హిజ్రాలను అడ్డుకున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

హిజ్రాలను అడ్డుకున్న పోలీసులు

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

హిజ్రాలను అడ్డుకున్న పోలీసులు 36 శాతం ఐఆర్‌ మంజూరు చేయాలి క్షేత్రంలో భక్తుడికి పాము కాటు మహిళల విద్యాభివృద్ధికి ఫూలే కృషి

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం రాత్రి కొందరు హిజ్రాలకు ఎస్సై టి.సుధీర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మరోసారి క్షేత్రంలో కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈనెల 5న ‘సాక్షి’లో ‘శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పోలీస్‌ అధికారులు స్పందించారు. శనివారం రాత్రి క్షేత్రంలో భారీగా వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో హిజ్రాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా 15 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా టవేరా కారులో కొండపైకి వెళుతున్న 10 మంది హిజ్రాలను ఎస్సై టి.సుధీర్‌ సిబ్బందితో కలిసి టోల్‌గేటు వద్ద అడ్డుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లి డబ్బులు డిమాండ్‌ చేసి, దౌర్జన్యాలకు పాల్పడటం సరికాదన్నారు. క్షేత్రంలో జరిగే పెళ్లిళ్లకు వెళ్లడానికి ఇక వీల్లేదన్నారు. కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎం.రవికుమార్‌ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, 36 శాతం ఐఆర్‌ మంజూరు చేయాలని, పాత పెన్షన్‌ పద్ధతి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం సాయంత్రం ఓ భక్తుడు పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు వెంటనే పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడకు చెందిన ఆర్‌అండ్‌బి ఉద్యోగి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి ఉదయం క్షేత్రానికి విచ్చేశాడు. ఆదివారం ఉదయం నిత్యకల్యాణంలో పాల్గొనాలని ధర్మఅప్పారాయ నిలయంలో గదిని అద్దెకు తీసుకున్నాడు. సాయంత్రం వెంకటేశ్వరరావు బయటకు వెళ్లే క్రమంలో, సత్రం ముఖ ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ మెట్లపై ఉన్న పాము ఆయన కాలి బొటన వేలుపై కరిచింది. వెంటనే ఆయనను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి 108 ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఏలూరు (టూటౌన్‌): సామాజిక సంస్కరణలతో పాటు మహిళా విద్యకు పాటుపడిన మహా వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి చెప్పారు. జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చైతన్యవంతమైన జీవితం సాగించేందుకు విద్య చాలా అవసరమని ఫూలే ఆనాడే చెప్పారని, దానిని ఆచరించారన్నారు. పేద వర్గాల అభివృద్ధికి ఫూలే చేసిన సేవలు నేటి తరం వారికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డా.ఎం. జె.అభిషేక్‌ గౌడ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement