నాయకులు, కార్యకర్తల కృషి అమోఘం
మాజీ మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసే చంద్రబాబు సర్కారు కుట్రకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో సంతకాలు చేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. కోటి సంతకాల సేకరణలో పూర్తి సహకారం అందించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు సంపద సృష్టించి సంక్షేమాన్ని అందరికీ అందిస్తానని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నేటికి రూ. 2.66 లక్షల కోట్ల అప్పులు చేశారని, కేవలం రూ.5 వేల కోట్లు వెచ్చిస్తే పూర్తిగా అందుబాటులోకి వచ్చే ప్రభుత్వ వైద్య కళాశాలలను దుర్మార్గంగా ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడం వల్ల జగన్‌మోహన్‌రెడ్డికో, కారుమూరికో మంచి జరగడానికి కాదని పేదలకు అందాలనే ప్రధాన ఉద్దేశంతోనే అందుబాటులోకి తీసుకువచ్చారని స్పష్టం చేశారు.


