తండ్రిగారి బెంగ

Hardik Pandya Father Sentiment Over Son - Sakshi

అప్పుడేనో, ఆ క్రితమో తండ్రులైన వాళ్లను చూస్తుంటే బంధుమిత్రులకు భలే ముచ్చటగా ఉంటుంది. వీళ్లే కడుపు చించుకుని బిడ్డను కని బయటికి వస్తే, తల్లి ఆ బిడ్డను పక్కలో వేసుకుని, చెవులకు గుడ్డ చుట్టుకుని పడుకుందా అన్నంతగా పిక్చర్‌ రన్‌ అవుతూ ఉంటుంది. ఆ పిక్చర్‌  ఎంతసేపు నడుస్తుందన్నది సాధారణంగా టీవీలో ఐ.పి.ఎల్‌. మొదలై, అది కొనసాగే టైమ్‌ ను బట్టి ఉంటుంది. లేదంటే బిడ్డ దీనికోసమో తెలియకుండా గుక్క పట్టి ఏడవనంతసేపైతే ఖాయంగా ఉంటుంది. పితృ మురిపాన్ని శంకించడం కాదిది. పాపం కొత్త తండ్రుల ప్రేమ ఇలాగే ఉంటుంది. తనకు, బిడ్డకు బొడ్డు తాడు ఉంటే, ఆ బొడ్డు తాడును కట్‌ చేయడం మర్చిపోయి నర్సు ఇంటికి వెళ్లి పోయినంతగా చేసేస్తుంటారు. ఎక్కడ చూడండి తను తండ్రి అయ్యానన్నదే టాపిక్‌. ‘అపురూపమైనదమ్మ.. ఆడజన్మ’ అని ‘పవిత్రబంధం’ సినిమాలో సిరివెన్నెల రాసింది కరెక్టేనా, కె.జె.జేసుదాస్‌ పాడింది కరెక్టేనా అని డౌట్‌ వస్తుంది.. ఈ న్యూ డాడీల వాలకం చూస్తుంటే! డ్యానీ మ్యారిసన్‌ న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌.

ఇప్పుడు ఐపీఎల్‌ కి కామెంటేటర్‌. హార్దిక్‌ పాండ్యా ఎదురు పడితే ‘హాయ్‌’ అని పలకరించాడు. కామెంటేటర్లు ఊరికే హాయ్‌ అని వదిలేయరు కనుక, ‘పార్టీలను మిస్‌ అవుతున్నట్లున్నావు హార్దిక్‌! ఏం చేస్తాం. కరోనా రిస్టిక్ష్రన్స్‌ కదా’ అని నవ్వారు. హార్దిక్‌ వెంటనే, ‘నేనిప్పుడు తండ్రిని కదా! నోపార్టీస్‌‘ అన్నాడు. ఈ ‘ముంబై ఇండియన్స్‌’ ఆల్‌ రౌండర్‌ ఈమధ్యే జూలైలో కొత్తగా తండ్రి అయ్యాడు. ముంబైలో బిడ్డను వదిలేసి వచ్చాడు. తల్లి పక్కలోనే లెండి. ఇప్పుడు ఆ బిడ్డను మిస్‌ అవుతున్నాడట! ‘పార్టీలు మిస్‌ అవుతున్నావు కదా హార్దిక్‌’ అని డ్యానీ మ్యారిసన్‌ అడిగితే, ‘లేదు మ్యారిసన్‌ గారూ.. నా బిడ్డకు డైపర్స్‌ మార్చడం మిస్‌ అవుతున్నా..‘ అని అన్నాడు! హార్దిక్‌ ప్లే బాయ్‌. తండ్రి అయ్యాక అతడు తన జీవితాన్ని ప్లేకి, తన బేబీ బాయ్‌ కి మాత్రమే పరిమితం చేసుకున్నట్లున్నాడు. ‘అయ్యో అర్జునా, ఫల్గుణా, పాండ్యా..’ అని మానవులు చింత పడవలదు. కష్టాలు కలకాలం ఉంటాయా! కొత్త తండ్రులకు మురిపాలూ అంతే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top