బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతానికి పెద్దపులి మళ్లీ వచ్చేసింది. జనవరి 21న తెలంగాణలోని కావిడిగుండ్ల గ్రామం నుంచి రాష్ట్రంలోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం గుబ్బల మంగమ్మ గుడి సమీపంలోకి ప్రవేశించిన పెద్దపులి వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ అటు ప్రజలను ఇటు అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేసిందనే విషయం పాఠకులకు తెలిసిందే. అలాగే జిల్లాలోని 13 పశువులపై దాడి చేసి హతమార్చింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న పోలవరం మండలం నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పరిసర ప్రాంతాల మీదుగా గోదావరి దాటుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో రాయవరం మండలం పెద్ద కూర్మాపురంలో ఫారెస్ట్ అధికారుల ప్రత్యేక ఆపరేషన్‌తో పూనె నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి పెద్దపులిని బంధించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం అధికారులు పెద్దపులిని పాపికొండల అభయారణ్యంలో తిరిగి విడిచిపెట్టారు. అయితే అడవి బాట పట్టిన పెద్దపులి మళ్లీ పోలవరం జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో పెద్దపులి శనివారం మళ్లీ జిల్లాలోకి వచ్చేసింది. అయితే పెద్దపులిని పాపికొండల అభయారణ్యంలో వదిలినప్పుడు దాని కదలికలు గుర్తించేలా ఫారెస్ట్ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్స్‌ను అమర్చారు. వీటి సిగ్న ల్స్ ఆధారంగా పులి కదలికలను ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్న పులి మళ్లీ వచ్చిన మార్గంలోనే ఏలూరు జిల్లా దాటుకుని తెలంగాణ మీదుగా మహారా ష్ట్రలోని తడోబా అడవుల్లోకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పెద్ద పులి (ఫైల్)
బాబోయ్.. మళ్లొచ్చింది
పాపికొండల అభయారణ్యంలో సంచారం
రేడియో కలర్ సిగ్నల్స్ ద్వారా గుర్తింపు
‘తూర్పు’ నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి
భయాందోళనలో గిరిజనులు
అప్రమత్తం చేస్తున్న అటవీశాఖ అధికారులు
జనవరి, ఫిబ్రవరిల్లో జిల్లాను వణికించిన పులి సంచారం


