మెల్లగా కరిగే నైస్‌..ఐస్‌ | FunDay Story On Craft Ice | Sakshi
Sakshi News home page

మెల్లగా కరిగే నైస్‌..ఐస్‌

May 10 2026 11:13 AM | Updated on May 10 2026 1:21 PM

FunDay Story On Craft Ice

నిశ్శబ్దంగా గ్లాసు అంచున చేరి, చల్లని స్పర్శతో పరిచయం అవుతుంది. ఆయుష్షు రెండు నిమిషాలే అయినా, వచ్చిన క్షణం నుంచే చిరునవ్వులు కురిపిస్తుంది. ఉన్నంత సేపూ ‘చిల్‌’ చేస్తూ, రోజంతటి అలసటను కరిగించేస్తుంది.మాయమైయ్యే ఆఖరి క్షణం కూడా మనసు నిండా ప్రశాంతతను నింపి, మీకొక ‘కూల్‌ క్యారెక్టర్‌’నిస్తుంది. ఇంతకీ ఎవరీ కూల్‌ ఫ్రెండ్‌ అనుకుంటున్నారా? ఇంకెవరు.. మన పానీయాల ప్రథమ బంధువు, ‘ఐస్‌’! అవును, నిన్నటి దాకా ఒక తెల్లటి మొండి మంచు గడ్డగా మాత్రమే కనిపించే ఇది. 
నేడు, ఒక అపురూపమైన వజ్రంలా 
‘క్రాఫ్ట్‌ ఐస్‌’గా రూపు మార్చుకుని, విలాసానికి చిరునామాగా 
మార్కెట్‌లో మెరిసే ఐస్‌వర్యంగా మారిపోయింది!  

ఒక రాతిని మలిస్తే ఎలా శిల్పంగా మారుతుందో, అచ్చం అలాగే ఐస్‌ కూడా వివిధ రూపాల్లో క్రాఫ్ట్‌ ఐస్‌గా మారి, ప్రత్యేకమైన గౌరవం, హోదా, అందాన్ని సొంతం చేసుకుంటోంది. ఎందుకంటే, ఈ క్రాఫ్ట్‌ ఐస్, సాధారణ ఐస్‌ క్యూబ్‌ కంటే చాలా స్పష్టంగా అందంగా మెరుస్తూ, నెమ్మదిగా కరుగుతుంది. ఇది డ్రింక్‌ రుచిని కూడా మెరుగ్గా చేస్తుంది. అందుకే, ఇప్పటి ప్రపంచంలో డ్రింక్‌కి మొదటి హీరో క్రాఫ్ట్‌ ఐస్‌గామారింది. ఇదివరకు అది గ్లాస్‌లో నిశ్శబ్దంగా కూర్చునే ఒక ‘ఎక్స్‌ట్రా ప్లేయర్‌’. కాని ఇప్పుడు ఒక డ్రింక్‌ రుచి, లుక్‌ను మార్చేసే పవర్‌ సొంతం చేసుకొని స్టేజ్‌పై స్పాట్‌లైట్‌ దక్కించుకున్న ‘స్టార్‌’. ఎందుకంటే అది సాధారణ ఐస్‌ నుంచి క్రాఫ్ట్‌ ఐస్‌గా రూపాంతరం చెందింది. డ్రింక్‌ ఆర్డర్‌ చేసినప్పుడు చాలామంది అడిగేది ‘చల్లగా ఉందా?’ అని, కాని, గ్లాస్‌లో పడే ఐస్‌ ముక్క గురించి ఎవరూ ఆలోచించరు. దాని క్వాలిటీ, సైజ్, డిజైన్‌  వంటివన్నీ అసలు పట్టించుకునే వారే కారు. కాని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మబ్బుల్లేని మంచు! 
ఇంట్లో తయారు చేసే ఐస్‌ క్యూబ్స్‌ను గమనించారా? మధ్యలో తెల్లగా, మబ్బు పట్టినట్టు కనిపిస్తాయి. సైన్స్‌ పరంగా, ఆ తెల్లటి మసక వివిధ గాలి బుడగలు, నీటిలోని చిన్న మలినాలు కలిసి గడ్డకట్టిన గుర్తు. కానీ క్రాఫ్ట్‌ ఐస్‌ మాత్రం అలా ఉండదు. ఇది ప్రత్యేక పద్ధతిలో నెమ్మదిగా, ఒకే దిశలో గడ్డకట్టేలా తయారవుతుంది. దాంతో గాలి బుడగలు బయటకు వెళ్లిపోతాయి, మిగిలేది మాత్రం పూర్తిగా పారదర్శకమైన స్వచ్ఛమైన మంచు. అందుకే దీనిని మబ్బుల్లేని మంచు అని కూడా అంటారు. ఇది అచ్చం పటిక బెల్లంలా, లేదా ఒక ఖరీదైన వజ్రంలా గ్లాస్‌లో మెరిసిపోతూ, చూడటానికి అందంగా ఉండటమే కాదు. నెమ్మదిగా కరిగి డ్రింక్‌ అసలు రుచిని అలాగే కాపాడుతుంది. చిన్న తేడా మాత్రమే అనిపించినా, ఇదే స్పష్టత ఒక సాధారణ పానీయానికి ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.

