ఆగిరిపల్లి: మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. శనివారం ఉదయం ఆగిరిపల్లిలోని కొండ కాలనీలోని ఇళ్లు, వాహనాలను డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి ధ్రువపత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. అనంతరం పోలీసు అధికారులు ప్రజలతో కలిసి డీఎస్పీ ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నూజివీడు టౌన్, రూరల్ సీఐలు సత్య శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్సైలు శుభశేకర్, నాగేశ్వరరావు, రామకృష్ణ, చిరంజీవి 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై బి.చంద్రశేఖర్ శనివారం పేర్కొన్నారు. సీఐ బాల సురేష్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కొయ్యలగూడెంలోని ఎస్టీ నగర్‌లో వరసకు అత్త అయిన పోలా మంగమ్మ అనే వృద్ధురాలిని అల్లుడు కేదారి పుల్లయ్య ఈనెల 10వ తేదీన హత్య చేసి పరారయ్యాడన్నారు. అచ్యుతాపురం సమీపంలో నిందితుడు పుల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు చెప్పారు.
భీమవరం (ప్రకాశంచౌక్): వర్కింగ్ జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను మరో ఏడాది అనగా 2026–27కు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ జీఓఎంస్ సంఖ్య 43 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీఓఎంస్ సంఖ్య 12 ద్వారా 2015లో అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అదే విధంగా ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) మాదిరిగా వివిధ ఎంపానల్డ్ ఆసుపత్రుల ద్వారా గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా క్యాస్ లెస్ వైద్య సేవలు అందించే లక్ష్యంతో వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్‌స్కీమ్ (డబ్ల్యూజెహెచ్‌ఎస్)ను ప్రవేశపెట్టడం జరిగింది. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు.


