కోకో గింజలు ఆరబెడితే రైతుకు లాభదాయకం
పెదవేగి : కోకో గింజలను ఆర బెడితే గింజల్లో తేమశాతం సమతుల్యంగా ఉంటుందని, దానివల్ల గింజల్లో నాణ్యత పెరిగి రైతుకు లాభదాయకంగా ఉంటుందని విజయరాయి ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ మాధవిలత అన్నారు. పెదవేగి మండలం జగన్నాధపురం, కొండలరావుపాలెం గ్రామాల్లో కోకో రైతులకు మంగళవారం పెదవేగి మండల ఉద్యాన శాఖ అధికారి ఎం.రత్నమాల ఆద్వర్యంలో అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో శాస్త్రవేత్త డాక్టర్ మాధవిలత మాట్లాడుతూ కోకో గింజలను కల్లాల్లో నేలపై టార్ఫాలిన్లు వేసి ఆరబెట్టడం వల్ల గింజ నాణ్యత తగ్గి తూకానికి రాక నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందన్నారు. ఇందుకుగాను ఉద్యాన శాఖ అందజేస్తున్న చెక్కతో తయారు చేసిన మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్స్‌ను వినియోగించాలన్నారు. సోలార్ కోకో డ్రయ్యర్‌లు రూ.లక్షా 40 వేల సబ్సిడీతోను, ప్యాక్ హౌస్‌లకు రూ. 2 లక్షలు సబ్సిడీ ద్వారా అందజేస్తున్నట్టు మాధవిలత తెలిపారు. చెక్క ప్లాట్‌పామ్స్ వల్ల గింజల్లో తేమ శాతం కావాల్సినంత ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉద్యాన శాఖ సహాయకులు రైతులు పాల్గొన్నారు.


