లోన్‌ కావాలంటే 2 నిమిషాలే.. క్లిక్‌ చేశారో ఇక అంతే?!

Cyber Crime Activities From Play Store Which App Is Secure Or Not - Sakshi

సైబర్‌ క్రైమ్‌

సాధారణంగా ప్లేస్టోర్, యాప్‌ స్టోర్‌ల నుంచి మనకు అవసరమైన యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటాం. ఇవే కాకుండా కొన్ని ఆకర్షణీయమైన ప్రకటనలతో వచ్చే సోషల్‌మీడియా యాప్స్‌ కూడా ఇన్‌స్టాల్‌ చేసుకుంటుంటారు కొందరు. ‘యాప్‌’ ప్రపంచం అయిన ఈ రోజుల్లో.. వీటి ద్వారా మన భద్రత ఎంత? మన సమాచారాన్ని ఆ సదరు యాప్‌కు ఇవ్వడం వల్ల మనకు కలిగే లాభ నష్టాలు ఏంటి? ఏ యాప్‌ సురక్షితం, ఏ యాప్‌ సందేహం.. దీనిని కనుక్కునేదెలా?! 
∙∙ 
అందమైన కంచిపట్టు చీర ఆఫర్‌ లో రూ.50కే. కుందన్‌ ఆభరణాల సెట్‌ రూ.100కే..ఇంటి వద్దే ఉండి నెలకు రూ.30,000 లు సంపాదించండి. లోన్‌ కావాలంటే 2 నిమిషాలే.. అంటూ సోషల్‌ మీడియాలో కొన్ని ప్రకటనలు వస్తుంటాయి. ఇలాంటివే కాదు మల్టీ లెవల్‌ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ, డేటింగ్, పోర్నోగ్రఫీకి సంబంధించిన యాప్స్‌.. ఫొటోలు, పదాలతో మనల్ని ఆకర్షించేలా చేస్తాయి. వాటి కింద ‘బ్లూ’ కలర్‌ అక్షరాలతో ఓ లింక్‌ కూడా ఉంటుంది.

‘ఆశ’ లేదా ‘ఆసక్తి’తో ఆ లింక్‌లను ఓపెన్‌ చేశామా..  ఫోన్‌ నెంబర్‌తో సహా మన వివరాలన్నీ ఆ సదరు ‘యాప్‌’రు చేతిలోకి వెళ్లిపోతాయి. అక్కణ్ణుంచి ఏదో ఒక సమయంలో మనల్ని మోసం చేయడానికి రకరకాల వలలు పన్నుతారు. మానసిక వేధింపులకు కూడా గురిచేయవచ్చు. అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు. మన వ్యక్తిగత వివరాలపై నిఘా పెట్టవచ్చు.. అందుకే, అలాంటి లింక్‌లను ఓపెన్‌ చేసే ముందు ‘ఏ యాప్‌ సేఫ్, ఏది బెస్ట్‌?’ అని ఆలోచించడం అన్నివిధాలా శ్రేయస్కరం.

చెడు ఉద్దేశంతో చేసే యాప్‌ పనులు...
►ఆండ్రాయిడ్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేశాక అది మోసపూరితమైనదైతే మనకు తెలియకుండానే అకౌంట్‌లో ఉన్న డబ్బు దొంగిలించవచ్చు. వ్యక్తిగత వివరాలను దొంగిలించవచ్చు. 
►పైన స్కానర్‌లా కనిపించినా మన ఆథరైజ్డ్‌ యాప్స్‌ యాక్టివిటీ దొంగచాటుగా చేస్తుండవచ్చు. 
►నకిలీ అప్లికేషన్‌ ద్వారా మన డేటా దొంగిలించడమే ఉద్దేశంగా ఉండచ్చు. మన డేటా నుంచి దొంగ యాప్స్‌ ద్వారా యాక్టివేట్‌ చేస్తుండవచ్చు.
►కొన్నిసార్లు మన పాస్‌ వర్డ్స్‌ కూడా మార్చలేనంతగా మన ఫోన్‌తో మనని వారి అధీనంలోకి తీసుకోవచ్చు. 

‘యాప్‌’ ఎంపిక ఇలా...
►పాపులర్‌ ‘యాప్‌’కి మిలియన్ల వ్యూస్, డౌన్‌లోడ్స్‌ ఉంటాయి. 
►ఆ యాప్‌ డౌన్స్‌లోడ్స్‌ సంఖ్య ఎంత ఉందో చూడాలి. 
►యూజర్స్‌ రివ్యూస్‌ చదవాలి. అవి తప్పులు లేకుండా ఉన్నాయా అనేది చెక్‌ చేయాలి. అలాగే, యాప్‌ ‘లోగో’ సరిచూడాలి.
►యాప్‌ పబ్లిష్డ్‌ తేదీ చూడాలి. 
►లేటెస్ట్‌దైతే వెంటనే డౌన్‌లోడ్‌ చేయద్దు. 
►ఊహించని ఆఫర్లతో.. ఈ రోజు కాకపోతే మళ్లీ అవకాశం రాదు.. వంటి ప్రకటనలు ఇచ్చే యాప్‌లన్నీ మోసపూరితమైనవే అని గ్రహించాలి. 
►కొన్ని యాప్‌లు తమకు అవసరం లేని వివరాలన్నీ అడుగుతుంటాయి. అలాంటి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయద్దు. 
►యాప్‌ స్టోర్, ప్లే స్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది. దాదాపు 90 శాతం మోసాలన్నీ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ నుంచి జరుగుతాయి. ప్లే స్టోర్‌ యాప్స్‌ నుంచి 10 శాతం మోసాలు జరిగే అవకాశాలున్నాయి. యాప్స్‌ విషయంలో ప్లే స్టోర్‌ పూర్తి బాధ్యత వహించడం లేదు. అందుకని, రిజిస్టర్‌ చేసిన యాప్‌లనే ప్లే స్టోర్‌ మన ముందుంచినప్పటికీ అన్నీ సరైనవి అనలేం. అదెలాగంటే పుస్తకం మీద ఐ ఆ  ముద్ర ఉన్నంత మాత్రాన ఆ బుక్‌ మంచిది అని చెప్పలేం. అందుకని జాగ్రత్త అవసరం. 
    
మరీ ముఖ్యం...
APK (Android), DMZ (IOS)ఫైల్స్‌ని ఎప్పుడూ డౌన్‌లోడ్‌ చేయద్దు. ఫోన్‌లో ఈ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయద్దు. యాప్‌ స్టోర్, ప్లే స్టోర్, చట్టబద్ధమైన సైట్‌ల నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top