ఎందుకు ముఖ్యం?
సాధారణ ఐస్‌కి, క్రాఫ్ట్‌ ఐస్‌కి మధ్య ఉన్నది చిన్న తేడాలే అయినా, వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దవి.  ఉదాహరణకు, ఒక గ్లాస్‌ జ్యూస్‌ తీసుకుని ఊహించండి. అందులో వేసిన ఐస్‌ మసకగా, బుడగలతో నిండిపోయి ఉంటే అది కొంచెం అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. అదే గ్లాస్‌లో క్రిస్టల్‌లా మెరిసే క్రాఫ్ట్‌ ఐస్‌ ముక్క పడితే? ఆ గ్లాస్‌ ఒక్కసారిగా ప్రొఫెషనల్‌ లుక్‌లో స్టార్‌ హోటల్‌ రేంజ్‌ను సొంతం చేసుకుంటుంది. కేవలం చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, రుచి కూడా మెరుగ్గా అనిపిస్తుంది.

ఐ స్‌ డిజైనర్స్‌! 
ఐస్‌ కూడా ఇప్పుడు ఒక డిజైనర్‌ ప్రాడక్ట్‌గా మారింది. బ్రాండెడ్‌ వాచీలు, ఖరీదైన ఫర్నిచర్‌ తరహాలోనే ఐస్‌ కూడా ఇప్పుడు ఒక స్టేటస్‌ సింబల్‌. అందుకే మార్కెట్లో ‘ఐస్‌ డిజైనర్స్‌’ హడావుడి కూడా మొదలైంది. వీరు సృష్టించే మంచు ముక్కలు వజ్రంలా మెరిసే డైమండ్‌ షేప్‌లో, పర్ఫెక్ట్‌ ట్రైయాంగిల్, ఒక అందమైన పూల ఆకారాల్లో దర్శనమిస్తూ గ్లాసులో పడగానే ‘ఇది డ్రింక్‌ కాదు, ఒక అద్భుతమైన కళాఖండం’ అనే భావనను కలిగిస్తాయి. ఇందుకోసం, మార్కెట్‌లో కూడా ఈ ఐస్‌ తయారీకి ప్రత్యేకమైన టూల్స్, ట్రేలు, పిల్లలకు నచ్చేలా జంతువుల, మౌల్డ్స్, బాక్స్‌లు, టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో ఇంట్లో కూడా ఈ కొత్త ట్రెండ్‌ జోరుగా కనిపిస్తోంది.

కామన్‌ ఐస్‌
∙మసకగా, మబ్బుగా కనిపిస్తుంది. 
∙త్వరగా కరిగిపోతుంది.
∙త్వరగా కరిగిపోతే డ్రింక్‌ నీరుగా మారుతుంది.
∙రుచి తగ్గిపోతుంది.


క్రాఫ్ట్‌ ఐస్‌

∙క్రిస్టల్‌లా స్పష్టంగా, 
పారదర్శకంగా కనిపిస్తుంది.
∙నెమ్మదిగా కరుగుతుంది.
డ్రింక్‌ రుచిని అలాగే ఉంచుతుంది. 
గ్లాస్‌ లుక్‌ కూడా మెరుగ్గా, మరింత 
స్టయిలిష్‌గా కనిపిస్తుంది.
∙అంటే చిన్న ఐస్‌ ముక్కే 
పెద్ద డిఫరెన్స్‌ చేస్తుంది!

చిన్న ట్విస్ట్‌!
ప్రత్యేకమైన ఈ క్రాఫ్ట్‌ ఐస్‌ తయారీ విధానం వలన, ఈ ఐస్‌ తయారయ్యేందుకు సాధారణ ఐస్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈ నెమ్మదిగా గడ్డకట్టే ప్రక్రియ వలనే దీనికి ఆ స్పష్టత, బలం, అందం కూడా వస్తుంది. అంటే త్వరగా తయారయ్యే ఐస్‌ ఒక ‘ఫాస్ట్‌ ఫుడ్‌’ అయితే, క్రాఫ్ట్‌ ఐస్‌ మాత్రం నిజంగా ఒక ‘ఫైన్‌ డైనింగ్‌’ అనుభవం లాంటిదే! అందుకే దీని డిమాండ్‌ కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

సీక్రెట్‌ సైన్స్‌!
క్రాఫ్ట్‌ ఐస్‌ ఇలా అద్దంలా మెరుస్తుందంటే, దానికి వెనుక ఒక చిన్న మాయ కాదు. ఒక పెద్ద సైన్స్‌ ఉంది. దీనికోసం ‘డైరెక్షనల్‌ ఫ్రీజింగ్‌’ అనే ప్రత్యేక టెక్నిక్‌ వాడతారు. పేరు వినగానే కొంచెం కష్టంగా అనిపించినా, కాన్సెప్ట్‌ మాత్రం చాలా సింపుల్‌. అంటే నీరు అన్ని వైపులా కాకుండా, ఒకే ఒక వైపు నుంచి నెమ్మదిగా గడ్డకట్టేలా’ చేస్తారు. ఇలా చేస్తే, నీటిలో ఉన్న గాలి బుడగలు, చిన్న మలినాలు అన్నీ కింద భాగంలోకి వెళ్లిపోతాయి. పై భాగంలో మాత్రం అచ్చం అద్దంలా, వజ్రంలా మెరిసే స్వచ్ఛమైన మంచు మిగులుతుంది. అందుకే క్రాఫ్ట్‌ ఐస్‌ చూడగానే, ‘గ్లాస్‌ డైమెండ్‌గా’లా అనిపిస్తుంది.

లక్షల ఏళ్ల నాటి చల్లదనం!
కథ ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు దుబాయ్‌ లాంటి నగరాల్లో కొన్ని లగ్జరీ బార్లు మరింత స్పెషల్‌గా ఆలోచిస్తున్నాయి. ప్రత్యేకమైన అతిథుల కోసం సాధారణ క్రాఫ్ట్‌ ఐస్‌ కాదు. గ్రీ¯Œ లాండ్‌ గ్లేషియర్‌ల నుంచి తెప్పించిన లక్ష ఏళ్ల నాటి మంచు గడ్డలు వాడుతున్నారు. అవును, నిజంగానే! మనం రోజూ ఫ్రీజర్‌లో తయారు చేసే ఐస్‌ కొన్ని గంటల వయసు మాత్రమే ఉంటుంది. కానీ ఈ గ్లేషియర్‌ ఐస్‌ మాత్రం లక్ష ఏళ్ల చరిత్రను తనలో దాచుకుని ఉంటుంది. అందుకే ఇప్పుడు లగ్జరీ ప్రపంచంలో ఒక కొత్త జోక్‌ కూడా వినిపిస్తోంది. ‘డ్రింక్‌ ఎంత పాతదో కాదు, ఐస్‌ కూడా ఎంత పాతదో చెప్పాలి!’. అలా ఇప్పుడు లగ్జరీని గ్లాస్‌లో పడే ఐస్‌ ముక్కతో కూడా కొలుస్తున్నారు.

ఇదొక పెద్ద బిజినెస్‌.. 
అప్పట్లో ప్రపంచంలో కాలుష్యం అనే మాటే లేదు! అందుకే ఆ కాలంలో ఏర్పడిన ఈ మంచు గడ్డలు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనవిగా భావిస్తారు. ఈ అరుదైన మంచును ‘ఆర్కిటిక్‌ ఐస్‌’ అనే స్టార్టప్‌ సేకరించి, ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఇలా మీరు తాగుతున్నది కేవలం ఒక కాక్‌టెయిల్‌ మాత్రమే కాదు, హిమయుగం నాటి స్వచ్ఛతతో కూడిన చల్లదనం అంటూ, ఇదే విధంగా మరికొన్ని సంస్థలు కూడా వివిధ రకాల క్రాఫ్ట్‌ ఐస్‌ బిజినెస్‌ చేస్తున్నాయి. అంతేకాదు, ప్రపంచ మార్కెట్‌ లెక్కల ప్రకారం, క్రాఫ్ట్‌ ఐస్‌ మార్కెట్‌ 2031 నాటికి భారీగా పెరిగి, సుమారు 138.9 బిలియ¯Œ  డాలర్లకు చేరుకోనుందని అంచనా. అంటే చిన్నగా కనిపించే ఈ ఐస్‌ ముక్క వెనుక ఇప్పుడొక పెద్ద బిజినెస్, పెద్ద ట్రెండ్, పెద్ద స్టేటస్‌ సింబల్‌ దాగి ఉన్నాయి.

ప్రయోగాలన్నీ రుచికోసమే! 
ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా, ప్రతి ముద్దలోనూ, ప్రతి గుటకలోనూ ఒక సరికొత్త అనుభూతిని వెతకడమే అసలైన భోజన ప్రియుల లక్షణం. అందుకే, జ్యూస్‌ గ్లాస్‌లో పడే ఐస్‌ ముక్క నుంచి కూరలో చివరగా చల్లే కొత్తిమీర వరకు మనం చేసే ప్రతి ప్రయోగం వెనుక ఒక అద్భుతమైన ‘రుచి రహస్యం’ దాగి ఉంటుంది. ఇలాంటి వారికోసమే, క్రాఫ్ట్‌ ఐస్‌ జ్యూస్‌కు ప్రాణం పోసే చిన్న చిన్న ప్రయోగాలు, రుచిని రెట్టింపు చేసే ఆ చిట్కాలు పాటిస్తున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం కొన్ని ‘ఇన్‌ఫ్యూజ్డ్‌ ఐస్‌’ పేరుతో వివిధ రకాల రుచికరమైన క్రాఫ్ట్‌ ఐస్‌ అందుబాటులో ఉన్నాయి.

టీ ఫ్లేవర్డ్‌ ఐస్‌
ఎడారిలో కూడా టీ తాగేటటువంటి చాయ్‌ లవర్స్‌కి ఇదొక కూల్‌ సొల్యూషన్‌. ఐస్‌డ్‌ టీలు లేదా కాక్‌టెయిల్స్‌ తాగేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఐస్‌ కరుగుతున్న కొద్దీ టీ ఫ్లేవర్‌ తగ్గకుండా, మరింత పెరుగుతుంది. ఇందుకోసం, ముందుగా మాచా టీ, గ్రీన్‌ టీ లేదా మీకు నచ్చిన ఏదైనా ఫ్లేవర్డ్‌ టీని డికాక్షన్‌లా మరిగించి చల్లార్చాలి. ఆ నీటిని ఐస్‌ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. కేవలం ఇంట్లో ఉండే టీ పొడి లేదా టీ బ్యాగులతో కేవలం రూ. 5 నుంచి రూ. 10లతో వీటిని తయారు చేసుకోవచ్చు.

సిట్రస్‌ ఐస్‌
డ్రింక్‌కి ఒక తాజాదనాన్ని ఇచ్చేందుకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌. ఇది కేవలం రుచినే కాదు, గ్లాసుకి మంచి సువాసనను కూడా ఇస్తుంది. సిట్రస్‌ రకాలకు చెందిన నిమ్మకాయ లేదా నారింజ పండు పై తొక్కల సన్నని తురుము ఇందుకోసం చాలా అవసరం. ఒక ఐస్‌ ట్రేలో నీళ్లు పోసి, అందులో ఈ తురుమును లేదా చిన్న నిమ్మ చెక్కలను వేసి ఫ్రీజ్‌ చేయాలి. దీనికి అయ్యే ఖర్చు దాదాపు సున్నా. కేవలం మనం వాడేసి పారేసే నిమ్మ తొక్కలతోనే వీటిని సిద్ధం చేసుకోవచ్చు.

ఫ్రూట్‌ ఐస్‌
పిల్లలకి ఇచ్చే జ్యూస్‌ల నుంచి పెద్దలు తాగే పానీయాల వరకు ఇది ఒక విజువల్‌ అండ్‌ టేస్టీ ట్రీట్‌. పుచ్చకాయ, దానిమ్మ , దాక్ష రసాన్ని తీసి, వడకట్టి నేరుగా ఐస్‌ ట్రేలలో పోయాలి. మరింత అందంగా కనిపించాలంటే రసంతో పాటు చిన్న పండ్ల ముక్కలను కూడా అందులో వేయవచ్చు. సాధారణంగా ఒక ట్రే ఐస్‌ కోసం రూ.20 నుంచి రూ. 50  వరకు ఖర్చు అవ్వచ్చు.

డిఫరెంట్‌ షేప్‌డ్‌ ఐస్‌
ఆకారమే ఇక్కడ ప్రధాన ఆకర్షణ. గుండ్రంగా, స్టార్‌ ఆకారంలో, హార్ట్‌ షేప్‌లో ఇలా ఎన్నో ప్రత్యేక ఆకారాల్లో ఐస్‌ తయారు చేస్తున్నారు. ఇవి గ్లాస్‌లో పడిన క్షణం నుంచే డ్రింక్‌ను ఒక స్టయిలిష్‌ ప్రెజెంటేష¯Œ గా మార్చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మార్కెట్‌లో లభించే సిలికా¯Œ  ట్రేలు లేదా మోల్డ్‌లు ఉపయోగిస్తారు. ఒకసారి కొనుగోలు చేస్తే చాలా రోజుల పాటు వాడుకోవచ్చు. సాధారణంగా ఈ ట్రేలు రూ. 100 నుంచి రూ. 300 వరకు ఉంటాయి.

ఎడిబుల్‌ గోల్డ్‌ – ఫ్లవర్‌ ఐస్‌
ఇది అల్టిమేట్‌ రాయల్‌ లుక్‌ ఇచ్చే పద్ధతి. లగ్జరీ ఈవెంట్లలో దీనికి భలే క్రేజ్‌ ఉంటుంది. విజువల్‌ ట్రీట్‌ కోసం ఈ ఐస్‌ క్యూబ్స్‌ మధ్యలో అందమైన పువ్వులు, బంగారు రేకులను ఉంచుతూ గ్లాసును ఒక చిన్న సర్ర్‌పైజ్‌ బాక్స్‌లా తయారు చేస్తారు. ఇది కాస్త ఖరీదైన వ్యవహారం. రూ. 500 నుంచి పదివేలు అంతకు మించి కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

రంగు రంగుల ఐస్‌
గ్లాస్‌లో రంగులు మెరిస్తే, మనసు కూడా ఫ్రెష్‌ అయిపోతుంది కదా! అందుకే ఇప్పుడు రంగురంగుల ఐస్‌ కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది ముఖ్యంగా పిల్లల పార్టీలు, బర్త్‌డే సెలబ్రేషన్లు లేదా సమ్మర్‌ డ్రింక్‌లకు స్పెషల్‌ అట్రాక్ష¯Œ గా ఉంటుంది. ఇందుకోసం నీటిలో సహజ రంగులు ఇచ్చే పండ్ల రసం లేదా ఫుడ్‌ కలర్‌ కొద్దిగా కలిపి ఐస్‌ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. ఖర్చు కూడా రూ. 10 నుంచి రూ. 30ల మధ్యలోనే సిద్ధం చేసుకోవచ్చు.

ఫ్లేవర్డ్‌ ఐస్‌
ఇది నిజంగా ఒక చిన్న సర్‌ప్రైజ్‌ లాంటిది. ఐస్‌ కరుగుతున్న కొద్ది కొత్త రుచి మెల్లగా డ్రింక్‌లో కలుస్తుంది. పుదీనా, తులసి, అల్లం, లేదా బెర్రీ పండ్లతో తయారు చేసే ఫ్లేవర్డ్‌ ఐస్‌ ఇప్పుడు చాలా పాపులర్‌. ఇందుకోసం మీకు నచ్చిన ఫ్లేవర్‌ పదార్థాలను చిన్నగా కట్‌ చేసి నీటిలో కలిపి ఐస్‌ ట్రేలో పోసి గడ్డకట్టించాలి. ఇది కేవలం చల్లదనం మాత్రమే కాదు, ఒక కొత్త రుచి ఇస్తుంది. దీని ఖర్చు రూ. 15 నుంచి రూ. 40 మధ్యలో ఉంటుంది.

చల్లని సత్యం! 
కరిగిపోయే లోపే కంటికి విందును, మనసుకి హాయిని ఇచ్చే ఈ క్రాఫ్ట్‌ ఐస్‌– అచ్చం మన జీవితం లాగే షార్ట్‌ అండ్‌ స్వీట్‌! అందుకే, మీరు కూడా ఈ ‘కూల్‌ ఫ్రెండ్‌’తో ఒక్క రెండు నిమిషాలు చిల్‌ అవ్వండి, రోజంతటి అలసటను ఇట్టే మర్చిపోండి!

-కొండి దీపిక  
 

Advertisement
 
Advertisement
Advertisement