ఒక్కసారిగా ఆ ప్రాంతం పోలీస్ సైరన్లతో నిండిపోయింది.కరుడుగట్టిన నేరస్థుడు, రెండు రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చిన రాకీ సెవెన్‌హిల్స్ బస్టాప్ దగ్గర హత్యకు గురయ్యాడు. అతడి గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది కూడా అదే! ఇన్‌స్పెక్టర్ అభిమన్యు దర్యాప్తులో ముందుగా రాకీ క్రిమినల్ హిస్టరీ చూశాడు. అతను చేయని నేరం లేదు, పాల్పడని ఘోరం లేదు. గంజాయి అమ్మకం నుంచి ఆడపిల్లల్ని వేధించడం వరకు అతని మీద చాలా కేసులు ఉన్నాయి.రాకీ చనిపోవడానికి మూడు గంటల ముందు ఒక అమ్మాయిని వెంటపడి ఏడిపించాడు.
ఆమె చెప్పు తీసి అతడిని బెదిరించింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రాత్రి తొమ్మిది గంటలకు ఈ గొడవ జరిగింది. అప్పుడే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ రావడం చూసి, రాకీ అక్కడి నుంచి తప్పుకున్నాడు.ఇది జరిగిన మూడు గంటల తర్వాత పోలీస్ స్టేషన్‌కు ఫోన్ వచ్చింది. సెవన్‌హిల్స్ బస్టాప్ దగ్గర రాకీ శవం పడి ఉందని ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్‌లో చెప్పాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.ఇన్‌స్పెక్టర్ అభిమన్యు అక్కడ గుమిగూడిన జనాన్ని జరిగిన హత్య గురించి అడిగాడు. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు.
ఒక వ్యక్తి మాత్రం ముందుకు వచ్చాడు. రాకీని రాజీవి అనే అమ్మాయి బెదిరించిందని, తాను అప్పుడు అక్కడే ఉన్నానని చెప్పాడు. ఆ సంఘటనను తన ఫోన్‌లో చిత్రించినట్టు చెప్పి, తన ఫోన్ ఇచ్చాడు. అందులో రాజీవి అనే అమ్మాయి ‘నిన్ను చంపేస్తాను’ అని రాకీని బెదిరించడం స్పష్టంగా ఉంది. మరో గంటలో రాజీవి ఇంటి ముందున్నాడు అభిమన్యు. తాను కోపంతో అతడిని చంపేస్తానని బెదిరించిన మాట నిజమే అని, ఆ తర్వాత భయంతో ఇంటికి వచ్చేశానని రాజీవి చెప్పింది.ఒక మామూలు అమ్మాయి ఒక్కతే అంత దృఢంగా ఉండే రాకీని చంపగలదా?రాకీ ఒంటిపై ఉన్న గాయాలు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేసినట్లుగా ఉన్నాయి.అభిమన్యు రాకీ ఫోన్ రికార్డులను పరిశీలించాడు. చనిపోవడానికి ముందు రాకీకి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించాడు.
‘‘నీ పేరేంటి?’’ అడిగాడు అభిమన్యు అతడిని.రాకీని రాజీవి బెదిరించిన వీడియో తీసింది అతనే!‘‘రాజు...’’ తడబడుతూ చెప్పాడు అతడు.‘‘నీ అసలు పేరు చెప్పు వేలాయుధం’’ అన్నాడు అభిమన్యు. ఉలిక్కిపడిన ఆ వ్యక్తి కంగారుగా లేవబోయాడు.‘‘ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నువ్వూ రాకీ తోడు దొంగలు. చెన్నైలో మీ పరిచయం. అతడు ఇక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. నువ్వు తప్పించుకున్నావు. మీ ఇద్దరి మధ్య డబ్బు గొడవలు ఉన్నాయి. బెయిల్ మీద విడుదలైన రాకీని చంపాలని నీ ప్లాన్. రాజీవితో రాకీకి జరిగిన గొడవ నీకు కలిసొచ్చింది. రాజీవిని దోషిగా నిలబెట్టి నువ్వు ఎస్కేప్ అవ్వాలనుకున్నావు. ఆ ప్రయత్నంలో నీ రెండో సిమ్‌తో పోలీసులకు ఫోన్ చేశావు. మొదటి సిమ్‌తో వీడియో తీశావు.
రాకీకి ఫోన్ చేసి సెవెన్ హిల్స్ బస్టాప్ వెనుక వైపు రమ్మన్నావు. అక్కడ సీసీ కెమెరాలు లేవన్నది నిజమే. కానీ కాస్త దూరంలో నిర్మాణంలో వున్న ఒక భవన యజమాని సీసీ కెమెరాలు పెట్టించాడు. ఆ సీసీ కెమెరాల్లో నిర్మాణంలో వున్న భవనంలోకి నువ్వెళ్ళడం రికార్డు అయ్యింది. నీ క్రిమినల్ రికార్డు బయట పడింది. నువ్వు ఇందాక ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్, రాకీ ఒంటి మీద వున్న గుర్తులతో మ్యాచ్ అయ్యాయి. శిక్షకు సిద్ధంగా వుండు...’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు.వేలాయుధాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ సర్! నన్ను సేవ్ చేశారు...’’ రాజీవి కృతజ్ఞతగా అంది.‘‘నేను న్యాయం చేశాను. నీ ధైర్యమే కరెక్ట్. కానీ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈ ఇబ్బంది ఉండేది కాదు’’ అంటూ ముందుకు కదిలాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు.
- శ్రీసుధామయి


