నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు | - | Sakshi
Sakshi News home page

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు

Dec 11 2025 8:18 AM | Updated on Dec 11 2025 8:18 AM

నేరాల

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు

ఏలూరు టౌన్‌: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక నేరాలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాను భీమడోలు సర్కిల్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.35 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ ఈమేరకు వివరాలు వెల్లడించారు.

ద్వారకాతిరుమలలో చోరీలు

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన కనిగొళ్ళ లక్ష్మీ కాశీవిశ్వనాథం తన కుటుంబంతో అశ్వారావుపేటలోని తన చెల్లెలు ఇంటికి వెళ్లగా ఈనెల 2న తెల్లవారుజామున దొంగలు ఇంటిలో ప్రవేశించి రూ.1.70 లక్షల నగదు, రెండు కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అదేరోజు అదే గ్రామంలోని పోలుబోయిన లక్ష్మయ్య ఇంటిలోనూ జొరబడి సుమారు 7 కాసుల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. వీటిపై ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ కేపీ శివకిషోర్‌ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్‌ పర్యవేక్షణలో భీమడోలు సీఐ యూజే విల్సన్‌ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్‌ తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులు వీరే..

జంగారెడ్డిగూడెం డాంగే నగర్‌కు చెందిన పోలవరపు నాగదుర్గాప్రసాద్‌.. ఇతనిపై గతంలో 90 చోరీ కేసులు, 3 గంజాయి కేసులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం వీవర్స్‌కాలనీకి చెందిన యర్రసాని లక్ష్మణ్‌.. ఇతనిపై గతంలో 80 చోరీ కేసులు, 3 గంజాయి కేసులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం రామారావుపేటకు చెందిన గుత్తుల రవికుమార్‌.. ఇతనిపై గతంలో 26 చోరీ కేసులు, 3 గంజాయి కేసులు ఉన్నాయి. ఇక ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన చోరీ సోత్తు రిసీవర్‌ విశాఖ వసంత అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరివద్ద నుంచీ రూ.22 లక్షల విలువైన 184.37 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.11 లక్షలు విలువైన మూడు కేటీఎం బైక్‌లు, ఒక బుల్లెట్‌ వాహనం, రూ. 2 లక్షల నగదు.. మొత్తంగా రూ.35 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన భీమడోలు సీఐ యూజే విల్సన్‌, ద్వారకాతిరుమల ఎస్సై టీ.సుధీర్‌, కానిస్టేబుళ్లు సీహెచ్‌ లక్ష్మీనారాయణ, ఎన్‌.శివకృష్ణ, ఎం.వెంకటేశ్వరరావు, హోంగార్డు వీ.జయప్రకాష్‌బాబును జిల్లా ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు.

చెడు వ్యసనాలకు బానిసగా మారి..

గణపవరంలో చెడు వ్యసనాలకు బానిసైన బల్లారపు శ్యాంబాబు, పోలిమాటి కృష్ణకిషోర్‌ తమ ఇంటి సమీపంలోని నక్కల కృష్ణ ఇంటిలో చోరీకి పాల్పడి బంగారు, వెండి వస్తువులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నిడమర్రు సీఐ ఎన్‌.రజనీకుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై ఏ.మణికుమార్‌ తన సిబ్బందితో కేసును దర్యాప్తు చేశారు. గణపవరం చాణక్య కాలేజీ సమీపంలో బుధవారం నిందితులు శ్యాంబాబు, కృష్ణకిషోర్‌లను అరెస్ట్‌ చేసి రూ.2.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన గణపవరం ఎస్సై మణికుమార్‌, హెచ్‌సీ శంకరరావు, కానిస్టేబుల్‌ శివాజీ, హోంగార్డు జగపతిని ఎస్పీ కేపీ శివకిషోర్‌ అభినందించారు.

చోరీ సొత్తు బాధితులకు అప్పగింత

జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న ఓ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన దోపిడీ లక్కవరంలో కలకలం రేపింది. ఆ దొంగల ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు పట్టుకుని బాధితులకు సొమ్ము అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. లక్కవరం గ్రామంలోని లక్ష్మీ అంజనికుమారి, రుక్కయ్య దంపతులు సెప్టెంబర్‌ 22న ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, వారిపై దాడి చేసి, బీరువాలో ఉన్న 40 కాసుల బంగారం, 2 కిలోల వెండిని చోరీ చేశారు. ఈ కేసును అప్పటి ఇన్‌చార్జి సీఐ టి.క్రాంతికుమార్‌ దర్యాప్తు చేసి నలుగురు నిందితులు అంగడి విల్సన్‌బాబు, గజ్జెలవాసు, దేవర శ్రీరామమూర్తి, షేక్‌ బాజీను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో నిందితుడు కావేది ప్రసాద్‌ని నవంబర్‌ 12, 2025న ప్రసుత్త సీఐ ఎంవీ సుభాష్‌ అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.40 లక్షలు విలువైన బంగారు వస్తువులు, రూ.3 లక్షలు విలువైన వెండి వస్తువులు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, రెండు కర్రలు, మోటార్‌సైకిల్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఉత్తర్వులు మేరకు బుధవారం ఏఎస్పీ సుస్మిత రామనాథన్‌ బాధితులు లక్ష్మీ అంజనికుమారి, రుక్కయ్య దంపతులకు చోరీ సొత్తు అప్పగించారు. కార్యక్రమంలో సీఐ ఎంవీ సుభాష్‌, ఎస్సైలు ఎన్‌వీ ప్రసాద్‌, షేక్‌ జబీర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో నేరాలకు పాల్పడిన దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. ద్వారకాతిరుమలలో జరిగిన చోరీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్‌ చేసి రూ.35 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులకు వణుకు పుట్టించేలా వీరిని భీమడోలు జంక్షన్‌ నుంచి భీమడోలు కోర్టు వరకు ద్వారకాతిరుమల పోలీసులు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో జరిగిన చోరీకి సంబంధించి నిందితులను అరెస్ట్‌ చేసి బాధితులకు సొమ్ము అప్పగించారు. గణపవరంలో మరో చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

భీమడోలు సర్కిల్‌ పరిధిలో దొంగల ముఠా అరెస్ట్‌

రూ.35 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

లక్కవరంలో మరో చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

రూ.43 లక్షల విలువైన చోరీ సొత్తు బాధితులకు అప్పగింత

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు 1
1/1

నేరాలు చేశారు.. పోలీసులకు చిక్కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement