Christmas Day 2022: మెర్రీ క్రిస్మస్‌: ‘నీ రాజ్యం వచ్చును గాక...’ | Sakshi
Sakshi News home page

Christmas Day 2022: మెర్రీ క్రిస్మస్‌: ‘నీ రాజ్యం వచ్చును గాక...’

Published Sun, Dec 25 2022 12:46 AM

Christmas Day 2022: Bethlehem birthplace of Jesus Christ - Sakshi

ఆకురాలే కాలం తర్వాత చెట్లు చిగిర్చే వసంతం – ‘క్రిస్మస్‌ సీజన్‌’కు మనోహరమైన దృశ్య నేపథ్యం కావడంతో, విశ్వాసాలకు అతీతమైన భావన మన లోపలికి చేరి,’ఫీల్‌ గుడ్‌’ మానసిక స్థితికి మనల్ని చేరుస్తుంది. ఒంటరిగా ఏ చలిరాత్రిలోనో రెండు చేతులు జేబుల్లో ముడుచుకుని నడుస్తూ వెళుతుంటామా, చీకటి తెరలు చీల్చుకుంటూ ఎవరిదో బాల్కనీలో వెలుగుతూ వేలాడుతున్న ‘క్రిస్మస్‌ స్టార్‌’ కనిపిస్తుంది. అటు చూస్తూ దాన్ని మనం దాటతాం. అయితే అదక్కడ ఆగదు, దాన్ని దాటాక కూడా అది మన వెంట వస్తూ మన లోపలికి చేరి, కొంతసేపు అది అక్కడ తిష్టవేస్తుంది. ఎందుకలా? అది ‘ఫీల్‌ గుడ్‌’ సీజన్‌ కావడం వల్లా? అంతే కావచ్చు...

ఐరోపాలో మొదలైన ఈ ‘సీజన్‌’ భావన ‘క్రిస్మస్‌’ను ప్రపంచ పండగ చేసింది. కానీ ఆసియాలోని బేత్లెహేములో అప్పట్లో జీసస్‌ పుట్టిన స్థలం ఏమంత పరిశుభ్రమైనదేమీ కాదు. అయినా ఆ జననం నేరుగా రాజమందిరంలో ప్రకంపనలు పుట్టించింది. చివరికి జనాభా నమోదు కోసం స్వగ్రామం నజరేతు నుంచి వచ్చిన దంపతులు తమతోపాటు ‘రాజ్యం’ జాబితాలో వారి మగ శిశువుకు కూడా ఒక ‘నంబర్‌’ వేయించుకుని, స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. అలా చరిత్రలో క్రీస్తును రెండు శకాల మధ్య ప్రతిష్టించడం మొదలయింది. అందుకే ప్రపంచ చరిత్రలో జీసస్‌ ‘ఫిక్షన్‌’ కాలేదు.

యువకుడైన జీసస్‌ను ప్రార్ధన చేయడం ఎలా? అని శిష్యులు అడుగుతారు. అయన చెబుతాడు– ‘పరలోకమందున్న మా తండ్రీ! నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక...’ అంటూ సాగుతుంది ఆయన చెప్పింది. మరొక రాజ్యమేదో మున్ముందు రావలసి ఉన్నది అనేది అక్కడి సారాంశం. ఆయన దృక్పథం‘రాజ్యం’ ప్రాతిపదికగా ఉంది. మరొకసారి ‘బోధకుడా జార్‌ చక్రవర్తికి పన్ను చెల్లించాలా?’ అని కొందరు అడుగుతారు.

జీసస్‌ వాళ్ళ  చేతిలోని నాణెం తీసుకుని– ‘దీనిమీద వున్న ఈ బొమ్మ ఎవరిది?’ అని అడుగుతాడు. ‘అది జార్‌ చక్రవర్తిది’ అని వాళ్ళు బదులిస్తారు. ‘అయితే, రాజుది రాజుకు, దేవునిది దేవుడికి ఇవ్వండి’ అంటాడు. ఒకపక్క తండ్రి ‘రాజ్యం’ రావాలి అంటూ ప్రార్థన నేర్పుతూనే, మరోపక్క మనకు పౌరసత్వమున్న ‘రాజ్యాన్ని’ మనం అంగీకరించాలి అంటాడు. అయితే, చరిత్రలో ఈ భావధార ఎక్కడా ఆగినట్టుగా కనిపించదు. దీనికి కొనసాగింపు అన్నట్టుగా మరొక యూదు తత్వవేత్త కార్ల్‌ మార్క్స్‌ ‘రాజ్యం అంతరిస్తుంది...’ అంటాడు. ‘రాజ్యం’పై ఆధారపడుతున్న వారు క్రమంగా తగ్గడం, అందుకు సూచిక అయితే కావొచ్చు.  

బాలుడైన జీసస్‌ పశువుల పాకలో చలి తగలకుండా గుడ్డలతో చుట్టి ఖాళీగా వున్న పశువులు నీళ్లు తాగే తొట్టెలో ఉన్నట్టుగా ‘క్రిస్మస్‌’ గ్రీటింగ్‌ కార్డ్స్‌ బొమ్మల్లో చూస్తాం. మేరీ, జోసఫ్‌లతో పాటుగా గొర్రెల కాపరులు, తూర్పుదేశం నుంచి వచ్చిన జ్ఞానులు విలువైన కానుకలు సమర్పిస్తారు. రెండు విభిన్న సామాజిక–ఆర్థిక సమూహాలు జీసస్‌ వద్దకు రావడం– ‘క్రిస్మస్‌’తోనే సాధ్యమయిందా? నాటి వారి కలయిక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నదా అంటే, లేదని అనడానికి కారణాలు కనిపించవు.

ప్రపంచం ‘క్రిస్మస్‌’ జరుపుకోవడం రెండు భిన్న సమూహాలు మధ్య దూరాలు తగ్గడంగా కనిపిస్తున్నది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ‘కేక్స్‌’ కట్‌ చేయడం, ఆనందోత్సాహాలను పంచుకోవడం వంటివి తరాలు మారుతూ ఉంటే అది మరింత ‘ట్రెండీ’గా మారుతున్నది. ‘క్రిస్మస్‌’ సీజన్లో అన్ని దేశాల్లో రిటైల్‌ మార్కెట్‌ ఊపందుకుంటుంది. దుస్తులు, ఫ్యాషన్ల ప్రకటనలు ఇప్పటికే పత్రికల్లో చూస్తున్నాం. ‘కరోనా’ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఎయిర్‌ పోర్టుల్లో ‘క్రిస్మస్‌’ సందడి నెల ముందే మొదలయింది.

– జాన్‌ సన్‌ చోరగుడి

Advertisement
Advertisement