సాధికారత @ బీబీజాన్‌! | Bibijan Halemani dared to dream of millets | Sakshi
Sakshi News home page

సాధికారత @ బీబీజాన్‌!

Mar 24 2026 5:55 AM | Updated on Mar 24 2026 6:12 AM

Bibijan Halemani dared to dream of millets

బీబీజాన్‌ హలేమణి (40).. విశేష కృషితో లోకాన్ని తన వైపు తిప్పుకున్న ఓ సాధారణ మహిళా రైతు, స్వయం సహాయక సంఘం సారథి. కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లా 
కుందగొడ తాలూకాలో హుబ్లి నుంచి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉన్న ఒక గ్రామం ‘తీర్థ’ ఆమె స్వస్థలం. అంతా వర్షాధార వ్యవసాయమే. ఆమె కుటుంబం 3 ఎకరాల సొంత భూమి 7 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తోంది. 

రాజనీతి శాస్త్రంలో బీఏ చదివిన బీబీజాన్‌ భర్త మౌల వ్యాపారి. ఇద్దరు పిల్లలు. కొడుకు బీఎల్, కూతురు బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్నారు. చదువు, సామాజిక దృష్టి కలిగినప్పటికీ.. ఇంటి పనులతో పాటు కుటుంబ వ్యవసాయ పనులు చేస్తూ ఒకానొక కుగ్రామంలో కాలం వెళ్లదీస్తున్న ఆమె జీవితం ఏడేళ్ల క్రితం గొప్ప మలుపు తీసుకుంది. 

యూఎన్‌డీపీ ఈక్వేటర్‌ అవార్డు
2019లో 15 మంది మహిళల భాగస్వామ్యంతో బీబీజాన్‌ సార«థ్యంలో ఏర్పాటైన ‘బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘ’మే అందుకు కారణం. ఆరేడేళ్లు గడిచే సరికి వారంతా సాధి­కారతను సాధించుకున్నారు. తమ ఊరితో పాటు 30 ఊళ్లలో వ్యవసాయాన్ని నిలబెట్టే దిశగా మరల్చేందుకు ఈ సంఘమే దోహదపడింది. అందుకే గత ఏడాది ప్రసిద్ధ ‘యూఎన్‌డీపీ ఈక్వేటర్‌ ఇనీషియేటివ్‌ అవార్డు’ను ఈ సంఘం గెల్చుకుంది. పంటల జీవవైవిధ్యానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను వ్యాప్తి­లోకి తెచ్చే పది సంస్థలకు ఏటాఈ పురస్కారం ఇస్తుంటారు. దీనితో పాటు రూ.9 లక్షల నగదు బహుమతిని ప్రదానం చేస్తా­రు. 

అంతరించిపోతున్న చిరుధాన్యాలతో కూడిన మిశ్రమ సాగు పద్ధతిని ఈ సంఘం వ్యాప్తిలోకి తేవటానికి కీలక సాధనంగా ఉపయోగపడింది. చిరుధాన్యాలతో పాటు పప్పుధాన్యాలు, నూ­నెగింజలు, కూరగాయలను మిశ్రమ సాగు ద్వారానే ప్రతి­కూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైతులు నిలదొక్కుకో­గలరని తెలియజెప్పి, రైతులు సుమారు 2 వేల హెక్టార్లలో అనుసరించేలా చెయ్యటంలో బీబీజాన్‌ నేతృత్వంలోని మ­హి­ళా సంఘం అపూర్వ విజయం సాధించింది. ఇందులో 25% రైతులు ప్రకృతి, సేంద్రియ పద్ధతుల్లోకి మారారని చెబుతూ.. రైతులతో సాగు పద్ధతిని మార్పించటం అంత సులభం కాదని బీబీజాన్‌ ‘సాక్షి సాగుబడి’తో అన్నారు. 

సహజ సమృద్ధ స్వచ్చంద సంస్థ మార్గదర్శనంలో భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌) తదితర సంస్థల తోడ్పాటు తీసుకుంది. మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యంత్రం, సౌర విద్యుత్తు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ ఈ సంఘం ఆదర్శవంతంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. బీబీ ఫాతిమా ఎస్‌హెచ్‌జి ఇతర సంఘాలతో కలసి ఏర్పాటు చేసుకున్న దేవధాన్య ఎఫ్‌పీసీ ఈ సంవత్సరం రూ. 1.5 కోట్ల వ్యాపారం చేసింది. 

350 రకాలతో దేశీ విత్తన నిధి 
సొంత, దేశీ విత్తనాలు కాపాడుకోవటానికి ఈ సంఘం విత్త­న నిధిని ఏర్పాటు చేసింది. విత్తనం రైతులు కొనే పనిలేదు. పది కిలోల విత్తనాలు తీసుకుంటే పంట పండించి 20 కిలో­లు తిరిగి ఇవ్వాలి. అంతే. ఈ సామాజిక విత్తన బ్యాంకులో ఇప్పుడు 350 దేశీ రకాల విత్తనాలున్నాయి. 74 రకాల రాగులు, 10 రకాల కొర్రలు, 25 రకాల సామలు, 25 రకాల పప్పుధాన్యాలు, 80 కూరగాయల విత్తనాలు ఈ విత్తన బ్యాంకులో రైతులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన 30 మంది రైతులతో దేశీ విత్తన ఉత్పత్తి చేయిస్తున్నారు. పంట దిగుబడులను దేవధాన్య ఎఫ్‌పీవో, సహజ ఆర్గానిక్స్‌ ఎఫ్‌పీవోల ద్వారా విక్రయిస్తున్నారు. సీడ్, మిల్లెట్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తూ రైతులే నేరుగా వినియోగదారులకు సేంద్రియ ఆహారాన్ని అమ్మే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుండటం విశేషం.

25% మంది చిరుధాన్యాలు తింటున్నారు
మా ప్రాంతంలో రైతులు 2 వేల హెక్టార్లలో చిరుధాన్యాల మిశ్రమ సాగు చేస్తున్నారు. సుమారు 15 గ్రామాల రైతులు తమ ధాన్యాలను మా ప్రాసెసింగ్‌ యూనిట్‌లో ప్రాసె­సింగ్‌ చేయించుకుంటున్నారు. మా యంత్రంలో 10 కిలోల చిరుధాన్యాలను కూడా మర­పట్టించి బియ్యం తయారు చేసుకోవచ్చు. 2024లో దాదాపు 50 మెట్రిక్‌ టన్నుల మిల్లె­ట్లు ప్రాసెస్‌ చేశాం. మా సంఘం ఏర్పాటైనప్పుడు మా గ్రామంలో ఎవరూ చిరుధాన్యా­లు తినేవారు కాదు. కానీ ఇప్పుడు కనీసం 25% మంది ప్రతిరోజూ చిరుధాన్యాల బియ్యంతో వండిన అన్నం తింటున్నారు. యూఎన్‌డీపీ ఈక్వేటర్‌ ఇనీషియేటివ్‌ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది. ఈ పురస్కారం మాకు మాత్రమే చెందినది కాదు. దేశంలో మహిళా రైతులందరికీ దీన్ని అంకితం చేస్తున్నాం. 
– బీబీజాన్, బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘం, కర్ణాటక, యూఎన్‌డీపీ ఈక్వేటర్‌ ఇనీషియేటివ్‌ అవార్డు గ్రహీత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement