Ganesh Chaturthi 2022: Palavelli Significance Explained In Telugu - Sakshi
Sakshi News home page

Ganesh Chaturthi- Palavelli: వినాయక చవితి.. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే!

Published Wed, Aug 31 2022 10:13 AM

Ganesh Chaturthi 2022: Palavelli Significance Explained In Telugu - Sakshi

గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న సామగ్రితో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి సంబారాలే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి,  గరికతో పూజిస్తే చాలు. పండగ సజావుగా సాగిపోయినట్లే ! 

గణానాతాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్‌
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నూతి భిస్సీద సాధనమ్‌

గణపతి అంటే జ్ఞాన, మోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు. ఆయనను స్తుతిస్తే సర్వవిఘ్నాలూ ఉపశమిస్తాయి.

భక్త సులభుడు గణనాథుడు
అంతేకాదు ఆయన భక్త సులభుడు కూడా. బంకమట్టిని తెచ్చి దానికి గణపతి రూపు కల్పించి, ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గరికతోటీ, రకరకాల ఆకులు, పూవులతోటీ పూజించి, ఉండ్రాళ్లూ, పళ్లూ, పానకం, వడపప్పు, కుడుములు నివేదించి, అపరాధ క్షమాపణగా ఐదు గుంజిళ్లు తీస్తేచాలు – మన కోర్కెలన్నింటినీ తీర్చే మహా దయామూర్తి. గణం అంటే సమూహం అని అర్థం.

ఈ సృష్టి యావత్తూ గణాలమయం. అనేకమైన గణాలతో కూడిన మహాగణం. ఈ విశ్వం, మనుష్యగణం, వృక్షగణం, గ్రహగణం– మళ్లీ ఇందులో వివిధ ధర్మాలను అనుసరించి మరెన్నో గణాలు– ఈ గణాలన్నింటిలో నూ అంతర్యామిగా వుంటూ, సృష్టిని శాసించే పరమేశ్వరుడు గణపతి. సమస్త యోగాలకు గణపతియే మూలాధారం. సమస్త విశ్వానికి ఆధారశక్తి గణపతి.

ఇంద్రుడు, భగీర థుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు మొదలయిన వారు గణపతిని ఆరాధించినట్లు ఐతిహ్యాలున్నాయి. దేవతలకే పూజనీయుడైన గణపతి మనందరికీ కూడా ఆరాధనీయుడు కాబట్టి ఆయన ఆవిర్భవించిన వినాయక చవితినాడు ఎవరి శక్తికి తగ్గట్టు వారు  పూజించి ఆయన కృపాకటాక్షాలతో విఘ్నాలను తొలగించుకుని సకల సంపదలనూ పొందవలసిందిగా శాస్త్రాలు చెబుతున్నాయి.  

ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...
పాలవెల్లి అలంకరణమే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్ళు, కాయలు పాలవెల్లి నుండి వ్రేలాడదీసి, మామిడి తోరణాలు, చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వసస్యాధిదేవునిగా సర్వ లోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...  

గణపతి అంటే గణాలకు అధిపతి , తొలిపూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అన్నమాట.. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు.

పాలవెల్లి అంటే పాలపుంతే అని మరి అందులో నక్షత్రాలు ఏవి! అందుకే వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, మారేడు, దానిమ్మలాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట.

ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా! పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లిని అమర్చుతారు. 
– డి.వి.ఆర్‌. 
చదవండి: Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ.. పూర్తి పూజా విధానం

Advertisement
 
Advertisement
 
Advertisement