శాశ్వత భవనం.. ఇంకెంత దూరం? | - | Sakshi
Sakshi News home page

శాశ్వత భవనం.. ఇంకెంత దూరం?

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

ప్రజాభీష్టం మేరకే మార్కెట్‌ యార్డు స్థలం

భీమవరం కలెక్టరేట్‌కు నాలుగేళ్లు పూర్తి

గత ప్రభుత్వంలో శాశ్వత భవనానికి జీఓ

కూటమి ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్‌ తరలింపునకు కుట్రలు

భీమవరం (ప్రకాశం చౌక్‌) : పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నరసాపురం పార్లమెంట్‌ను నూతన పశ్చిమగోదావరిగా జిల్లాగా భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కలెక్టరేట్‌ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యింది. జిల్లాలోని ఏడు నియోజవర్గాల ప్రజలకు కలెక్టరేట్‌ ద్వారా అన్ని సేవలు సులభంగా వేగంగా అందుతున్నాయి. ఏలూరు 70 కిలోమీటర్లు వెళ్లే దూరాభారం తగ్గంది. అయితే కలెక్టరేట్‌కు శాశ్వత భవనం లేక ఇప్పటికీ అద్దె భవనంలో కొనసాగుతుంది.

పట్టించుకోని కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం నుంచి కలెక్టరేట్‌ను వేరేచోటుకు తరలించాలని కుట్రలు జరిగాయి. భీమవరం ప్రజలు నుంచి తిరుగుబాటు రావడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా నేటికీ కలెక్టరేట్‌కు శాశ్వత భవనం నిర్మాణానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అసలు కలెక్టరేట్‌ భవనం నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. జిల్లాలోని కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మంత్రులు కలెక్టరేట్‌ శాశ్వత భవనం నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు

ఈ ఏడాది నిర్మాణంపై నీలినీడలు

భీమవరం మార్కెట్‌ యార్డ్‌లోనే కలెక్టరేట్‌ భవనం నిర్మాణం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు స్పష్టం చేసి నెలలు గడస్తున్నాయి. కానీ ఇప్పవరకు నిర్మాణానికి సంబంధించి కనీసం అధికారులు పరిశీలన కూడా చేయలేదు. నిర్మాణానికి అనుకూలమైన వాతవారణం ఉండే వేసవిలో కలెక్టరేట్‌ శాశ్వత భవనం నిర్మాణం పనులు చేపట్టకపోతే ఈ ఏడాది కూడా కలెక్టరేట్‌ భవనం నిర్మాణం లేనేట్టా? అనే సందేహం కలుగుతుందని ప్రజలు చెబుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టరేట్‌కు శాశ్వత భవనం ఉండాలని అన్నింటికి అనుకూలమైన భీమవరం మార్కెట్‌ యార్డ్‌ను ఎంపిక చేసి అక్కడ ఇంటిగ్రేటెడ్‌ భవనం నిర్మాణానికి జీఓ జారీ చేశారు. అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మేథావులు, సీనియర్‌ రాజకీయ నాయకులు. నేడు కూటమిలో నాయకులు కూడా అందరు కూడా మార్కెట్‌ యార్డులో కలెక్టరేట్‌ నిర్మాణం మంచి నిర్ణయమని ప్రశంసించారు. అలాంటి మార్కెట్‌ యార్డులో కలెక్టరేట్‌ భవనం నిర్మాణానికి ఈకూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement