కైకలూరు : పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిపై పల్లెవాడ గ్రామం వద్ద ఆగిఉన్న ట్రాక్టర్‌ను మాచర్ల నుంచి నిడదవోలు వెళుతున్న ధాన్యం లోడు లారీ శనివారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ట్రాక్టర్ వద్ద ఎవరూ లేరు. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే కారణమని భావిస్తున్నారు. పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.
ముసునూరు: సరిహద్దు వివాదంలో దాడి చేసిన ముద్దాయికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం వలసపల్లిలో జూన్ 27, 2020న పల్లి పాము హేమలత (59)ను సమీప నివాసి గొల్లపల్లి సుశీల(47) సరిహద్దు వివాదంలో కరత్రో కొట్టి తీవ్రంగా గాయపరచింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ముసునూరు ఎస్సై కేసు నమోదు చేసి, చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నూజివీడు జేఎఫ్ సీఎం జడ్జి ముద్దాయికి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్లు ఎస్సై ఎం చిరంజీవి శనివారం తెలిపారు.
టి.నరసాపురం: నిషేదిత కలుపు మందు కలిగిఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ ఎం.రాజు తెలిపారు. మండలంలోని గుర్వాయిగూడెంకు చెందిన కమ్మ నాగేశ్వరరావు వద్ద నిషేదించిన గ్‌లైసెల్ కలుపు మందు ఉందన్న సమాచారంతో అతని వ్యవసాయ క్షేత్రంలో ఏవో ఎం.ప్రియాంక శనివారం తనిఖీలు నిర్వహించారు. నాగేశ్వరరావు పామాయిల్ తోటలోని షెడ్డులో రూ.2,93,400 విలువ చేసే 360 లీటర్ల నిషేదిత గ్‌లైసెల్ కలుపు మందు బాటిళ్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఇటీవల న్యూఢిల్లిలో జరిగిన అడ్వెంచర్ నేషనల్ స్పోర్ట్స్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ చాంపియన్‌షిప్ మీట్ 2026లో జిల్లా ఉప మలేరియా అధికారి యాతం నాగబాబు పతకాలు గెలుచుకున్నారు. 800, 1500 మీటర్ల పరుగులో మొదటి స్థానంతో బంగారు పతకాలు, 400 మీటర్ల పరుగులో 2వ స్థానంతో వెండి పతకాలు గెలుచుకున్నట్లు ఆయన చెప్పారు. 2027లో జపాన్‌లో జరిగే ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ పరుగు పందెం పోటీలకు ఎంపికై నట్లు నాగబాబు తెలిపారు.


