
ఆడ్రే త్రుష్కీ, దక్షిణాసియా చరిత్ర ప్రొఫెసర్, రాగర్స్ యూనివర్సిటీ – నెవార్క్
పుస్తక ప్రపంచం
దాదాపు 120 వేల సంవత్సరాల ప్రయాణం నుంచి ఓ 5 వేల సంవత్సరాల భారత ఉపఖండ చరిత్రను వేరు చేసి, సూక్ష్మంలో మోక్షంగా అందించడం సాహసమే! అమెరికాకు చెందిన చరిత్ర పరిశోధకురాలు, బోధకురాలైన ఆడ్రే త్రుష్కీ ఆ పని చేశారు. ఈ‘ఇండియా... 5000 ఇయర్స్’ పుస్తకం రాశారు. మధ్య యుగం కాలంలో సంస్కృతంపైన, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుపైన గతంలో రాసిన పుస్తకాల ద్వారా ఆడ్రే పేరు సుపరిచితమే.
ఔరంగజేబును ఆనాటి సమకాలీన హిందూ, ముస్లిములిరువురూ గౌరవభావంతో చూశారనీ, ఆ తర్వాత కాలంలోనే ఆయనను రాక్షసుడిగా చిత్రించడం జరిగిందని ఆమె పేర్కొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఒక వర్గం దాడులకు దిగవచ్చనే శంకతో ఆమె భారత్‌కు రావడానికి కూడా వెనుకాడాల్సి వచ్చింది. అయితే, బెదిరింపులు ఎన్ని ఉన్నా చరిత్ర పరిశోధకురాలిగా తన అధ్యయనం ఆగదని పేర్కొనే ఆడ్రే నాలుగో పుస్తకం ఈ ‘ఇండియా’.
సాధికారికంగా చెబుతూనే, సామాన్యులకు అర్థమయ్యేలా చరిత్ర లోగుట్టు విప్పడం ఈ రచన ప్రత్యేకత. ఈ ప్రసిద్ధ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రచురణ ఒక రకంగా ఇది భారత భూఖండ చరిత్ర కాదు. ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన పరిణామాలు, ప్రజల చరిత్ర. వలసలు మానవ నాగరికతతో పాటు చరిత్రను మారుస్తాయని భావించిన ఆడ్రే ఆ కోణం నుంచి కలం కదిపారు. గతమెంతో ఘనమనే కీర్తిగానానికి భిన్నంగా రచన చేశారు. అందుకే, ఈ పుస్తకంలోని ఆనాటి జీవిత కథలు తెలియని కోణం తెర మీదకు తెచ్చి ఆశ్చర్యపరుస్తాయి. సుమారు 65వేల ఏళ్ళ క్రితం ఆఫ్రికా పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చి, స్థిరపడిన జనమే ‘ఫస్ట్ ఇండియన్స్’ అనే మాటను ఆడ్రే పునరుద్ఘాటిస్తారు. వారి జన్యువులే ఇప్పటికీ ప్రధానంగా దక్షిణ భారతావనిలో కనిపిస్తాయంటారు.
సాక్ష్యాధారాల సహితంగానే తప్ప అనుశ్రుత కథలతో చరిత్రను అక్షరీకరించలేమన్నది సరైన శాస్త్రీయ దృక్కోణం. ఈ రచన ఆ కోణంలోనే సాగుతుంది. దానివల్ల కొన్ని అంశాల్లో పాతుకుపోయిన నమ్మకాలను ‘ఇండియా’ సమర్థించదు. గతంలోకి తొంగి చూస్తున్నప్పుడు చరిత్రలోని భిన్న స్వరాలను వినిపించడం ముఖ్యమని ఆడ్రే భావన. అందుకే, బౌద్ధం, హైందవం వగైరా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మహిళల గొంతుకలను వినిపించడానికి ప్రయత్నిస్తారు.
ఈ చరిత్ర పునఃకథనంలో నిమ్నవర్గాలను ముందు నిలుపుతారు. అలాగే, ఆ రోజుల్లోనే ఉన్న ‘సోకాల్డ్’ శూద్ర రాజుల గాథల నుంచి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని చూపే అలనాటి సాహిత్య రచనల్ని కూడా చాలామందికి భిన్నంగా అప్పటి చరిత్రపై అవగాహనకు ఆకరాలుగా వాడారు. హైందవం, బౌద్ధం, జైనం, ఇస్లామ్, వేదాలు, మౌర్య సామ్రాజ్యం, చోళులు, మొఘల్ సామ్రాజ్యం, యూరోపియన్ వలస పాలన, భారత స్వాతంత్య్రోద్యమం, చివరకు తాజాగా పెరిగిన హిందూ జాతీయవాదం దాకా అనేక అంశాలను ఈ రచనలో వివరించారు.
అయిదు వేల ఏళ్ళ సుదీర్ఘకాలాన్ని దాదాపు 700 పేజీల ఒకే సంపుటంలో పొందుపరచాలన్నప్పుడు నిడివి రీత్యా ఉండే ఇబ్బందులు సహజం. అందుకే, చాలామందికి తెలిసిన అంశాలు, చరిత్ర అనగానే ఎక్కువగా కనిపించే రాజవంశ గాథలను రచయిత్రి పక్కనపెట్టేశారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ రాజుల చరిత్ర, రాజకీయ చరిత్ర ఎంత ముఖ్యమో... సామాజిక, ఆర్థిక చరిత్ర అంతే కీలకమని గుర్తించి, ఈ రచనలో వాటికి ఆమె పెద్ద పీట వేశారు. ఆ రకంగా ఇది రోమిలా థాపర్ (romila thapar) లాంటి పలువురి కాలక్రమాణిక చరిత్ర రచనలకు పరిపూరకం.
అయితే, ఆధునిక భారత చరిత్రలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, నైజామ్‌లో రజాకార్ల ఆగడాలు, ప్రాంతీయ చరిత్రలను ఆడ్రే ప్రస్తావించక పోవడం ఆశ్చర్యకరమే. భారత్‌పై చైనా దురాక్రమణ, బంగ్లాదేశ్ విమోచన వగైరా ప్రస్తావించిన తీరేమో నిరాశపరుస్తుంది. వెరసి, సుదీర్ఘ చరిత్రకు సంక్షిప్త రూపమే తప్ప ఈ పుస్తకం సమగ్రం కాదు. సర్వజన సమ్మతమూ కాదు. అది గుర్తించి, ఒకే అంశానికున్న పలు పార్శ్వాలను తెలుసుకొనేందుకు చదివితే... ఈ రచన ఆసక్తి అనిపిస్తుందే తప్ప ఆశాభంగం కలిగించదు.