లీజు చెల్లించి భూములు అప్పగించాలి | - | Sakshi
Sakshi News home page

లీజు చెల్లించి భూములు అప్పగించాలి

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

లీజు చెల్లించి భూములు అప్పగించాలి

కాళ్ల: ఓఎన్జీసీ సంస్థ డ్రిల్లింగ్‌ నిమిత్తం తమ వద్ద తీసుకున్న భూమికి సంబంధించి లీజు చెల్లించి భూములను అప్పగించాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కోలనపల్లిలో డ్రిల్లింగ్‌ భూమి ఆవరణలో ఎనిమిది స్థలాలకు సంబంధించిన రైతులు ఆదివారం సమావేశమయ్యారు. కాళ్ల, కోలనపల్లి, బొండాడ లంక, సీసలిలో రెండు, గణపవరం మండలం అడవికొలను, తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కరవాక ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ ద్వారా 1999లో అప్పగించామని అప్పటినుంచి 2018 జనవరి వరకూ లీజు సొమ్ము చెల్లించారన్నారు. నాటి నుంచి 2026 వరకూ సంస్థ ఎటువంటి లీజు చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది స్థలాలకు సంబంధించి సుమారు 50 మందికి పైగా రైతుల భూములు ఉన్నాయి. అధికారులను అడిగితే వీటిని ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించాం లీజు సొమ్ములు వారే చెల్లిస్తారు, ఓఎన్జీసీకి ఎటువంటి సంబంధంలేదని చెబుతు న్నారని తెలిపారు. భూములను రైతుల ప్ర మేయం లేకుండా ఓఎన్జీసీ మూడో పార్టీకి ఎలా ఇచ్చారని రైతులు ప్రశ్నించారు. అయితే వారు ఎటువంటి డ్రిల్లింగ్‌ ఆపరేట్‌ చేయడంలేదని, ఓఎన్జీసీ సంస్థను అడిగినా సరైన సమాధానం చెప్పడంలేదన్నారు. పనులు జరగనప్పుడు లీజు సొమ్ములు చెల్లించి భూములు అప్పగించాలని కోరినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement