కూటమికి పట్టదు.. జనానికి తప్పదు
ద్వారకాతిరుమల: భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారిలోని సూర్యచంద్రరావుపేట వద్ద రోడ్డు ధ్వంసం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నివారించేందుకు స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు స్వచ్ఛందంగా రహదారికి మరమ్మతులు చేపట్టారు. అయినా సంబంధిత అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
తరచూ ప్రమాదాలు జరుగుతున్నా..
క్షేత్ర ప్రధాన రహదారి ధ్వంసం కావడంతో తరచూ భక్తులు, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు పంగిడిగూడెం, లక్ష్మీపురం విర్డ్ ఆస్పత్రి వద్ద రహదారిపై హ్యాష్ ట్యాగ్‌తో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అవి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేలా ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించారు. ఇదిలా ఉంటే గతనెల 2న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ జేకే మహేశ్వరి రాకను పురస్కరించుకుని, ముందురోజు ఆర్‌అండ్‌బీ అధికారులు భీమడోలు నుంచి ద్వారకాతిరుమల వరకు రోడ్డుపై ఉన్న గోతుల్లో కంకర రాళ్లను వేసి పూడ్చారు. తారు పోయకపోవడంతో ఆ రాళ్లు పైకిలేచి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తరచూ సూర్యచంద్రరావుపేట వద్ద మలుపులో ఉన్న గోతుల్లో పడి ద్విచక్ర వాహనదారులు క్షతగాత్రులవుతున్నారు. కార్లు, ఇతర వాహనాలు దెబ్బతింటున్నాయి.
ప్రమాదాలను చూడలేక..
ఈ ప్రమాదాలను చూడలేక స్థానికులు ఇటీవల ఎరుపు రంగు పరుపును మలుపులో హెచ్చరికగా ఏర్పాటు చేశారు. గతనెల 22న దాన్ని తప్పించే క్రమంలో ఓ కారు పక్కనే వెళుతున్న ఏలూరు ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు మీదకు వెళ్లడంతో, ఆ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన తోటలోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. అయినా ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో గోతులను పూడ్చలేదు. దాంతో రెండు రోజుల క్రితం గ్రామస్తులు మలుపు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే కాంక్రీటుతో ఆ గోతులను పూడ్చి, అటుగా వాహనాలు వెళ్లకుండా కర్రలు పెట్టారు. రోడ్డుపై భక్తులు, ప్రయాణికులు పడుతున్న బాధలను చూసి స్థానికులు చలిస్తున్నారే గానీ.. పాలకులు, అధికారుల్లో మాత్రం చలనం కలగకపోవడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రోడ్లు వేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వంపై, కళ్లకు గంతలు కట్టుకున్న పాలకులు, అధికారులపై భక్తులు, ప్రయాణికులు మండిపడుతున్నారు.
అధ్వానంగా ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారి
తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు
విసుగెత్తి స్వచ్ఛందంగా గోతులు పూడ్చుతున్న స్థానికులు
కూటమికి పట్టదు.. జనానికి తప్పదు


