పోలీస్‌ స్టేషన్‌లో ఇంటి దొంగలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో ఇంటి దొంగలు

Mar 19 2025 1:03 AM | Updated on Mar 19 2025 1:14 AM

● ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో ప్రాపర్టీ, రికార్డులు మాయం ● జంగారెడ్డిగూడెం డీఎస్పీ విచారణ

ఏలూరు టౌన్‌: జిల్లా కేంద్రం ఏలూరు పోలీస్‌ స్టేషన్లలో అవినీతి, అక్రమాలకు కొదవలేదు. పోలీస్‌ ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నా... నిఘా విభాగం పనిచేస్తున్నా ... పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తోన్న సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దొరికినకాడికి కాజేస్తూ ఉంటారు. ఇదే తరహాలో ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రాపర్టీ మిస్సింగ్‌ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై జిల్లా పోలీస్‌ బాస్‌ చర్యలు చేపట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇంటి దొంగలను పట్టుకునేందుకు పోలీస్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే స్టేషన్‌ రైటర్‌ను సస్పెండ్‌ చేయగా... ఏం జరిగిందనే అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. త్రీటౌన్‌ స్టేషన్‌లో ఆయా కేసులకు సంబంధించి ప్రాపర్టీ, ఇతర రికార్డులు మాయమైనట్లు తెలుస్తోంది. వివిధ కేసులకు సంబంధించిన ప్రాపర్టీ, నగదు, ఇతర రికార్డులన్నీ భద్రం చేయాలి. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ మారిన వెంటనే వాటికి సంబంధించిన వివరాలు సరిచూసుకోవడం పరిపాటి. ఈ నేపథ్యంలో ఏలూరు త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు పాత రికార్డులు, ప్రాపర్టీ వివరాలు ఆరా తీయగా.. కొన్ని రికార్డులు, ప్రాపర్టీ మాయమైనట్లు గుర్తించారంటున్నారు. రూ.2 లక్షలకు పైగా నగదు కూడా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవాలు ఏమిటనేది విచారణలో తేలనుంది.

విచారణకు ఎస్పీ ఆదేశాలు

రికార్డులు, ప్రాపర్టీ మాయంపై జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ సీరియస్‌ అయ్యారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్రకు విచారణ బాధ్యతలు అప్పగించారు. ప్రాథమిక విచారణలో త్రీటౌన్‌ రైటర్‌ను సస్పెండ్‌ చేయగా.. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పాత్ర.. ఇతర పోలీస్‌ అధికారులు పాత్రపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గత రెండేళ్ళ క్రితం నుంచి పనిచేసిన పోలీస్‌ అధికారులను విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో గత ఏడాది ఏసీబీ ట్రాప్‌లో ఒక కానిస్టేబుల్‌ దొరికిపోయారు. ఈ ఏసీబీ దాడిలో సీఐ, ఎస్‌ఐలు పాత్రధారులుగా ఉండగా, సంబంధం లేని కానిస్టేబుల్‌ను బలిచేశారని పోలీస్‌ వర్గాల్లో జోరుగా చర్చసాగింది. ఐదేళ్ళ క్రితం ఇదే త్రీటౌన్‌ స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌ స్టేషన్‌లోని ప్రాపర్టీని సొంత అవసరాలకు వాడుకోగా ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఇదే తరహాలో గతంలో పెదవేగి పోలీస్‌స్టేషన్‌లోను ప్రాపర్టీని హెడ్‌కానిస్టేబుల్‌ వాడుకుని, చాలా రోజులు సెలవుపై వెళ్ళిపోయారనే అంశంపై పెద్ద చర్చ సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement