UNHRC: మానవహక్కుల దూతగా తొలి దళిత యువతి

Ashwini KP As UNHRC Special Rapporteur First Indian Interesting Facts - Sakshi

మానవహక్కుల దూతగా తొలి దళిత యువతి

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని  నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌కు ప్రత్యేక దూతగా ఉంటూ... దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది.

తొలి దళిత యువతి
‘స్త్రీగా, దళిత స్త్రీగా నేను ఈ అవకాశం పొందడం చాలా ప్రాముఖ్యమైన సంగతి’ అంటోంది అశ్విని. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌ సమావేశాలలో కీలకమైన నిర్ణయం వెలువడింది. జాతి వివక్షను నివేదించేందుకు స్వతంత్య్ర నిపుణురాలిగా (ప్రత్యేక దూతగా) మొదటిసారి ఒక భారతీయురాలి ఎంపిక జరిగింది.  

బెంగళూరులో పొలిటికల్‌ సైన్స్‌ బోధించే అధ్యాపకురాలు, దళిత్‌ యాక్టివిస్టు అశ్విని కె.పి.ని కౌన్సిల్‌లోని 47 మంది సభ్యుల బాడీ ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. ఈ పదవిలోకి వచ్చిన తొలి ఆసియా మహిళగా, తొలి భారతీయురాలిగా, తొలి దళితురాలిగా ఆ మేరకు అశ్విని చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ పదవిలో జాంబియాకు చెందిన మహిళ ఇ.తెందాయి ఉంది.

అమెరికాలో ఇటీవల భారతీయ సముదాయంలో ‘కుల వివక్ష’ ధోరణి ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌ నిర్వహించే కార్యకలాపాలను నమోదు చేయడం, ఆయా దేశాలలో నెలకొన్న అసహనం, జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల అకారణ ద్వేషం స్థూలంగా, దేశాన్ని బట్టి ఏ విధంగా ఉన్నాయో కౌన్సిల్‌కు నివేదించడం అశ్విని బాధ్యతలుగా ఉంటాయి. ఈ పదవిలో అశ్విని మూడేళ్లు ఉంటుంది.

ఈ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ..
‘భారతదేశంలో అంబేద్కర్‌ కులవివక్షని, జాతి వివక్షని ఎలా ఎదుర్కొవాలో చెప్పారు. మన దేశంలో అంటరానితనం ఎంతటి ఘోరమైన కులవివక్షకు కారణమైందో తెలుసు. అది చూసే అంబేద్కర్‌ ప్రతిఘటన మార్గాలు చెప్పారు.

అయితే అవి భారతదేశానికే కాదు... ప్రపంచం మొత్తానికి ఉపయోగపడతాయి. జాతి వివక్ష గురించి నాకున్న దృష్టికోణం ఆయన నుంచి పొందినదే. ఒక స్త్రీగా, దళితురాలిగా కూడా నాకు ఈ పదవి రావడం వల్ల మార్జినలైజ్డ్‌ సమూహాలు ఎదుర్కొనే వివక్షను మరింత బాగా అర్థం చేసుకునే వీలు ఉంది.’

‘భారత్‌– నేపాల్‌లలో దళిత మానవ హక్కులు ఎలా ఉన్నాయో అన్న అంశం మీద జె.ఎన్‌.యూ.లో నేను పీహెచ్‌డీ చేశాను. ఆ సమయంలో ఎందరో దళిత యాక్టివిస్టులను కలిశాను. వారంతా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వివిధ వేదికలలో పని చేస్తున్నారు.

అలాగే నేను ఆమ్నెస్టీకి చెందిన సీనియర్‌ బృందాలతో కలిసి పని చేశాను. ఆ పనిలో భాగంగా ఛత్తిస్‌గఢ్, ఒడిశాలలోని ఆదివాసుల హక్కుల హరణం తెలుసుకున్నాను. ఆదివాసులు, దళితులు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ అవగాహనలన్నీ ఇప్పుడు వచ్చిన ఈ పదవిని మరింత అర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి’

‘రకరకాల వివక్షల వల్ల కోట్లాది మంది బాధ పడుతున్నారు. ఈ వివక్షలను దాటి ముందుకు నడవడానికి ప్రతి ఒక్కరూ చేతనైన చైతన్యం కలిగించాలి. కల్పించుకోవాలి’.

చదవండి: అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కొన్ని నియమాలు..
Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top