అకడమిక్ సంస్కరణలు అమలు చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన అకడమిక్ సంస్కరణలను అన్ని కళాశాలల్లో అమలు చేయాలని బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ జీ.నరసింహరావు సూచించారు. అకడమిక సంస్కరణలు, ప్రశ్నా పత్రాల కూర్పు, పరీక్షల నిర్వహణ, విధి విధానాలకు సంబంధించి జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్లకు, బోధనేతర సిబ్బందికి బుధవారం స్థానిక సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలలో ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే యోహాను అధ్యక్షతన అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. నరసింహరావు మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థులందరికి ఈ అకడమిక్ సంస్కరణలు ప్రకారం మారిన సిలబస్, మార్కుల నమూనాలను వివరించారు. వచ్చే జనవరి 21 నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి పరీక్షల నిర్వహణ, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, బోర్డు నియమ నిబంధనలపై పలు సూచనలు ఇచ్చారు.


