లోక్ అదాలత్‌లో 10,798 కేసుల పరిష్కారం
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 10,798 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. 10798 పెండింగ్ కేసులు, 238 ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేశామని, పెండింగ్ కేసులలో 10,351 క్రిమినల్ కేసులు, 153 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 294 సివిల్ కేసులను రాజీ చేశామన్నారు. ఏలూరులో 1,988, భీమవరంలో 974, చింతలపూడిలో 1,248 జంగారెడ్డిగూడెంలో 971, కొవ్వూరులో 1,092, నర్సాపురంలో 434, పాలకొల్లులో 458, తాడేపల్లిగూడెంలో 1,433, తణుకులో 1,082, నిడదవోలులో 919, భీమడోలు 153 పెండింగ్ కేసులను పరిష్కరించామని తెలిపారు. కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, పోలీస్ అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, బీమా, బ్యాంకు అధికారులు, ఇతర విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
కొయ్యలగూడెం: అచ్యుతాపురం గ్రామ సరిహద్దులలో నిర్వహిస్తున్న డీజిల్ అక్రమ విక్రయాలలో ఓ రెవెన్యూ అధికారి పాత్ర ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డిసెంబర్ మూడున సాక్షిలో ప్రచురితమైన డీజిల్ అక్రమ విక్రయాలపై అధికారులు దృష్టి పెట్టి విచారణ చేశారు. గోపాలపురం మండలంలోని రెవెన్యూ అధికారి ఒకరు విచారణకు వెళ్లిన అధికారులను పక్కదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఏలూరు జిల్లాకు చెందిన అధికారులు వెళ్లినప్పుడు పరిధి తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుందని, తూర్పుగోదావరి అధికారులు వెళ్ళినప్పుడు పరిధి మనది కాదు ఏలూరు జిల్లా పరిధిలోనిదని తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి కారణాలతోనే సుమారు రెండు సంవత్సరాల నుంచి అక్రమ డీజిల్ విక్రయదారులపై ఏ విధమైన కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది.
ఏలూరు (టూటౌన్): యూపీఏ ప్రభుత్వంలో తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ పేరు తీసి పూజ్య బాపుగా మార్చినంత మాత్రాన ఉపాధి హామీ కూలీలకు ఒరిగింది ఏంటని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం పేర్కొంది. పట్టణంలోని స్ఫూర్తి భవన్‌లో ఆఫీస్ బేరర్ల సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ చట్టం పదం వాడకుండా పథకం అనే పదం వాడడానికి ప్రయత్నం చేస్తున్నారని, అందువల్ల పని అనే గ్యారెంటీ అనేది తీసివేస్తారేమోనని అనుమానం ఉందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో చట్టం తెచ్చినప్పుడు కేంద్రం 90 శాతం నిధులు, రాష్ట్రాలు 10 శాతం నిధులు ఉపాధి హామీకి కేటాయించాలని నిర్ణయిస్తే, మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మీద భారం పెంచేలా అడుగులు వేస్తుందని అనుమానించవలసి వస్తుందన్నారు. ఉపాధి హామీ పథకంలో మోసాన్ని అరికట్టడానికి ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు మెమోరాండాలు సమర్పించాలని తీర్మానించినట్లు తెలిపారు.
జంగారెడ్డిగూడెం: చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. ఆదివారం స్థానిక ఫైర్‌స్టేషన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా.. కారులో వస్తున్న ఇద్దరు వ్యక్తులను, బైక్‌పై వస్తున్న ఒక వ్యక్తిని ఆపి, ప్రశ్నించగా చోరీ కేసులు బయట పడ్డాయి. అరెస్టు చేసిన వారిలో మండలంలోని పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన ముత్యాల గణేష్, శీలం ఆంజేయులు, కటూరి సుబ్రహ్మణ్యం ఉన్నారు. వీరిపై జంగారెడ్డిగూడెం, లక్కవరం, ఏలూరు రూరల్, టి.నరసాపురం, ద్వారకాతిరుమల, తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఉన్నాయన్నారు. తిరుపులాపురం కేసులో రూ.50 వేల చోరీ సొత్తు, ఏలూరు రూరల్ స్టేషన్ కేసులో కారు దొంగతనం కేసులో రూ. 1.70 లక్షల విలువైన కారును, టీ.నరసాపురంలో జరిగిన రెండు కేసుల్లో రూ.లక్ష విలువైన చోరీ సొత్తు, ద్వారకాతిరుమల కేసులో రూ.50 వేలు విలువైన బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్ ఆస్పత్రిలో ఈనెల 11 నుంచి 14 వరకు అమెరికా, ఇండియాకు చెందిన వైద్యుల బృందం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో 56 మంది రోగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆదివారం తెలిపారు. అందులో భుజం, మోచేయి, తుంటి సమస్యలతో బాదపడుతున్న 20 మంది రోగులకు ఉచితంగా, అత్యాధునిక పద్ధతిలో విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేసినట్టు చెప్పారు. ఇవి తమ వైద్య సాఫల్యానికి ఉదాహరణగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా వైద్యుల బృందాన్ని చైర్మన్ అభినందించారు. ఈ శిబిరంలో వైద్యులు శ్రీనాధ్ కామినేని (యూఎస్‌ఎ), భవ్య చాంద్, కృష్ణ కిరణ్, శ్రీనివాస్ కంభంపాటి (ఇండియా), విర్డ్ ఆస్పత్రి ట్రస్ట్ సభ్యులు వి.నారాయణ మూర్తి, ఎస్‌వీఎన్‌ఎన్ నివృతరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, వైద్యులు హమీద్, బాలాజీ, పీవీ నాగేంద్ర బాబు, సింధు, రమ్య, మహిత తదితరులు పాల్గొన్నారు.


