లిట్‌వరల్డ్‌: పేరు ‘జింకపిల్ల’, బెబ్బులి కూనయా... | funday story journalist mandalaparthy kishore | Sakshi
Sakshi News home page

లిట్‌వరల్డ్‌: పేరు ‘జింకపిల్ల’, బెబ్బులి కూనయా...

May 10 2026 11:48 AM | Updated on May 10 2026 11:48 AM

funday story journalist mandalaparthy kishore

సంగీత సారస్వతాలను చదువులతల్లి స్తన్యంతో పోల్చాడు మహాకవి కాళిదాసు. సంగీతం ఆపాతమధురంగానూ, సాహిత్యం ఆలోచనామృతంగానూ వుంటాయని కూడా ‘కవికులగురువు’ అన్నాడట. సంస్కృతం చదువుకోకపోయినా ఆ విషయం తెలిసిన ఇరవయ్యొకటో శతాబ్ది రచయిత్రి ఒకరున్నారు– ఆమె పేరు ఎల్ఫ్రైడ్‌ జెలెనిక్‌. ఆమె సాహిత్యం చదువుతుంటే శ్రావ్యంగా వుంటుందనేది అందరి అనుభవం; దాని గురించి ఆలోచించే కొద్దీ, మన సామాజిక జీవనం గురించిన ఆలోచన పదునెక్కుతూ పోతుందనేది మాత్రం కొందరి అనుభవమే! నవలా రచన– రూపక ప్రక్రియల్లో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న ఎల్ఫ్రైడ్‌ జెలెనిక్‌ది ఆస్ట్రియా. 

2004 నోబెల్‌ సాహిత్య పురస్కారం ఎల్ఫ్రైడ్‌ గెల్చుకున్నట్టు ప్రకటిస్తూ ఎంపిక సంఘం చేసిన ‘అధికారిక ప్రకటన’లో రచయిత్రి శైలికి జేజేలు పలుకుతూ ఇలా అన్నారు: ‘ఆమె నవలలూ, రూపకాల్లో సంగీతబద్ధమైన స్వరాలూ, అనుస్వరాలూ అసాధారణమైన భాషాభినివేశంతో జాలువారతాయి. జనం నెత్తిన లోకం రుద్దిన అరిగిపోయిన మూసకట్టు పదబంధాల అసంబద్ధతనూ, వాటి పెత్తందారీ పోకడలనూ ఎల్ఫ్రైడ్‌ శైలి బట్టబయలు చేస్తుంది!’– ఓ మూసకట్టు పదబంధాన్నే ఉపయోగించదలిస్తే, ‘ఈ మాటల్లో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదూ’ అనొచ్చు.    

బాల్యం నుంచే, అరడజను సంగీతవాద్యాల్లో సుశిక్షితురాలైనందువల్లనే ఎల్ఫ్రైడ్‌ శైలి అంత శ్రావ్యతను ఆపాదించుకున్న దేమో! వియెన్నా సంగీత విశ్వవిద్యాలయం నుంచి –పిన్న వయసులోనే– ఆర్గనిస్టుగా పట్టా పొందారామె. ఆర్గన్‌తో పాటు పియానో, వయోలిన్, వయోలా, గిటార్, రికార్డర్‌ తదితర వాద్యాల్లో కూడా ఆమె ప్రవీణురాలు. పట్టా పొందిన కొద్ది రోజులకే, కుటుంబసంబంధాల కారణంగా ఎల్ఫ్రైడ్‌ తీవ్రమైన మానసిక ఆందోళన పాలబడ్డారు. చిత్తశాంతి కోసం తడుముకునే క్రమంలోనే ఆమె ఇరవయ్యేళ్ళ ప్రాయంలో కలంపట్టారు. మరుసటి సంవత్సరమే, తన తొలి కవితా సంకలనం ‘లిజా నీడ’తోనే ఎల్ఫ్రైడ్‌ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. నాటినుంచి నేటివరకూ, ఆమె సాహిత్యప్రస్థానం ఎదురులేకుండా సాగుతూనేవుంది.

ఎల్ఫ్రైడ్‌ అంటే, చెక్‌ భాషలో ‘ప్రశాంతపాలిక’ అని అర్థమట! ఇక జెలెనిక్‌ అంటే, ‘జింకపిల్ల’ అని అర్థమట! బహుశా అందుకే కొందరు విమర్శకులు ఆమెని ‘ప్రశాంత హరిణం’ అనడం కద్దు. కానీ తొలి రచన మొదలుకొని నోబెల్‌ పురస్కారం అందుకున్న ఇరవయ్యేళ్ళకు –2024లో– రాసిన  ఆత్మకథాత్మక నవల ‘వ్యక్తిగత వివరాలు’ వరకూ ఎక్కడా ఆమె ప్రశాంత హరిణంలా కనిపించదు. (ఈ రచనకు ప్రామాణిక ఇంగ్లిష్‌ అనువాదం ఇంతవరకూ వెలువడనే లేదు!) ‘అది ఓ కృతో, ఓ కీర్తనో కావచ్చు– లేదా, ఓ కథో కథానికో కావచ్చు అనునిత్యం ఓ కళాఖండం జీవం కోల్పోతూనే వుంటుంది. చరిత్రలో దాని చెలామణీ చెల్లిపోవడం వల్లనే అలా జరుగుతూ వుంటుంది. ఒకప్పుడు మరణమెరుగని కళాఖండాలుగా భావించిన రచనలే కాలక్రమంలో కనుమరుగైపోవచ్చు. వాటి గురించి భవిష్యత్‌ తరాలవారికి ఏమీ తెలియకుండానూ పోవచ్చు.

 అయినప్పటికీ, ప్రతి ఒక్క కళాఖండానికీ నాలుగు కాలాల పాటు బతికిబట్టకట్టే హక్కు ఉంది!’ అని ఎరికా కోహుట్‌తో అనిపిస్తారు ఎల్ఫ్రైడ్‌ ‘ద పియానో టీచర్‌’ నవలలో. (ఆ నవలకు ప్రధాన పాత్ర ఎరికాయే. 28 సంవత్సరాల తర్వాత మైకేల్‌ హానెక్‌ ఈ నవలను సినిమాగా తీశారు!) వియెన్నా సంగీత విశ్వవిద్యాలయంలో పియానో శిక్షణ విభాగంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకున్న ప్రొఫెసర్‌ ఎరికా. ఆమె అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న కళాకారిణి; మంచి శిక్షకురాలు కూడా! అయితే చండశాసనురాలి లాంటి తల్లి పెంపకంలో ఆమె ప్రతిభ రెక్కలు ముడుచుకుని బతుకీడుస్తూ వుంటుంది. వృత్తిజీవితం విషయానికివస్తే ఎరికా విద్యార్థులతో కటువుగా వ్యవహరించే శిక్షకురాలన్నట్లు రచయిత్రి చిత్రించారు. తన విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు సాధించాలనే ఆమె అలా ప్రవర్తిస్తూ వుంటుంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం, తల్లి పెట్టే ఆరళ్ళ కారణంగా ఎరికా చిత్తక్షోభకు గురవుతూ వుంటుంది. 

ఈ వైరుధ్యాన్ని ఎరికా ఎలా పరిష్కరించుకున్నదనేదే ఈ నవల్లో కథాంశం. ప్రొఫెసర్‌ ఎరికాకూ, యువ విద్యార్థి వాల్టర్‌ క్లెమర్‌కూ మధ్య అల్లుకున్న అనుబంధం ఆసరాతోనే ఆమె తన జీవన వైరుధ్యం పరిష్కరించుకున్నట్లు రాశారు ఎల్ఫ్రైడ్‌.ఈ వైరుధ్యం ఎరికాకే పరిమితమైంది కాదు– ఎల్ఫ్రైడ్‌ జీవితంలోనూ ఆమె ఇలాంటి వైరుధ్యం  ఎదుర్కొన్న విషయం రచయిత్రే వెల్లడించారు. ఎరికా పాత్రకు రక్తమాంసాలతో పాటు ఆత్మను సైతం సమకూర్చడానికి ఈ ‘ఆత్మానుభవం’ రచయిత్రికి ఎంతో తోడ్పడి వుంటుంది. పైపైన చూస్తే ఇది చవకబారు ‘శృంగార నవల’గా అనిపించవచ్చు. సాహిత్యం ఆలోచనామృతమనే వాస్తవాన్ని మనసులో పెట్టుకుని చూసేవారికే, ఎల్ఫ్రైడ్‌ జెలెనిక్‌ దృష్టికోణంలోని విశిష్టత కనిపిస్తుంది.
- మందలపర్తి కిషోర్‌            

Advertisement
 
Advertisement
Advertisement