శ్రీవారి దేవస్థానం ఈఓ పోస్టుకు పైరవీలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరినోట వినిపిస్తున్న మాట.. నెక్ట్స్ దేవస్థానం ఈఓ ఎవరూ. ఎందుకంటే చినవెంకన్న దేవస్థానం ఈఓ సీటుకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అయితే రోజుకో అధికారి పేరు తెరమీదకు వస్తుండటంతో దీనిపై చర్చ విస్తృతంగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే. ప్రస్తుతం శ్రీవారి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి ఈనెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. అయితే ఆ పోస్టును దక్కించుకునేందుకు కొందరు అధికారులు ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆ పోస్టు ఎవరిని వరిస్తుందనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే తెరమీదకొచ్చిన అధికారులు ఇద్దరు, ముగ్గురు కాగా.. తెరవెనుక మరి కొందరు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అద్దయ్యకు అదృష్టం అందేనా..
ఈఓ సీటు కోసం ప్రయత్నిస్తున్న వారిలో అద్దయ్య పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన గతంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవోగా పనిచేశారు. ఆలయంలో కొందరు అధికారుల సహాయంతో అద్దయ్య ఇప్పటికే చురుగ్గా అడుగులు ముందుకేసినట్టు తెలుస్తోంది. గోపాలపురం ఎమ్మెల్యే సైతం అద్దయ్యను సిఫార్సు చేస్తూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లేఖ పంపినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే అద్దయ్య కాకుండా వాడపల్లి దేవస్థానం ఈఓ చక్రధరరావు, మరో ఆర్డీవో సైతం ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేసి మంగళవారం బదిలీ అయిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావు సైతం ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇటీవల ద్వారకాతిరుమలలోని ఓ టీడీపీ నేతను కలసి, చర్చించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆశీస్సులు ఉన్న వారే ఈఓగా వచ్చే అవకాశం ఉందనేది బహిరంగ రహస్యం.
శ్రీవారి దేవస్థానంపైనే మక్కువ..
రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో ఈఓగా పనిచేయడానికి ఇష్టపడని అధికారులు.. ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా పనిచేయడానికి మక్కువ చూపుతున్నారు. దానికి కారణం.. రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిళ్లు ఇక్కడ తక్కువ. ఈఓగా ఎవరొచ్చినా దేవస్థానం సిబ్బంది తమ సహకారాన్ని పూర్తిగా అందిస్తారు. ఇతర దేవాలయాల్లో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు అన్నవరం, సింహాచలం, విజయవాడ దేవస్థానాలపై రాజకీయ ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేదే శాసనం. దాంతో రాజకీయ నాయకులు చెప్పే మాట అధికారులు వినక తప్పదు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల అండదండలతో రెచ్చిపోయే కొందరు సిబ్బందిని కూడా ఈఓలు భరించక తప్పదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒత్తిళ్లను తట్టుకుని సమర్థవంతంగా పనిచేయగలరనే పేరున్న వేండ్ర త్రినాథరావు బుధవారం అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టారు. నిన్న మొన్నటి వరకు ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా త్రినాథరావు వస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పటికీ కొందరు సిబ్బంది ఆయనే ఈఓగా వస్తారని అంటున్నారు. మరో పదిహేను రోజుల్లో ఈఓ ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నెలాఖరున రిటైర్డ్ కానున్న ప్రస్తుత ఈఓ మూర్తి
ఆ పోస్టు కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు
చైర్మన్ ఆశీస్సులు ఎవరికీ దక్కేనో..


