయాల కన్నా చేతితో రాయబడినవి ఎక్కువ కాలం గుర్తుంటాయన్నది పెద్దల మాట. మానవ హృదయం కూడా ఒక పలకే. అనునిత్యం వాటిమీద ఏం రాసుకొంటున్నాము అనేది మన భవిష్యత్తును శాసిస్తాయి. హృదయం నిండియున్న వాటిని బట్టి నోరు మాట్లాడుతుంది అని బైబిల్‌ సెలవిస్తుంది (లూకా 6:45). కొందరు తమకు హాని చేసినవారి వివరాలు హృదయమనే పలక రాసుకొని ఎప్పటికైనా వారికి ప్రతీకారం చేయాలని కనిపెడతారు. కొందరు యవ్వనస్థులు తాము ప్రేమించే వారిని వారి హృదయాల్లో చెక్కుకుంటారు. అనుక్షణం వారి కోసం జీవిస్తారు, తపిస్తారు. రోజులో ఎక్కువ సమయం వారి గురించే ఆలోచిస్తారు. ఒక్క విషయం స్పష్టంగా ఆలోచించాలి. హృదయమనే పలక మీద ఎవ్వరిని చెక్కుకుంటే, వేటిని రాసుకొంటే వారే జీవితాన్ని శాసిస్తారు. మన ఆలోచనలను, తలంపులను, అలవాట్లను పురికొల్పుతారు.

ఇప్పటికిప్పుడు నీ హృదయమనే పలకను పరిశీలిస్తే తీస్తే ఎవరెవరి పేర్లు, జీవితాలు బయటకు వస్తాయి? నిన్ను సృష్టించిన దేవుడు నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నాడు. తన కోసం తాను కట్టుకున్న ఇల్లు అది. దానిని మినహాయించి నీవు దేవునికి ఏం ఇచ్చినా ఆయన సంతృప్తి చెందడు. రకరకాల రాతలు రాయబడిన నీ హృదయమనే పలకను ఒక్కసారి తుడిచేయి! యేసుక్రీస్తు అనే సుమధుర సుందర నామాన్ని లిఖించు. అద్భుతాలు చూస్తావు. ‘‘మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రిక మీరు’’ అని పౌలు దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని తెలియచేశాడు. రక్షింపబడిన నీవు దేవుని పత్రికవు. అనుక్షణం ప్రజల చేత చదువబడుచున్నావు. లోకం నిన్ను అడుగుడుగునా గమనిస్తుంది.

నీ హృదయమనే పలక మీద క్రీస్తుకు చోటుంటే ఆయన వాక్యానికి చోటున్నట్లే. దేవుని వాక్యంతో హృదయాన్ని సంపూర్తిగా నింపుకుంటే శక్తిగల దేవుని మాటలనే నీవు వల్లిస్తావు. నిన్ను గమనించినవారంతా నీ హృదయమనే పలక మీద రాయబడిన క్రీస్తును, మహోన్నతమైన ఆయన ప్రేమను గమనిస్తారు. 
– డా. జాన్‌ వెస్లీ, క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement