మరోకథ: నరావతారం

Funday Kathalu Naravataram short story in Telugu written By Ippili Madhu - Sakshi

అప్పటివరకూ కళ్ళు కూడా మాటలాడతాయని నాకు తెలీదు. అందరి ముఖాలు మాస్కులతో కప్పేస్తే..  కేవలం కళ్ళ ద్వారా మాటలు, కళ్ళతోనే పరిచయాలు, కళ్ళతోనే పలకరింపులు, కళ్ళతోనే ప్రశ్నలు, జవాబులు.

కానీ మా పూర్ణమ్మ మాత్రం తన చీర కొంగునే మూతికి చుట్టుకొని రోజూ కూరగాయలు అమ్మేస్తుంది. అన్ని పది, ఇరవయ్‌ బేరాలే కాబట్టి ఒకవేలు చూపిస్తే 10, రెండు వేళ్లు చూపితే 20.. నాకు మాత్రం స్పెషల్‌ 10 రూపాయలకు 6 తోటకూర కట్టలు ..5 కట్టలు వ్యాపారం కోసం ఒక కట్ట మాత్రం సహకారం.

ఈ సహకారం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఒక రెండు నెలలు ముందుకు వెళ్ళాలి. అప్పుడే లాక్‌డౌన్‌ పెట్టిన రెండవ వారం అనుకుంటా.. ఎప్పటిలాగే మా ఆఫీస్‌ ఎదురుగా ఉన్న మా రాముడు గుడికి వెళ్ళాను. ‘అదేంటి గుడి కుడా లాక్‌డౌన్‌ కదా’ అని మీ డౌట్‌. చెప్పాగా ఆ గుడి ఎదురుగానే మా బ్యాంకు .. ఆ గుడిలో పని చేసే స్టాఫ్‌ అంతా ఆ దేవుడికి సేవ చేసి జీతం మాత్రం మా బ్యాంకులో తీసుకుంటారు. కాబట్టి అది మా కోవెలే.
‘మేనేజర్‌ గారు, మాస్క్‌ వేసుకొని ఈ పక్కనుంచి రండి .. అటు సీసీ కేమరా ఉంది. బయటి వారిని రానీయకూడదు’ అంటూ గౌరవంతో కూడిన ఒక చిట్కా చెప్పాడు గురవయ్య. గుడిలో అతను సన్నాయి మేళం ఉద్యోగి.
∙∙ 
నెమ్మదిగా కెమెరా కళ్ళకు దొరకకుండా రామచంద్రుని దర్శించుకున్నాను. ఆ రోజు అంతటికి నేనే భక్తుణ్ణి కదా ఆ దేవదేవుని కళ్ళు కూడా చాల ఆశ్చర్యంగా, ఆర్తితో చూసినట్లు అనిపించింది. గర్భగుడి నుంచి ఒక పక్కగా తిరిగి కెమెరా కన్నుగప్పి రావడం దాదాపు అసాధ్యం. కాబట్టి గుడి వెనుక భాగం నుంచి వద్దామని అటుగా వెళ్ళాను. గుడి చాలా ప్రశాంతంగా వుంది.. నేను, దేముడు అంతే!

ఇంతలో టక్‌.. టక్‌ అనే శబ్దం.. ఏమిటో అని చూశాను. అక్కడ ఏమి కనిపించ లేదు. మళ్లీ టక్‌.. టక్‌ అనే శబ్దం. అటుగా వెళ్ళాను. గర్భాలయానికి వెనుకగా ఒక చిన్న తోట. అందులో 10 తాబేళ్లు.. నీరసంగా నడవడానికి శక్తి లేక ఎదురు చూస్తున్నాయి. అయ్యో అదేమిటి అని దగ్గరగా నడిచాను. ఒక కాకి అరుస్తోంది.. మరొక కాకి ఒక చని పోయిన తాబేలు పైన కూర్చొని దాన్ని ఎలా తినాలో తెలియక దాని డిప్పను కొడుతోంది. అదే ఆ శబ్దం. నాకు చాల బాధ వేసింది. ఆ తాబేళ్లు రోజూ వచ్చే భక్తులు వేసే ప్రసాదాలు, ఆ గుడిలో అర్చకులు వేసే ఆకు కూరలతో బతికేవి. ఇప్పుడు కనీసం ఒక భక్తుడు కూడా లేడు.. ప్రసాదం లేదు.. ఆ కాకిని తోలి, గురవయ్యకు ఆ చనిపోయిన తాబేళ్లును తీసి శుభ్రం చేయమని చెప్పాను. నేను తిరిగి ఆఫీసుకు వచ్చాను కానీ నా మనసంతా ఆ తాబేళ్లు మీదే వుంది. పాపం.. ఆ దేవుని గుడిలో కాదు.. కాదు.. దేవుని ఒడిలో ఆకలికి చనిపోయిన తాబేలుని తలచుకుంటే గుండె తరుక్కుపోతుంది.
∙∙ 
మా అటెండరు ఆదిబాబుని పంపి ఊరిలో ఏమైనా తాబేళ్లు తినడానికి దొరుకుతాయేమో అని చూశాను. ‘కనీసం టీ దుకాణం కూడా లేదు సర్‌’  అంటూ తిరిగి వచ్చాడు. 
 ‘సరే.. నా క్యారేజి అంతా ఒక పేపర్‌లో వేసి వాటికి పెట్టు’ అన్నాను. వాటితో పాటుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టి మరీ వచ్చాడు మా ఆదిబాబు. ఎదో నా మనశ్శాంతికి గానీ అవి అన్నం, కూర, పెరుగు తింటాయో లేదో నాకు తెలీదు. నేను తినకుండా వాటికి పెట్టాను. అంతే అప్పటికి నా మనసు శాంతించింది.

ఇంటికెళ్ళానే గానీ ఒకటే ప్రశ్న.. గుడిలో రామావతారం.. గుడి వెనుక కూర్మావతారం.. రామావతారం ఒక జీవన విధానం.. అట్లాంటి  రాముని పూజించే నేను నరావతారం.. కాబట్టి ఆ కూర్మావతారాలను కాపాడాలి. బతుకు.. బతికించు.. అని చిన్నప్పుడు చదివిన ఒక ఇంగ్లిష్‌ కొటేషన్‌ గుర్తుకు తెచ్చుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.
నిద్రలో ఒక పెద్ద తాబేలు ఈ భూమిని మోస్తున్నట్లు నేను దానికి ఎదురుగా కూర్చొని దాని బరువుకు సరిపడా తోటకూర నా బ్యాంకు లాకర్‌లో నుంచి తీసి ఇచ్చినట్లు.. ఆ తాబేలు చాలా ఆనందంగా సంతకం పెట్టి బయటకు వచ్చినట్లు కల...
∙∙ 
అప్పటికే భళ్ళున తెల్లారింది. లేస్తూనే దేవుని మొహం చూసే అలవాటు ప్రకారం సెల్‌ ఆన్‌ చేశాను. సెల్‌లో శ్రీ రామచంద్రుని ఫోటో, రాముని పాదం దగ్గర తాబేలు కన్పించాయి. దెబ్బతో నిద్ర మత్తు వదలి ఆఫీస్‌కు రెడీ అయి బయలుదేరాను. దారిలో ఉదయం 6 నుంచి 9 వరకూ కూరగాయలకు, పాలకు, నిత్యావసర వస్తువుల కోసం లాక్‌ డౌన్‌లో రిలీఫ్‌ అంట. జనాలు భయంతో, భక్తితో, ప్రాణాల మీద ఆశతో పద్ధతిగా ఒక లైన్‌లో నిలబడి, బేరాలు ఏమీ ఆడకుండా, మొహం నిండా మాస్క్‌ కప్పుకొని మరీ కూరగాయలు కొంటున్నారు. నేను ఆదిబాబు ఒక సంచి నిండా ఆకుకూరలు అదే రాత్రి కలలో చెప్పిన సందేశం ప్రకారం తోటకూర కొన్నాము. వేగంగా ఆఫీస్‌కు వెళ్లి ఆదిబాబుకు తాళాలు ఇచ్చి నేను కోవెల వెనుక భాగానికి వెళ్ళాను.

మళ్లీ గురవయ్య కనిపించి ‘సర్‌ కరెంటు లేదు. ముందు వైపు నుంచి రండి. కెమెరా ఇప్పుడు పని చేయదుగా’ అన్నాడు నేను రాముని దర్శనానికి వస్తున్నా అనుకొని.  
‘లేదు గురవయ్యా..’ అంటూ నేను వచ్చిన పని చెప్పాను.

 తను వెంటనే నా చేతిలో సంచి అందుకొని తోటకూర అంతా ప్రతి తాబేలుకు అందే విధంగా సర్దాడు. నిన్న నా క్యారేజ్‌ భోజనం తిన్నాయేమో  కొద్దిగా నడుస్తున్నాయి. ఆకు పచ్చని ఆకులు చూడగానే వాటికీ ప్రాణం లేచి వచ్చినట్లుంది. నెమ్మది.. నెమ్మదిగా.. అవి తాబేళ్లు కదా గబగబా నడవవుగా! ఈ పరిస్థితిలో అసలు నడవలేవు. వచ్చి తోటకూర తినడం ప్రారంభించాయి. నాకు నిజంగా మనసుకు శాంతిగా ఉంది. ఈ హడావుడిలో ఉదయం నేను టిఫిన్‌ చేయక పోయినా నా కడుపు నిండి పోయింది.
∙∙ 
మరి దేవుణ్ణి దర్శించకుండా నేరుగా ఆఫీస్‌కు వచ్చేశా. ఇక నుంచి ప్రతి రోజూ 10 రూపాయల తోటకూర 10 తాబేళ్ల పలకరింపు నా దినచర్యగా మారిపోయింది. నేను సెలవు పెట్టిన రోజు ఈ పని ఆదిబాబు, ఆదిబాబు సెలవు పెడితే నేను.. ఒక్క వారం గడిచింది. అవి మామూలుగా అంటే నెమ్మది నెమ్మదిగానే కానీ ఆరోగ్యంగా నడవడం చూసి నాకు మరిన్ని కొత్త ఆలోచనలు వచ్చాయి. రోజూ తోటకూర అంటే వాటికీ బోర్‌ కదా అని వెరైటీగా ఒకరోజు గోంగూర, మరొకరోజు  బచ్చలికూర, చుక్కకూర ఇలా పెట్టటం మొదలు పెట్టా. అంతే అవి ఇంకా ఉత్సాహంగా నన్ను మా ఆది బాబుని చూసి గుర్తు పట్టి ముందుకు రావడం, వాటికీ ఆకులు వేసి నీరు పెట్టగానే అవి మా వైపు చూసే ఒక లాంటి ఆత్మీయమైన చూపు ఇప్పటి వరకు ఏ సినిమా డైరెక్టర్‌ చూపించని ఫ్రేమ్‌.

అదుగో అలా మేము రోజూ కొనే ఆకుకూరల కొట్టు ఓనరే పూర్ణమ్మ. మొదట్లో ‘బాబూ.. రోజూ ఆకు కూరలేనా.. ఈ బెండకాయ, ఆనపకాయ కుడా కొనండి బాబూ’ అనేది. మేము నవ్వే వాళ్ళం. ఒకరోజు ఆవిడ ఆకు కూరలుపెట్టలేదు. 
అయ్యో అనుకొని మేము మరొక దగ్గరికి పోతుంటే పూర్ణమ్మ ఆపి..‘బాబూ మీరు రోజూ కొంటారు. ఈ రోజు అక్కడికి పోతే రేపు నా కాడికి రారు. ఆగండి నేనే తెస్తాను’ అంటూ మళ్ళి తన దగ్గరున్న మిగిలిన కూరగాయలు కొనమంది. మా ఆదిబాబు ఇక ఆగలేక మొత్తం కథ చెప్పాడు. 
అంతే ఆవిడ చాల నొచ్చుకొని ‘ఎంత మాట బాబూ.. ఆగండి నేనే తెస్తాను’ అని 10 రూపాయలు తీసుకొని 6 కట్టలు తెచ్చిచ్చింది. 
‘అదేంటి 5 కట్టలే కదా?’ అని అడిగితే ‘అది నా వాటా బాబూ’ అంది. సాయానికి ఎవరైతే ఏమిటి.. రాముడికి ఉడత చేయలేదా..!
∙∙ 
అంతే.. ఇక ప్రతిరోజూ నేను, మా ఆది బాబు..  పూర్ణమ్మ కొట్టు దగ్గర ఆగడం.. ఆవిడ ఒక సంచి నిండా ఆకు కూరలు నింపడం .. కానీ 10 రూపాయలు మాత్రమే తీసుకోవడం నాకు భలే అనిపించింది. మా అపార్ట్‌మెంట్‌లో ‘పాపం రోడ్డున వస్తున్న వలస కూలీలకు ఒక రోజు భోజనం చేసి పెడదాం’ అని చెబితే సగం మంది డబ్బులు ఇవ్వలేదు. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. వారివి త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌లు. కానీ మనసులు మాత్రం ఇరుకు.

‘ఇంకెన్నాళ్లో ఈ లాక్‌డౌన్‌..’ అని అందరూ అనుకుంటున్నారు. అందరికి ఇళ్ళల్లో కూర్చొని తినడానికి బోర్‌ కొట్టింది. కానీ నాకు మాత్రం ఎన్ని రోజులైనా పర్లేదు.. మా కూర్మావతారాలకు నేను ఉన్నాను, నాకు హనుమంతుడిలా మా ఆదిబాబు, ఉడతలా పూర్ణమ్మ ఉన్నారు. 

ఇంతలో ఒకరోజు రాత్రి ఫోన్‌.. మా అత్తా, మామలకు ఒంట్లో బాగోలేదు అర్జెంట్‌గా రమ్మనమని. ఆఫీస్‌కు లీవ్‌లెటర్‌ రాసి పెట్టి, తాళాలు ఇస్తూ ఆదిబాబుకు అంతా చెప్పాను. మా కూర్మావతారాల గురించి కూడా. ఆ రాత్రే ఏలూరు బయలుదేరాం. బస్సులు, రైళ్ళు లేవుగా! నా కారు మీదే. తీరా వెళ్ళాక తెలిసింది అక్కడ అందరూ ఏదో అంతుపట్టని ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారని. 

 హాస్పిటల్‌ అంతా ఒక తెలియని వింత వాతావరణం. ఎప్పుడు ఎవరికి ఏమి అవుతుందో తెలియదు.. వ్యాధి పేరు తెలిస్తే ప్రపంచంలో ఎక్కడ మందు ఉన్నా తెప్పిద్దాం అనే ఆలోచనలో వుంది ప్రభుత్వం.
 నాకు మా ఆవిడను చూస్తే చాలా భయం వేసింది. అప్పటికే ఆవిడ ఇంకా షాక్‌లోనే వుంది. చివరకు మా అత్తమామలు ఉన్న వార్డుకు చేరుకున్నాం. అక్కడ బెడ్స్‌ పైన రోగులు ఉండుండీ పడిపోయి కొట్టుకుంటున్నారు. అలాగని ఫిట్స్‌ కాదు!
∙∙ 
ప్రభుత్వ అధికారులు అన్ని విధాలా తమవంతు ప్రయత్నాలు  చేస్తున్నారు. పేషెంట్స్‌  నుంచి అన్ని వివరాలూ సేకరిస్తున్నారు. పరీక్షలకు పంపుతున్నారు. కానీ ఫలితం శూన్యం. మరో కొత్త వైరసేమో అని ఇంకా భయంగా ఉంది. 

ఈలోపు పుణె నుంచి వచ్చిన రిపోర్ట్‌ ప్రకారం అది వైరస్‌ కాదు అని తెలిసింది. మరి ఏమిటి అని మరింతగా పరిశీలన చేస్తున్నారు. రోగుల ఇళ్లు, పరిసరాలు, వారు వాడే నీరు, పిల్చే గాలి, తినే ఆహారం.. ఇలా అన్నీ..  అన్నీ పరీక్షిస్తున్నారు. ప్రతిపక్షాలు, మీడియా రోజుకో కథనం ప్రసారం చేస్తున్నాయి. నాకు అక్కడ ఉండాలంటేనే భయం వేసింది. నీళ్ళు తాగాలన్నా భయమే.. బయటి హోటల్‌లో తినాలన్నా భయమే.. ఆరోగ్యశాఖ మంత్రి ప్రభుత్వపరంగా మరో రెండు రోజుల్లో ఈ వింత వ్యాధికి కారణం చెబుతాం అని ఇప్పుడే టీవీలో చెబుతున్నారు. మా మామగారి పరిస్థితి విషమించింది. కారణం తెలీదు. మా మామగారిని మరింత మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్‌కి మార్చారు. 

