నాటకాంతరంగం

AV Ramana Murthy Hamnet Novel Review - Sakshi

కొత్త బంగారం

ఇంగ్లండ్‌లోని స్ట్రాట్‌ఫర్డ్‌లో నివసిస్తున్న దంపతుల అబ్బాయి హామ్‌నెట్‌ పదకొండేళ్ల వయసులో 1596లో చనిపోయాడు. అటుతర్వాత నాలుగేళ్లకి వాళ్ల నాన్న ఒక నాటకం రాశాడు. నాటకం పేరు ‘హామ్‌లెట్‌’. రాసింది షేక్స్‌పియర్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేనంత ప్రసిద్ధనాటకం! ఆన్యిస్‌ తమ్ముళ్లకి లాటిన్‌ పాఠాలు చెప్పటానికి గ్రామర్‌ స్కూల్లో చదువుకున్న విలియం కుదురుకున్నప్పుడు వాళ్ల తొలిపరిచయం. ప్రకృతి వైద్యురాలూ, మనుషుల అంతరంగాల్లోకి తొంగిచూడగల శక్తిమంతురాలూ, తనకంటే వయసెక్కువున్న ఆన్యిస్‌తో ప్రేమలో పడిపోతాడు విలియం. పెళ్లికి పెద్దవాళ్లు ఒప్పుకునేనాటికి ఆమె మూడునెలల గర్భవతి. పెళ్లయ్యాక, విలియం తల్లిదండ్రుల ఇంటిపక్కనే నివాసం ఏర్పరచుకున్న దంపతులకి పెద్దమ్మాయి పుట్టాక, సృజనపట్ల ఆసక్తులున్న విలియం, తండ్రి వ్యాపారంలోనూ ఆగ్రహాలలోనూ ఇమడలేక అసహనానికి గురవుతుంటాడు. దాన్ని గుర్తించిన ఆన్యిస్‌ అతన్ని అక్కణ్ణుంచి తప్పించేసి లండన్‌ కి పంపించేస్తుంది.

అప్పటికే మళ్లీ గర్భవతిగా ఉన్న ఆమెకి అనంతరకాలంలో కవలలు – అబ్బాయి హామ్‌నెట్, అమ్మాయి జూడిత్‌ – పుడతారు. ఇంటిపనులతోనూ, పిల్లలని పెంచడంలోనూ, మూలికావైద్యాలతోనూ ఆన్యిస్‌ జీవితం యాంత్రికంగా సాగిపోతుంటుంది. తదనంతర పరిణామాల్లో విలియం సొంతవూరికి రావడం బాగా తగ్గిపోతుంది. చివరికి జూడిత్‌ ప్లేగువ్యాధి బారిన పడ్డప్పుడు, ఆమె బాధని చూడలేక వ్యాధిని స్వీకరించిన హామ్‌నెట్‌ మరణించాకే విలియం ఊరికి చేరుకోగలుగుతాడు. ఆన్యిస్‌ అనుభవిస్తున్న శూన్యాన్ని నింపడం విలియంకి చేతకాదు. కొన్నిరోజులుండి, తన నాటకాల వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవాలని లండన్‌ కి వెళ్లిపోతాడు. నాటకరంగంలో స్థిరపడ్డ విలియం, సొంతఊరిలో మంచి బంగళా కూడా కొంటాడు. విలియం విజయాల గురించి అక్కడక్కడా వింటున్న ఆన్యిస్‌ విలియం రాసిన తాజా నాటకం పేరు ‘ద ట్రాజెడీ ఆఫ్‌ హామ్‌లెట్‌’ అని తెలుసుకుని తట్టుకోలేకపోతుంది. ఆ పేరుని అతను ఏ అధికారంతో ఉపయోగించగలడు? తననుంచి హామ్‌నెట్‌ని ఎవరో రెండోసారి లాక్కెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఆన్యిస్‌కి. ఆవేశంలో లండన్‌ కి ప్రయాణమవుతుంది. అక్కడ ఆమె చూసిందీ, తెలుసుకున్నదీ నవల ముగింపు సన్నివేశం.

