
రయ్.. రయ్..
ప్రాణాలు పోతున్నాయ్ !
మైనర్ల డ్రైవింగ్‌ను తీవ్ర ఉల్లంఘనగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తమ చేతికి చిక్కిన మైనర్ల నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుని వారి తండ్రులపై కేసులు నమోదుచేశారు. వీటికి సంబంధించి 55 మంది తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి.
ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వారికి నివాళులర్పిస్తూ రోడ్ల పక్కన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఫ్లెక్సీల్లో వయసు పైబడిన వారి కంటే 20 నుంచి 25 ఏళ్లలోపు యువకుల ఫొటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో అధిక శాతం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారే ఉండటం ఆందోళన కలిగిస్తున్న
అంశం.
సాక్షి, భీమవరం: జిల్లాలోని రోడ్లపై రయ్‌మంటూ హల్‌చల్ చేస్తున్న మైనర్లు, ఆకతాయిల కట్టడికి చర్యలు నామమాత్రంగానే ఉండటంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. భీమవరంలోని విష్ణు కళాశాల రోడ్డు, ఎస్‌ఆర్‌కేఆర్ కాలేజీ రోడ్డు, తణుకులోని రాష్ట్రపతి, వేల్పూరు, సొసైటీ, ఉండ్రాజవరం రోడ్లు, తాడేపల్లిగూడెంలో శశి కళాశాల, నిట్ కళాశాల రోడ్లు, నరసాపురంలో వైఎన్ కళాశాల, గోదావరి బండ్, వలందర్ రేవు ఏరియా, రుస్తుంబాద రోడ్లు, పాలకొల్లులోని దిగమర్రు, దొడ్డిపట్ల రోడ్లల్లో ఆకతాయిలు మోటారు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. వీరిలో అధికంగా మైనార్టీ తీరని వారు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారే ఉంటున్నారు. హైవేల్లో అయితే వీరి వేగానికి అంతే ఉండటం లేదు.
జైలు శిక్షలు ఉన్నా..
16 ఏళ్లలోపు వారు ఎలాంటి వాహనాలనూ నడపకూడదు. 18 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే గేర్ల వాహనాలు నడిపేందుకు అర్హులు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన పేరెంట్స్/ వాహన యజమానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉంది.
13 మందికి పైగా మృతి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా మూడు నెలల్లో భీమవరం, నూజివీడు, సీసలి, జంగారెడ్డిగూడెం, మొగల్తూరు తదితర చోట్ల జరిగిన వేర్వేరు మోటారు సైకిళ్ల ప్రమాదాల్లో 13 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వీరిలో వాహనాన్ని నడుపుతున్న వారు కొందరైతే, దారిన వెళుతున్న వారు మరికొందరు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా బయటే సెటిల్‌మెంట్ చేసుకున్న ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారు ఎందరో ఉన్నారు. జిల్లా పో లీస్, రవాణశాఖ అధికారులు పూర్తిస్థాయిలో రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించడం ద్వారా ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
నిబంధనలపై అవగాహన లేమి
కుమారుడు మోజు పడ్డాడనో, చెప్పినట్టుగా చదువుకుంటాడనో, తమ స్టేటస్ సింబల్‌గానో.. ఏదైనా గాని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల వయసు, సామర్థ్యానికి మించి అధునాతన బైక్‌లను కొనిస్తుంటే, మరోపక్క ఆకతాయిలు జీరో ఫైనాన్స్‌పై వాహనాలు తీసుకుని హల్‌చల్ చేస్తున్నారు. మట్టి రోడ్డులో ఎలా నడపాలి? తారు రోడ్డుపై ఇసుక ఉంటే ఎలా కంట్రోల్ చేయాలి? ఏ రోడ్డులో ఎంత వేగంతో వెళ్లాలి ? ట్రాఫిక్ నిబంధనలేమిటి? మలుపుల వద్ద ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి? ఇవేమీ అవగాహన లేకుండానే బైక్‌లపై చక్కర్లు కొడుతున్నారు. ఇంటి వద్ద తల్లిదండ్రుల భయం లేకపోవడమో, తమను ఎవరూ ఏమీ చేయరన్న భావనతోనో ఒకే బైక్‌పై ముగ్గురు, నలుగురు కూర్చుని నిర్ల్యక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒక్కోసారి అదుపుతప్పి వారు ప్రమాదానికి గురై కన్నవారికి తీరని శోకాన్ని మిగల్చడంతో పాటు దారిన వెళ్లే అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు.
టెర్రర్ డ్రైవింగ్
బైక్‌లపై మైనర్లు, ఆకతాయిల హల్‌చల్
ప్రాణాంతకంగా పరిణమిస్తున్న ర్యాష్ డ్రైవింగ్
వాహనచోదకులు, ప్రయాణికుల బెంబేలు
కఠిన చట్టాలున్నా చొరవ చూపని అధికారులు
ఉమ్మడి జిల్లాలో మూడు నెలల్లో
13 మందికి పైగా మృత్యువాత
కేసులు నమోదు చేస్తున్నాం
మైనర్లు, ర్యాష్ డ్రైవింగ్‌లను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నాం. వాహనాలకు సంబంధించి సరైన రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. మూడు నెలల్లో జిల్లాలో వెయ్యికి పైగా కేసులు నమోదుచేశాం.
– ఉమామహేశ్వరరావు,
జిల్లా రవాణశాఖ అధికారి, భీమవరం

రయ్.. రయ్..

రయ్.. రయ్..