
ప్రస్తుతం నగరం చదువుల ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది. ఎక్కడ చూసినా నోటిఫికేషన్లు, ఎంట్రెన్స్ ఫలితాలు, ర్యాంకుల ఆధారంగా కాలేజీ ఎంపికలు, సీట్ల కేటాయింపులు, కౌన్సెలింగ్‌ల ప్రక్రియల చర్చలు హోరెత్తుతున్నాయి. ఈ వాతావరణంలో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ సందేహాలు, అనుమానాలతో ముందస్తు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో పలు కోర్సులపై, కాలేజీలపై, కెరీర్ అవకాశాలపై స్పష్టత లేనిదే నిర్ణయాలు తీసుకుంటే.. అది భవిష్యత్తు పట్ల ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చదువుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, వివిధ కోణాల్లో విశ్లేషించడం తప్పనిసరిగా మారింది. ఇది కేవలం చదువు గురించి కాదు.. జీవితం గురించి. ఒక నిర్ణయం మీ జీవితానికి దిశ చూపుతుంది. మరి ఆ నిర్ణయం, నిజమైన సమాచారం ఆధారంగా ఉండాలి. ట్రెండ్‌లు చూసో, ఇష్టమైన రంగం అనో కాకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు సాగడం ముఖ్యమని నిపుణుల సూచన.
విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి? ఎలాంటి కాలేజీ ఏ రంగానికి బాగా అనుకూలం? జాబ్ మార్కెట్‌లో ఏ రంగానికి డిమాండ్ ఉంది? ఇవన్నీ తెలుసుకోవడమే మొదటి మెట్టు. సమాచారం మూడు మార్గాల్లో సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్షల తేదీలు, అప్లికేషన్లు, కౌన్సెలింగ్, సరి్టఫికెట్ వెరిఫికేషన్ తదితర తేదీలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్లలో తెలుసుకుంటుండాలి.
ప్రభుత్వ వెబ్‌సైట్లు (తప్పనిసరిగా చూడాల్సినవి): టీజీ ఈఏపీసీఈటీ, నీట్, సీయూఈటీ వంటి పరీక్షల అధికారిక వెబ్‌సైట్లు, ఏఐసీటీఈ, యూజీసీ వంటి ప్రభుత్వ శిక్షణ సంస్థల వెబ్‌సైట్లు.
నిపుణుల సలహాలు: కెరీర్ కౌన్సెలర్లు, సబ్జెక్ట్ నిపుణులు, సైకాలజిస్టులు విద్యార్థుల ప్రొఫైల్ ఆధారంగా సరైన మార్గదర్శనం అందించగలరు. ఉదాహరణకు ‘యూనివర్సిటీ, కెరీర్ ల్యాబ్స్, బైజూస్ కెరీర్ కౌన్సెలింగ్, టీసీఎస్ ఐఆన్’ వంటి ప్లాట్‌ఫాంలు ఉపయుక్తం.
పూర్వ విద్యార్థుల అనుభవాలు: ఆయా కాలేజీల పూర్వ విద్యార్థులను సంప్రదించడం వల్ల కాలేజీ రియాలిటీ, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాల్లో స్పష్టత వస్తుంది.
తల్లిదండ్రుల పాత్ర..
పిల్లల కలలు మీ కోరికలు కావొద్దు. పిల్లల ఆసక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గైడెన్స్ ఇవ్వాలి. ఎదుటివారి పిల్లలు చేసినట్లు చేయాలని అనడం ద్వారా పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు.
ఎవరి మాట నమ్మాలి..?
ఫేక్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు: వీరి మాటలు చాలాసార్లు మోసం చేస్తాయి. వారి చెప్పినంతగా స్కాలర్ షిప్స్, సీట్లు ఉండవు.
సోషల్ మీడియాలో డైరెక్ట్ యాడ్స్: వీరిని నమ్మొద్దు.. గుర్తింపు లేని సంస్థల్లో అవకతవకలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లలో సమాచారం ఉత్తమం.
కార్యాచరణ సూచనలు..
నాకు ఏవైనా ఆసక్తులు ఉన్నాయా? నేనేం బాగా చేయగలను? అనే స్వీయ విశ్లేషణ అవసరం. స్కూల్, కాలేజీ కౌన్సెలర్లు/సీనియర్ల ప్రాథమిక గైడెన్స్ తీసుకోవడం ఆన్‌లైన్‌లో సర్టిఫైడ్ కౌన్సెలింగ్ పొందడం. చివరి ఎంపికకు ముందు కనీసం ఇద్దరు–ముగ్గురు నిపుణులను సంప్రదించండి.
తప్పక తెలుసుకోవాల్సిన కోర్సులు..
ఇంజినీరింగ్ (బీ.టెక్): సీఎస్‌సీ, ఈసీఈ, ఏఐఎమ్‌ఎల్, సైబర్ సెక్యూరిటీ
వంటి కొత్త స్పెషలైజేషన్లు డిమాండ్‌లో ఉన్నాయి.
జేఎన్‌టీయూ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, సీబీఐటీ, వీఎన్‌ఆర్ వంటి కాలేజీలు మంచి పేరు తెచ్చుకున్నాయి.
మెడిసిన్ (ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎమ్‌ఎస్, బీహెచ్‌ఎమ్‌ఎస్): నీట్ ఆధారంగా అఖిల భారత, రాష్ట్రస్థాయి కోటాలో సీట్లు లభిస్తాయి.
ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చాలా ఎక్కువ. ప్రభుత్వ కాలేజీలు అయితే అత్యుత్తమమైనవి.
లిబరల్ ఆర్ట్స్, మాస్ కమ్యూనికేషన్, డిజైన్: ఎన్‌ఐడీ, నిఫ్ట్, ఎఫ్‌ఎల్‌ఏఎమ్‌ఈ యూనివర్సిటీ వంటి సంస్థలు ఆర్ట్స్‌కి ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులకు అనుకూలం.
వృత్తి విద్యా కోర్సులు(డిప్లొమా, ఐటీఐ, పారామెడికల్): తక్కువ ఖర్చుతో, త్వరగా ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగే కోర్సులు కావాలంటే ఇవి బెస్ట్. రాష్ట్ర ప్రభుత్వాల మేనేజ్డ్ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఈ కోణంలో మంచి పనితీరు
కనబరుస్తున్నాయి.డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేషన్–యూజీ): ఇది విద్యార్థి కెరీర్‌కు బేసిక్‌గా పనిచేసే దశ. మూడేళ్ల (బీఏ, బీఎస్సీ, బీకాం) నుంచి నాలుగేళ్ల (బీటెక్, బీ.ఫార్మా) వరకు కోర్సులు ఉన్నాయి. యూజీలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న బీఎస్సీ డేటా సైన్స్, న్యూట్రీషన్, ఫోరెన్సిక్ సైన్స్.. బీకాం ఫిన్‌టెక్, బిజినెస్ అనలైటిక్స్.. బీఏ సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్స్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. డిగ్రీలో నేర్చుకున్న ఫౌండేషన్ బలంగా ఉంటే పీజీలో విశ్లేషణాత్మక విద్యనూ,
పరిశోధనాత్మక దృక్పథాన్నీ పొందొచ్చు.పీజీ (పోస్ట్‌గ్రాడ్యుయేషన్): పీజీ అనేది యూజీలో పొందిన జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకునే దశ. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి
లేదా అధ్యాపక వృత్తిలోకి రావడానికి పీజీ ఉపయోగపడుతుంది.
కొన్ని కోర్సులకు ప్రత్యేక ఎంట్రెన్స్ అవసరం:
క్యాట్–ఎంబీఏ, సీయూఈటీ పీజీ లేదా టీజీ సీపీజీఈటీ–ఎమ్‌ఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌కాం, గేట్–ఎమ్‌టెక్, నీట్ పీజీ–మెడికల్ పీజీ కోర్సులు.
పీహెచ్‌డీ (డాక్టరల్ రీసెర్చ్): పరిశోధన రంగం అంటే సీరియస్‌గా గమనించాల్సిన అంశం. పీహెచ్‌డీ విద్యార్థి కొంత కాలం లోతుగా ఒక సబ్జెక్ట్ మీద పరిశోధన చేస్తూ సొంత థీసిస్ అందజేసే దశ. అభ్యాసం, పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పీహెచ్‌డీ సరైన మార్గం.
యూజీసీ–నెట్, సీఎస్‌ఐఆర్–నెట్, గేట్, జేఆర్‌ఎఫ్ వంటి పరీక్షల ద్వారా స్కాలర్‌షిప్‌తో చేరొచ్చు. హై–ఎండ్ కార్పొరేట్ ఆర్‌అండ్‌డీ, యూనివర్సి టీలలో ప్రొఫెసర్ ఉద్యోగాలు సాధించాలంటే పీహెచ్‌డీ అవసరం.
(చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..)