
గెలుపుతో పాటే ఒత్తిడి
విమర్శలూ మొదలవుతాయి
ప్రతిస్పందన పెద్ద సవాల్
తల్లిదండ్రులే కనురెప్పలు
చిన్న గెలుపు కూడా పెద్ద సంతోషాన్నిస్తుంది. అదే పెద్ద గెలుపైతే! అదికూడా – ప్రపంచాన్నే జయించినంత గొప్ప గెలుపైతే! లోకం మొత్తం ఏకమై జయజయధ్వానాలు చేస్తుంది. పూల వర్షం కురిపిస్తుంది. విజేతను కీర్తి సింహాసనంపై కూర్చోబెడుతుంది. చిన్న వయసులోనే జగదేక వీరులైన వారినైతే ముద్దు చేస్తుంది. మురిపాలు కురిపిస్తుంది. వరాలు, వరహాలు కుమ్మరిస్తుంది. విశ్వనాథన్ ఆనంద్, సచిన్ టెండూల్కర్, సానియా మీర్జా, పీవీ సింధు (PV Sindhu).. ఇలా ఒక్క స్పోర్ట్స్‌లోనే కాదు, ప్రపంచ పోటీలు జరిగే ప్రతి రంగంలోనూ దివి నుంచి భువికి దిగినట్లుగా విజేతలపై ఒక్కసారిగా మహోజ్వలమైన వెలుగు ప్రసరిస్తుంది. మరి అంతటి వెలుగును తట్టుకోవటం అందరికీ చేతనవుతుందా? చిన్న వయసులోనే స్టార్‌డమ్ సంపాదించినవారికి అసలే సాధ్యమవుతుందా?
భారతదేశ చదరంగ వినీలాకాశంలో సరికొత్త ధ్రువతార 19 ఏళ్ల దివ్యా దేశ్‌ముఖ్ (Divya Deshmukh) ప్రస్తుతం ఒక అపరిచిత ప్రత్యర్థితో రేయింబవళ్లూ తలపడుతూ ఉంది! ఆ ప్రత్యర్థి పేరు ‘గెలుపు!’ జార్జియాలోని బాటుమిలో జరిగిన ఫిడె మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన దివ్య, ఆ గెలుపును తట్టుకుని నిలబడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంది. ఆలోచించి మరీ ‘ఆనందాల పావులను’ కదుపుతోంది. వినేందుకు ఇది విచిత్రంగా ఉండొచ్చు. కానీ, ఓటమిని తట్టుకోవటం ఎంత కష్టమో, గెలుపును తడబడకుండా పట్టుకుని నిలబడటమూ అంతే కష్టం.
ఉక్కిరి బిక్కిరి
ఫిడే ప్రపంచ కప్పును, గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను సాధించిన తర్వాత నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చిన ఈ టీనేజర్‌కు భారీ స్వాగతం లభించింది. ‘జన ఘన సందోహం’ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిజానికి, బాటుమిలో ‘ట్రోఫీ’ చేతికి అందిన క్షణం నుంచే గెలుపుతో దివ్యా దేశ్‌ముఖ్ ‘సమస్యలు’ మొదలయ్యాయి! తొలి సమస్య... ఇన్‌స్టాగ్రామ్‌లో తన ట్రోఫీతో ఎలా ఫోజు ఇవ్వాలి అన్నదే!
ఇంటర్వ్యూలు
అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ (Lionel Messi) వరల్డ్ కప్ ట్రోఫీని హత్తుకుని పడుకున్న ఫొటోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 కోట్ల లైక్‌లు రావటం దివ్యకు గుర్తుంది. ‘నేను కూడా అలాగే చేయాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ, అలసటతో నిద్రపట్టేసింది’ అని దివ్య ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, నవ్వేసింది. గెలుపు అలసటను మాత్రమే కాదు, ఇంటర్వ్యూలను కూడా తీసుకొస్తుంది. టీనేజ్ జగజ్జేతలకు ఈ సంతోషాన్ని తట్టుకోవటం కాస్త కష్టమైన వ్యవహారమే.
ప్రముఖుల సందేశాలు
‘విజేత’ అనే టైటిల్ దివ్యకు మరో పరీక్ష పెట్టింది! ఆమె విజయంలో పాలు పంచుకోవాలని యావద్దేశం ఉవ్విళ్లూరింది. ‘మనమ్మాయి’ అని ఉప్పొంగింది. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఆమెకు వీడియో కాల్ చేశారు. అంతటి మహామహులు తనకు ఫోన్ చేసి, స్క్రీన్‌పై తన కళ్ల ముందు ప్రత్యక్షమై అభినందనలు తెలుపుతుంటే ఏడు గుర్రాలపై విజయ విహారం చేయటమే. అక్కడితో అయిపోలేదు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి దేశ రాజధానికి దివ్యను ఆహ్వానించారు. ఇక ఆమె ఫోన్‌కు వస్తున్న సందేశాలకైతే లెక్కేలేదు. ఆ వరదలో దివ్య మునకలేస్తోంది. అంతమందికి ఒక్కొక్కరిగా కృతజ్ఞతలు ఎప్పటికి చెప్పగలను అని సతమతం అవుతోంది. అంతేనా, నాగపూర్‌లో మహా పట్టాభిషేకం, వరుసగా సన్మానాలు, ఇంటికి వచ్చి వెళుతున్న శ్రేయోభిలాషులు!