చరిత్ర తక్కువ తెలిసినచోట కల్పనకి ఎక్కువ అవకాశం ఉంటుందంటారు. షేక్స్‌పియర్‌ వ్యక్తిగత జీవిత వివరాలు చాలావరకు అలభ్యం. హామ్‌నెట్‌ మరణ కారణం గురించీ, షేక్స్‌పియర్‌ భార్య ‘ఆన్‌’ గురించీ వివరాలు ఇంతవరకూ దొరకలేదు. వాటిని పూరించడానికన్నట్టు రచయిత్రి మాగీ ఓ’ఫారెల్‌ నవల ప్రారంభించగా, అది షేక్స్‌పియర్‌ భార్య ఆన్‌ (నవలలో ‘ఆన్యిస్‌’) ప్రధానపాత్రగా ‘హామ్‌నెట్‌’ నవలైంది. నిజజీవితంలోనూ అతనికంటే పెద్దదైన ఆమే అతన్ని వలలో వేసిందనే అపవాదొకటుండగా, షేక్స్‌పియర్‌ తన విల్లులో ఆమెకి కేవలం ఒక మంచం మాత్రమే (‘మై సెకండ్‌ బెస్ట్‌ బెడ్‌’) రాయడం వారి వైవాహిక జీవితానికి సంబంధించిన ఊహాపోహలకి తావిచ్చింది. వాటన్నింటినీ పూర్వపక్షం చేస్తూ ఆన్యిస్‌ పాత్రచిత్రణ జరగడమే కాకుండా నవలలో ఎక్కడా షేక్స్‌పియర్‌ పాత్రకి పేరుండదు. నవల ‘హామ్‌నెట్‌’ అని శ్రీకారం చుట్టుకున్నప్పటికీ ఇది ఆన్యిస్‌ ప్రేమ, సంవేదనల మీదుగా చేసిన బాధ్యతాయుతమైన ప్రయాణం గురించి. 

కవలలు ప్లేగుబారిన పడటానికి ముందు కథ, తరువాతి కథగా సమాంతర కథనం– జరుగుతున్న కథనేమో వేగంగానూ, జరిగినకథని మాత్రం వివరణాత్మకంగా చెప్తూ రెంటినీ వర్తమానకాలపు కథనం చేసి తక్షణతని సృష్టిస్తుంది. విలియం, ఆన్యిస్‌ల తొలి శృంగార కలయికని అత్యంత కవితాత్మకంగా చెప్పినటువంటి పుష్టికరమైన వచనఘట్టాలు నవలలో పుష్కలంగా ఉండగా, ముగింపు సన్నివేశం పాఠకుడిలో భావావేశాన్ని ఉవ్వెత్తున రగిలించగలిగిన రచయిత్రి భాషామనీషకి పరాకాష్ఠ. నాలుగువందల యేళ్లు గడిచిపోయినా, షేక్స్‌పియర్‌ ‘గ్లోబ్‌ థియేటర్‌’లో స్వయంగా నటిస్తున్న అప్పటి హామ్‌లెట్‌ నాటకాన్ని మనం వీక్షిస్తున్న ఉద్రేకం, షేక్స్‌పియర్‌ మీద ప్రసరింపజేసే వినూత్నకాంతి, పాత్రల అబలత, రచయిత్రి భావశబలతల మధ్య పాఠకుడు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. భావప్రధానంగా దుఃఖం ఒకటే అయినప్పటికీ, వైయక్తికస్థాయిలో అభివ్యక్తి రూపాలు విభిన్నంగా ఉంటాయి. కవల సోదరుణ్ణి కోల్పోయి సగం శరీరం కోల్పోయినట్టనిపిస్తున్న జూడిత్, శారీరంలో దాన్ని చూపించగలిగిన ఆన్యిస్, సృజన ద్వారా మాత్రమే ఆ రసాన్ని నిష్పన్నం చేయగలిగిన షేక్స్‌పియర్‌ – వీరందరి దుఃఖపు వర్ణచ్ఛాయలన్నీ వేరే వేరే!   
ఎ.వి.రమణమూర్తి
నవల: హామ్‌నెట్‌
రచన: మాగీ ఓ’ఫారెల్‌
ప్రచురణ: టిండర్‌ ప్రెస్‌; 2020 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top