
25 నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిఽధిలోని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా తేనెటీగల పెంపకంపై ఈ నెల 25, 29, 31 తేదీల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేవీకే సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి తెలిపారు. అంతరించిపోతున్న తేనెటీగలను రక్షించుకోడానికి, కుటీర పరిశ్రమ ద్వారా లాభాలను పొందడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక ఎకరాకు ప్రారంభంలో రూ.20 నుంచి రూ.25 వేల పెట్టుబడితో మొదలు పెట్టి రెండు మూడు రెట్లు ఆదాయం తేనెద్వారా. పుప్పొడి, ఇతర ఉత్పత్తులు మైనం, విషం ద్వారా పొందవచ్చునన్నారు. ఆసక్తి కలిగిన వారు ఎనిమిది ఫేమ్‌లు కలిగిన పెట్టె కోసం రూ.5500, ఐదు ఫేమ్‌లు ఉన్న పెట్టెల కోసం రూ.4500 ధరతో కేవీకేలో సిద్ధంగా ఉంచామన్నారు. వివరాల కోసం 73826 33692, 94905 05926 నంబర్లలో సంప్రదించాలన్నారు.
20న బాస్కెట్‌బాల్ బాలికల జట్టు ఎంపిక
ఏలూరు రూరల్: ఈ నెల 20వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జూనియర్ స్థాయి బాలికల జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె కృష్ణారెడ్డి, కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు కస్తూరిభా బాలికల పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారిణిలు 2007 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. ఎంపికై న జట్టు ఆగస్టు 14 నుంచి 17 వరకూ పిఠాపురంలో జరిగే అంతర జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటుందని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారిణులు ఒరిజినల్ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు అసోసియేషన్ ట్రెజరర్ కె మురళీకృష్ణ 94411 71933 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
2.8 కిలోల గంజాయి స్వాధీనం
భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలోని గునుపూడి రైల్వే అండర్ పాస్ వద్ద మంచినీటి సర్వీసు రిజర్వాయరు సమీపంలో రూ.60 వేలు విలువైన 2.862 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ సంచుల్లో గంజాయి కలిగి ఉన్న నిందితులు నాయక్ కరుణాకర్, నీలపు దుర్గాప్రసాద్, గాడిన ప్రభుకుమార్, జెండా నాగరాజును మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ ఎం.నాగరాజు పర్యవేక్షణలో ఎస్సై కృష్ణాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.