చిన్నారులకు ఆదర్శం
టైటిల్ గెలుచుకుని నాగ్‌పూర్‌లో అడుగుపెట్టినప్పుడు, అంతమంది జనాన్ని, ముఖ్యంగా పిల్లలను చూడటంతో దివ్య తబ్బిబ్బయింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఆమెను సత్కరించే కార్యక్రమంలో కనీసం 50 శాతం మంది పిల్లలే ఉన్నారు. ఆ చిన్నారుల్లో ఒక చిన్నారిగా దివ్య కలిసిపోయింది. అక్కడి కేరింతలకు ఆమెకు కన్నీళ్లొచ్చినంత పనైంది. అయినా హుందాగానే ఆ పరిస్థితిని ఎదుర్కొంది.
విజయాన్ని తట్టుకోవటానికి 5 మెట్లు!
1. ఒక్కసారిగా వచ్చిన కీర్తి దిక్కుతోచని స్థితిలో పడేస్తుంది. చిన్నపిల్లలు, టీనేజర్‌లకైతే అంతా అయోమయంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మొదటి అడుగుగా మౌనం, చిరునవ్వే వారిని గట్టెక్కిస్తాయి.
2. విజయోత్సాహం దినచర్యలను క్రమరహితం చేసే అవకాశం ఉంది. అలా జరక్కుండా ఎప్పటిలా ఆహారం, వ్యాయామం, నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి.
3. ప్రతి ప్రశంసకూ, మీడియా సంధించే ప్రశ్నలకు స్పందించే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులే తమ చిన్నారి విజేతకు సహాయంగా ఉండి, వారి ఒత్తిడిని తగ్గించేలా చూడాలి.
4. విజేతలు కొన్నిసార్లు తమ వస్త్రధారణ, శరీరాకృతి విషయమై సోషల్ మీడియాలో విమర్శలకు గురికావచ్చు. వాటిని తేలిగ్గా తీసుకోవాలి. మాటకు మాట చేటు తెస్తుంది.
5. గెలుపు గుర్తింపునే కాదు, గుర్తించలేని శత్రువులను కూడా వెంట తీసుకొస్తుంది. కొందరు మాట్లాడటం మానేస్తారు. కొందరు చాటుగా ఏదో అంటున్నారని తెలుస్తుంది. వాళ్ల నుంచి చిన్నారి విజేతల్ని వారి కోచ్‌లు, పేరెంట్స్ కాపు కాచుకోవాలి.
అంత సులభం కాదు
ఆట అనే కాదు.. ఒక పాటల కార్యక్రమం, డ్యాన్స్ ప్రోగ్రామ్.. ఇలా రాష్ట్ర లేదా జాతీయ స్థాయి కార్యక్రమంలో విజేతలుగా రాణిస్తున్న చిన్నారులు మన కళ్ల ముందే ఎంతోమంది ఉన్నారు. ఆ చిన్న మనసులకు ఆ గెలుపు ఎంతో కిక్కునిస్తుంది. ఆ తరువాత వచ్చే ప్రశంసలు, జరిగే సన్మానాలు వారిని మునగచెట్టు ఎక్కిస్తాయి. అక్కడే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. చిన్నపిల్లలు వాళ్లకేం తెలుసు, అంత ఎత్తునుంచి జారిపడే ప్రమాదం ఉందని, పడితే నడుం విరుగుతుందని!
చదవండి: రెప్పల లోపల ఇసుకను భరించని కళ్లు లేవు
గెలుపు రుచి చూసిన తమ పిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఆ మత్తు వారి తలకెక్కకుండా.. చదువు పక్కదారి పట్టకుండా.. స్నేహితులను దూరం చేసుకోకుండా చూసుకోవాలి. నిజానికి దివ్య వ్యవహరించిన శైలి ఎంతోమందికి ఆదర్శం. సచిన్, విశ్వనాథన్ ఆనంద్ లాంటి మహామహులు.. దివ్య ఇప్పుడున్న దశను దాటిన తరువాత వ్యవహరించిన తీరు దివ్యకు ఆదర్శం కావాలి.
- సాక్షి, స్పెషల్ డెస్క్