ఒక రోజు గడిచింది. ఒక భయంకరమైన వార్త నా చెవిన పడింది. ఆ ఊరి వాళ్ళు వాడే కూరగాయలు, ఆకుకూరల మీద వాడే పురుగు మందుల వలన ఈ వింత వ్యాధి వచ్చిందని కలెక్టర్‌గారు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి చెబుతున్నారు. ఎదురుగా 96 ఏళ్ల మా మామగారు మృత్యువుతో పోట్లాడుతున్నారు. అంతే చప్పున నాకు మా కూర్మావతారాలు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఫోన్‌ అందుకొని మా ఆదిబాబుకి ఫోన్‌ చేశా. 

‘సర్‌.. ఇప్పుడే కొత్తిమీర కొని వేసి వస్తున్నాను. అవి బాగానే వున్నాయి’ అని అతను చెప్పేలోపే ‘వద్దు .. వద్దు తీసేయ్‌.. తీసేయ్‌’ అంటూ గట్టిగా చెప్పాను లేదు అరిచాను.
 ఈ భూమి మీద అత్యంత ఎక్కువ కాలం సహజంగా బతకగలిగే జీవిని చంపడం నాకు ఇష్టం లేదు. నాకు అర్థం కాలేదు.. నేను నిజంగా  నరావతారమా? లేక రాక్షస అవతారమా? ఛా.. అసలు ఎం జరుగుతోంది? అని ఆలోచించేలోపు ఆఫీస్‌ నుంచి ఫోన్‌ .. ‘ఆడిట్‌ ఉంది. రేపు తప్పకుండా ఆఫీసుకు రావాల’ని.
∙∙ 
 ఆఫీస్‌కు వెళ్తూ ఒట్టి చేతులతో వెళ్ళడానికి నాకు మనసు అంగీకరించలేదు. పూర్ణమ్మ కొట్టు దగ్గర ఆగాను. నన్ను చూసిన వెంటనే పూర్ణమ్మ ఆత్రంగా ఆకుకూరలు సంచిలో సర్దడానికి రెడీ అవుతోంది.
‘అమ్మా ఈ కూరగాయలు మంచివేనా?’ అని అడిగాను. ఆమెను అనుమానించాలని నా ఉద్దేశం కాదు. కానీ ఎందుకో అలా అనుకోకుండా ఆ ప్రశ్న నా నోటివెంట రాగానే  వెంటనే పూర్ణమ్మ ‘బాబూ ... మా తాత, మా నాన్న నుంచి మాకు ఇదే యాపారం. నలుగురికి కడుపునింపే అదృష్టం అందరికి రాదు బాబూ.. ఇక మంచి చెడు అంటావా .. మా తాత, మా నాన్న పురుగు మందులు, యూరియా ఏస్తే పురుగులే కాదు మడుసులు సస్తారని నాటు మందులు ఏసి పండించిన పంట బాబు ఇది. ‘‘రైతు అంటే అందరికి అన్నం పెట్టాలిరా.. అంతే గానీ ఎవడి ఇంటి ఇల్లాలి కంట కన్నీరు పెట్టించ కూడదురా’’ అనే వాడు మా తాత. అంత వరకూ ఎందుకు బాబూ.. ప్రతివారం ఇగో ఈ సంఘం వోల్లు వచ్చి మా తోట, పంటా చూసుకొని అన్ని కూరగాయలు, ఆకు కూరలు వొట్టుకెలతారు’ అంటూ ఒక కార్డు ఇచ్చింది.

అప్పుడు నాకు అర్థమయింది.. పూర్ణమ్మకు సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలీదేమో గానీ ధర్మంగా అన్న పెట్టడం మాత్రం తెలుసు. ఆమెకు మనసులోనే క్షమాపణలు చెప్పుకొని ఆకుకూరల కోసం మనః శాంతిగా సంచి ఇచ్చాను.
నా ఈ లాక్‌డౌన్‌ రామాయణంలో పూర్ణమ్మ ఉడుత కాదు.. కాశీ అన్నపూర్ణమ్మ..                                      
- ఇప్పిలి మధు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top